- సంక్రాంతి కానుకగా పదవులు ఆశిస్తున్న కాంగ్రెస్‌నేతలు
- ఎమ్మెల్సీ రేసులో మరికొందరు ముఖ్యులు
- ముగ్గురు మంత్రుల అనుచరుల మధ్య పోటాపోటీ
- పదవుల కోసం గాడ్ ఫాదర్ల ద్వారా ప్రయత్నాలు
ఖమ్మం, వెలుగు : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో కీలకపాత్ర పోషించిన లీడర్ల ఆశలన్నీ నామినేటెడ్ పోస్టులపైనే ఉన్నాయి. రద్దయిన కార్పొరేషన్ల చైర్మన్లు, ఇతర నామినేటెడ్ పోస్టులను సంక్రాంతి వరకు భర్తీ చేస్తామని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. పదేళ్లుగా పార్టీని కాపాడుకుంటూ వచ్చిన వారికి ప్రయారిటీ ఉంటుందని కూడా చెప్పారు. దాదాపు 20 కార్పొరేషన్లను రెండు వారాల్లోగా భర్తీ చేసే చాన్స్ ఉండడంతో తొలి విడతలోనే పదవి దక్కేలా ఉమ్మడి జిల్లాలోని ముగ్గురు మంత్రులు, ముఖ్య నేతల చుట్టూ ఆశావహులు ప్రదక్షిణలు చేస్తున్నారు.
ఆశావహుల సంఖ్య ఎక్కువే..
- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అనుచరులుగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, లీడర్లు రాయల నాగేశ్వరరావు, మహ్మద్ జావేద్ నామినేటెడ్ పదవులు ఆశిస్తున్నారు.
- రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అనుచరులుగా మువ్వా విజయ్ బాబు, బొర్రా రాజశేఖర్, తుళ్లూరి బ్రహ్మయ్య, ముదిరెడ్డి నిరంజన్‌రెడ్డి, స్వర్ణకుమారి పోటాపోటీ పడుతున్నారు.
- వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుచరులుగా సాదు రమేశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కమర్తపు మురళి, చావా నారాయణరావు పదవులు దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
- మాజీ కేంద్రమంత్రి రేణుకాచౌదరి అనుచరులు పదవులు ఆశిస్తున్నారు. మద్ది శ్రీనివాస్ రెడ్డి, ముస్తాఫా, నరేందర్ కూడా పదవుల రేసులో ఉన్నారు.
- వీళ్లంతా అవకాశం వచ్చిన ప్రతిసారి తమ గాడ్ ఫాదర్లను, సీఎం రేవంత్ సహా ఇతర ముఖ్య నేతలను కలుస్తున్నారు. వీరిలో కొందరు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ పోస్టులను ఆశిస్తుండగా, మరికొందరు ఇటీవల వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన సీటుపైన కన్నేశారు. ఖమ్మంలో సుడా చైర్మన్, మార్కెట్‌కమిటీ చైర్మన్పదవులు నామినేటెడ్ పోస్టులు కూడా ఉన్నాయి.
- ప్రస్తుతం బీఆర్ఎస్ చేతిలో ఉన్న డీసీసీబీ చైర్మన్, ఖమ్మం మేయర్, ఇతర మున్సిపల్ చైర్మన్ పదవులపైనా కొందరు కాంగ్రెస్ నేతలు ఆశలు పెట్టుకున్నారు. మెజార్టీ సభ్యులను కాంగ్రెస్ లోకి చేర్చుకోవడం ద్వారా ఆయా పదవులను దక్కించుకోవాలని భావిస్తున్నారు. ముగ్గురు మంత్రుల మధ్య సమన్వయం సాధించి, వారి అనుచరులను పదవులతో సంతృప్తి చేయడంపై పూర్తి స్థాయిలో కసరత్తు చేసిన తర్వాత పదవులను ప్రకటించే అవకాశం ఉంది.
పదేళ్లుగా పదవులు దక్కినోళ్లు..
గత పదేళ్లలో ఉమ్మడి జిల్లా నుంచి నలుగురైదుగురికి రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్ పదవులు దక్కాయి. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా కొండబాల కోటేశ్వరరావు సుదీర్ఘకాలం పనిచేశారు. అంతకుముందు ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా బుడాన్ బేగ్, ట్రైకార్ చైర్మన్ గా వెంకటేశ్వర్లు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా పిడమర్తి రవి, రాష్ట్ర మార్క్‌ఫెడ్ వైస్ చైర్మన్‌గా బొర్రా రాజశేఖర్పనిచేశారు. ప్రస్తుతం పిడమర్తి రవి, బొర్రా రాజశేఖర్ పొంగులేటి వెంట కాంగ్రెస్‌లో చేరారు.