- ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తుంది
- గత పదేండ్లలో రాష్ట్ర క్రీడా రంగాన్ని నిర్లక్ష్యం చేశారు
- రాష్ట్రాన్ని స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దుతాం
- ఇండియా అండర్17 ఫుట్‌బాల్ టీమ్‌ను దత్తత తీసుకున్నామని వెల్లడి
- సీఎం కప్ లోగో, మస్కట్ ఆవిష్కరణ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రాన్ని స్పోర్ట్స్ హబ్‌గా మార్చేందుకు కృషి చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 2028 ఒలింపిక్స్ లో దేశం తరఫున తెలంగాణ క్రీడాకారులు గోల్డ్ మెడల్స్ తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం రాష్ట్ర క్రీడాకారులకు పూర్తిస్థాయిలో శిక్షణ ఇచ్చి, వారిని అన్ని విధాలా ప్రోత్సహించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఈ నెల 21 నుంచి జరిగే చీఫ్ మినిస్టర్స్ కప్ (సీఎం కప్) క్రీడల మస్కట్, లోగో, పోస్టర్లను సీఎం రేవంత్ రెడ్డి గురువారం ఎల్బీ స్టేడియంలో ఆవిష్కరించారు.
క్రీడా జ్యోతిని వెలిగించి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం సీఎం మాట్లాడారు. ‘‘తెలంగాణలో క్రీడలను ప్రోత్సహించేందుకు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నాం. యంగ్ ఇండియా కోచింగ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేస్తాం. సౌత్ కొరియా కోచ్ లను ఇక్కడికి రప్పించి శిక్షణ ఇస్తాం. యువత వ్యసనాల వైపు వెళ్లొద్దు. క్రీడల్లో రాణిస్తే దేశ ప్రతిష్టను ప్రపంచంలో పెంపొందించే అవకాశం ఉంటుంది.
ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయి. బాక్సర్ నిఖత్ జరీన్, క్రికెటర్ మహ్మద్ సిరాజ్‌కు నిబంధనలు సడలించి మరీ డీఎస్పీ ఉద్యోగాలు ఇచ్చాం. తెలంగాణలో క్రీడల్లో రాణిస్తే ఎలాంటి ప్రయోజనం ఉంటుందనడానికి నిఖత్ జరీన్ నిదర్శనం. 2028లో దేశం తరఫున ఒలింపిక్స్‌లో పతకాలు సాధించాలని ఇప్పుడే ప్రతిజ్ఞ తీసుకోండి’’ అని సీఎం సూచించారు.
పదేండ్లలో క్రీడలపై నిర్లక్ష్యం
పాతికేండ్ల క్రితం ఆఫ్రో ఏషియన్ గేమ్స్ సహా ఇతర గేమ్స్‌కు ఆతిథ్యం ఇచ్చిన హైదరాబాద్ దేశానికి ఆదర్శంగా
నిలిచిందని సీఎం రేవంత్ తెలిపారు. ‘పీవీ సింధు, దివంగత ఫుట్‌బాల్ కోచ్ రహీమ్ వంటి వారితో నగరానికి మంచి పేరు వచ్చింది. కానీ, తెలంగాణ వచ్చిన తర్వాత గత ప్రభుత్వం క్రీడా రంగాన్ని నిర్లక్ష్యం చేసింది. దాంతో హైదరాబాద్ -యువత మత్తు, గంజాయికి అలవాటు పడుతుంటే ఎంతో బాధపడ్డం. అయితే, ప్రస్తుతం హైదరాబాద్ క్రీడలకు హబ్ గా మారేలా కృషి చేస్తున్నాం.
ఇండియా అండర్– 17 నేషనల్ ఫుట్‌బాల్ టీమ్‌ను తెలంగాణ దత్తత తీసుకోవాలని నిర్ణయించాం. ఆ జట్టు ఆటగాళ్లకు శిక్షణను హైదరాబాద్‌లో అందిస్తామని ఇండియా ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడితో మాట్లాడాను’ అని సీఎం చెప్పారు. ఎల్బీ స్టేడియాన్ని అద్బుతమైన స్టేడియంగా తీర్చిదిద్ది నగర క్రీడాకారులకు అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు.
సీఎం కావాలని లక్ష్యం పెట్టుకొని సాధించా..
క్రీడాకారులు స్పష్టమైన లక్ష్యాన్ని పెట్టుకొని కృషి చేయాలని సీఎం రేవంత్ సూచించారు. ఓటమి భయం లేకుండా ముందుకెళ్తే విజయం సాధ్యమవుతుందని.. అందుకు తానే ఉదాహరణ అన్నారు. ‘2018 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయిన నేను.. అత్యంత పెద్ద లోక్ సభ నియోజకవర్గం మల్కాజ్ గిరి నుంచి ఎంపీగా విజయం సాధించాను. నాడు ఎమ్మెల్యేగా ఓడిపోయిన నేను 2023లో తెలంగాణకు సీఎం అయ్యాను.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే సీఎం కావాలని లక్ష్యం పెట్టుకున్న.. సాధించాను’ అని చెప్పుకొచ్చారు. కార్యక్రమంలో క్రీడా సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (శాట్) చైర్మన్ శివసేనా రెడ్డి, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ప్రభుత్వసలహాదారు షబ్బీర్ అలీ, పీసీసీ ప్రెసిడెంట్ మహేశ్ గౌడ్, పారాలింపిక్ కాంస్య పతక విజేత జీవాంజి దీప్తి, స్విమ్మర్ వ్రితి అగర్వాల్ ఇతర క్రీడాకారులు పాల్గొన్నారు.
స్పెషల్ అట్రాక్షన్‌గా నిఖత్
రాష్ట్ర ప్రభుత్వం డీఎస్పీగా నియమించిన నిఖత్ జరీన్ యూనిఫాంలో వచ్చి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. డీజీపీ జితేందర్ సమక్షంలో వేదికపై సీఎం రేవంత్ ఆమెకు హోదా బాధ్యత (పైపింగ్ సెర్మనీ) అప్పగిస్తూ లాఠీని అందించారు. గత నేషనల్ గేమ్స్‌లో పతకాలు నెగ్గిన క్రీడాకారులకు పెండింగ్‌లో ఉన్న రూ.1.02 కోట్ల నగదు ప్రోత్సాహకంతో పాటు, 2023 సీఎం కప్ పతక విజేతలకు ప్రోత్సాహకంగా రూ.52.87 లక్షల చెక్కులను సీఎం పంపిణీ చేశారు. బీసీ రాయ్ ఫుట్‌బాల్ కప్ విన్నర్ తెలంగాణ జట్టుకు రూ. 2 లక్షల చెక్ అందించారు.