
- పారదర్శకంగా బీసీ కులగణన
- తప్పులుంటే చెప్పాలంటున్నం
- మిస్సయిన వాళ్లకోసం మళ్లీ చేస్తున్నం
- నిర్వీర్యం చేసేందుకు బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర
- కేసీఆర్ ఫ్యామిలీ జనాభా లెక్కల్లో లేదు
- 70 జాతుల ముస్లింలను ఓబీసీలో కలిపిందే మోదీ
- పనిచేసే నన్ను విలన్ అంటున్రు.. ఫాం హౌస్ లో పన్నోడిని హీరో అంటున్నరు
- మార్చి 10 లోపు రాష్ట్ర వ్యాప్తంగా కుల సంఘాలు మీటింగ్స్ పెట్టాలె
- అన్ని కులాల వాళ్లూ బాధ్యత తీసుకోవాలి
- యూనివర్సిటీల్లోనూ మీటింగ్స్ పెట్టాలని మేధావులను కోరుతున్నా
- కులగణన మెగా హెల్త్ చెకప్
- అసెంబ్లీలో తీర్మానం చేస్తే నా బాధ్యత పూర్తి
హైదరాబాద్: బీసీ రిజర్వేషన్ల కోసం చిత్తశుద్ధితో కులగణన చేపట్టామని, పారదర్శకంగా సర్వే నిర్వహించామని, దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత బీసీ సంఘాలది, పార్టీ బీసీ నేతలది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ బీసీ సంఘాల నాయకులు, పార్టీ బీసీ నేతలు, కార్పొరేషన్ల చైర్మన్లతో ప్రజాభవన్ లో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. సర్వే తప్పు తప్పంటూ బీఆర్ఎస్, బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారని, ఎక్కడ తప్పుందో చెప్పాలని అన్నారు. కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే నిర్వహిచి నాలుగు కేటగిరీలుగా చూపారని, తాము ఐదు కేటగిరీలుగా ఇచ్చామని, ముస్లింలను తాము ప్రత్యేకంగా జాబితాలో చేర్చలేదని, వాళ్లు ఎప్పటి నుంచో ఉన్నారని సీఎం క్లారిటీ ఇచ్చారు. బీసీ నేతలు కులగణనపై అవగాహన చేసుకోవాలని అన్నారు. ప్రతిపక్షాల ఉచ్చులో పడొద్దని చెప్పారు. బీసీలు నిలదీస్తే.. తమ పదవులు పోతాయని బీజేపీ, బీఆర్ఎస్‌లో రెండు వర్గాల వారు కుట్ర చేస్తున్నారన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి కొస్తే కులగణన చేస్తామని రాహుల్ గాంధీ మాటిచ్చారని, బలహీన వర్గాలు ముందుకొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయని, తమ నాయకుడు ఇచ్చిన మాటను నిలబెట్టేందుకే కులగణన చేపట్టామని సీఎం అన్నారు.
కేసీఆర్ కాకిలెక్కలు
కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే పేరుతో కాకిలెక్కలు చెప్పారని సీఎం అన్నారు. ఎస్సీల్లో 56 కులాలు ఉంటే 86 కులాలుగా సమగ్ర కుటుంబ సర్వేలో చూపించారని అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ కోర్టుల్లో కేసులు వేసి కులగణన ప్రక్రియను నిర్వీర్యం చేసే ప్రమాదం ఉందని గ్రహించే జాగ్రత్తగా సర్వే చేశామని, మిగిలిపోయిన కుటుంబాల వాళ్లు నమోదు చేసుకునేందుకు వీలుగా ఈ నెల 28 వరకు అవకాశం కల్పించామని, టోల్ ఫ్రీ నంబర్ ఇచ్చామని, ఆన్ లైన్ లో నమోదుకు అవకాశం కల్పించామని సీఎం వివరించారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు ఫ్యామిలీలు జనాభా లెక్కల్లోనే లేవని అన్నారు. పనిచేస్తున్న తనను విలన్ అని, ఫాం హౌస్ లో పండుకున్నోడిని హీరో అనడం విడ్డూరంగా ఉందని సీఎం అన్నారు.
