రైతు రుణమాఫీ విధివిధానాలు రూపొందించండి.. సీఎం రేవంత్ ఆదేశాలు

  రైతు రుణమాఫీ విధివిధానాలు రూపొందించండి.. సీఎం రేవంత్ ఆదేశాలు

రైతు రుణమాఫీ విధివిధానాలు రూపొందించాలని అధికారులను  సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించారు.  పంట రుణమాఫీపై అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్షించారు.  రూ.2లక్షల వరకు రుణాలు ఉన్న రైతుల జాబితాను సిద్ధం చేయాలన్నారు సీఎం.  పూర్తి స్థాయిలో బ్యాంకర్ల నుంచి రైతుల వివరాలు సేకరించి అర్హులను గుర్తించాలని సూచించారు.  కటాఫ్ డేట్ విషయంలో సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు .  

 కేవలం బ్యాంకుల నుంచే కాకుండా, పీఏసీఎస్ నుంచి పంట రుణాలు తీసుకున్న రైతుల వివరాలను అందుబాటులో ఉండేలా చూడాలన్నారు సీఎం రేవంత్.   రూ.2లక్షల రైతు రుణమాఫీ చేసేందుకు  పూర్తిస్థాయి వివరాలతో పాటు అవసరమైన అంచనా వ్యయాన్ని కూడా రూపొందించాలని అధికారులను ఆదేశించారు.  ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేసి తీరాలని సమీక్షలో సీఎం స్పష్టం చేశారు.  

కాగా  అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతులకు రూ 2లక్షల వరకు రైతు రుణ మాఫీ అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇవ్వగా.. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ప్రతి సభలోనూ ఆగస్టు 15 లోగా రుణమాఫీ అమలు చేస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణం చేస్తూ వచ్చిన విషయం తెలిసిందే.