- నాగర్‌కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లిలో పైలెట్ ప్రాజెక్టు
- అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
- వంట గ్యాస్ స్థానంలో సోలార్ పవర్
- అటవీ, వివిధ శాఖల భూముల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి
- ఏటా 40 వేల మెగావాట్ల కరెంట్ అందుబాటులో ఉండేలా యాక్షన్ ప్లాన్
- విద్యుత్ శాఖపై సమీక్షలో సీఎం నిర్ణయాలు
హైదరాబాద్, వెలుగు : రైతులకు సోలార్ పంప్ సెట్లను ఉచితంగా అందించి, వాళ్లను సోలార్ విద్యుత్ వైపు ప్రోత్సహించాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఇందుకోసం నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లిలో పైలెట్ ప్రాజెక్టు చేపట్టాలని చెప్పారు. సోలార్ పంప్ సెట్ల ద్వారా వచ్చే మిగులు విద్యుత్‌తో రైతులకు ఆదాయం వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. బుధవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సోలార్ విద్యుత్ వినియోగం పెరిగేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ‘‘వ్యవసాయానికి ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం. ఇందుకోసం ఏటా డిస్కమ్ లకు పెద్ద ఎత్తున సబ్సిడీ చెల్లిస్తున్నాం. రైతులకు ఫ్రీగా సోలార్ పంప్ సెట్లను అందజేస్తే.. అటు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందడంతో పాటు మిగులు విద్యుత్ తో రైతులకు ఆదాయం సమకూరుతుంది. ఈ మేరకు యాక్షన్ప్లాన్సిద్ధం చేయాలి” అని చెప్పారు. అటవీ భూములతో పాటు వివిధ శాఖలకు సంబంధించి వినియోగంలో లేని భూముల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ‘‘వంటగ్యాస్ కు బదులుగా సోలార్ పవర్ విధానాన్ని ప్రోత్సహించాలి. వీటిపై మహిళా సంఘాలకు శిక్షణ అందించి, వారిని సోలార్ పవర్ బిజినెస్ వైపు ప్రోత్సహించాలి” అని తెలిపారు.
దుబారాను తగ్గించాలి..
విద్యుత్‌విషయంలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి, దుబారాను తగ్గించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ‘‘రానున్న రోజుల్లో తెలంగాణ ఒక బిజినెస్ హబ్ గా మారబోతున్నది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ అందుబాటులో ఉండేలా చూడాలి. ఐటీ, ఇండస్ట్రియల్ శాఖలతో సమన్వయం చేసుకుని యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలి. డిమాండ్ కు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు కావాల్సిన చర్యలు చేపట్టాలి. ప్రతిఏటా 40 వేల మెగావాట్ల విద్యుత్ అందుబాటులో ఉండేందుకు చర్యలు తీసుకోవాలి.
ఓవర్ లోడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. ఒక్క నిమిషం కూడా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉండొద్దు. వినియోగదారులకు 24గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలి” అని ఆదేశించారు. సమీక్ష సమావేశంలో ఎనర్జీ సెక్రటరీ రొనాల్డ్ రాస్, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్, టీఎస్ఎన్పీడీసీఎల్సీఎండీ వరుణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.