మార్చి 10 లోపు మీటింగ్స్ పెట్టాలె
కులగణన చరిత్రాత్మకమని, బీహార్, హర్యానా రాష్ట్రాలకు పంపి అక్కడి కులగణను స్టడీ చేసి మెరుగైన విధానాన్ని ఎంచుకొని చేపట్టామని, ఒక్కో ఎన్యూమరేటర్ 150 ఇండ్లలో సర్వే చేశారని, పూర్తి పారదర్శకంగా చేశామని సీఎం వివరించారు. కులగణన కోసం ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీ వేశామని వివరించారు. 160 కోట్లు ఖర్చు చేసి యాభై రోజుల పాటు సర్వే చేశామని వివరించారు. మొత్తం కోటీ 12 లక్షల కుటుంబాలు సర్వేలో తమ వివరాలు నమోదు చేసుకున్నాయని అన్నారు. ఇప్పుడు తెలంగాణ జనాభా నాలుగు కోట్లు అని చెబుతున్నారని అన్నారు. తాము సేకరించిన ఆధారాలన్నీ ఉన్నాయని, వాటిని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం వివరించారు. కులగణనపై అన్ని కుల సంఘాలు మీటింగ్స్ పెట్టాలని, చరిత్రాత్మకమని తమతమ కులాల వారికి వివరించాని సీఎం కోరారు. మార్చి 10 లోపు పార్టీ బీసీ నాయకులంతా ఈ సమావేశాలపై దృష్టి పెట్టి పూర్తి చేయాలని అన్నారు.
బీసీలు 56.33 శాతం
తమ లెక్కల ప్రకారం బీసీలు 56.33 శాతం ఉన్నారని సీఎం చెప్పారు. కేసీఆర్ చెప్పిన కాకిలెక్కల ప్రకారం.. బీసీలు 51% అని, ఎస్సీలు 18%, ఎస్టీ 10%, ఓసీలు12% అని అన్నారు. ఆ లెక్కన బీసీల శాతం పెరిగినట్టేనని, తాము ఐదు కేటగిరీలుగా చూపితే కేసీఆర్ తన కాకి లెక్కలో నాలుగు కేటగిరీలుగా చూపారని వివరించారు. గతంలో సాక్షాత్తూ ప్రధాని మోదీ 70 జాతుల ముస్లిం లను ఓబీసీ లో కలిపారని అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా సీఎం వినిపించారు. దీనిపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సమాధానం చెప్పాలన్నారు.
నామీద ఒత్తిడి మీకు కనపడదు
కులగణనపై తన మీద ఎంతో ఒత్తిడి ఉందని, అది ఎవరికీ కనిపించదని, నాయకుడు రాహుల్ గాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి పూర్తి చేశామని సీఎం చెప్పారు. భవిష్యత్ లో కులగణన గురించి ఎవరైనా మాట్లాడాల్సి వస్తే తెలంగాణే రోల్ మోడల్ అవుతుందని అన్నారు. తానే స్వయంగా కులగణనపై 12 సార్లు రివ్యూ చేశానని వివరించారు. అసెంబ్లీలో తీర్మానం చెయిస్తే తన పని అయిపోతుందని రేవంత్ రెడ్డి చెప్పారు. బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ నేతృత్వంలో అనేక సమావేశాలు పెట్టామన్నారు. కులగణనపై ముందుకు వెళితే నష్టం జరుగుతుందని భావించే బీజేపీ కొత్త వివాదాలను తెరపైకి తెస్తోందన్నారు. కులగణన విషయంలో కేంద్రంపై దేశ వ్యాప్తంగా ఒత్తిడి పెరుగుతోందని అన్నారు.