బీసీ రిజర్వేషన్లపై ఉద్యమ పంథా!

బీసీ రిజర్వేషన్లపై ఉద్యమ పంథా!
  • దేశవ్యాప్త మద్దతు కూడగట్టే పనిలో సీఎం రేవంత్​
  • అన్ని పార్టీలు, ఎంపీలకు లేఖలు రాయాలని నిర్ణయం 
  • మార్చి 10న ఢిల్లీకి అఖిలపక్షం.. కేసీఆర్​నూ పిలిచే చాన్స్ 
  • మార్చి ఫస్ట్ వీక్​లో అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లులు 

హైదరాబాద్, వెలుగు : బీసీ రిజర్వేషన్ల కోసం ఉద్యమ పంథాలో పోరాటం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రిజర్వేషన్ల పెంపు కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశం కావడంతో రాజ్యాంగ సవరణ కోసం దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టాలని భావిస్తున్నది. ఇందులో భాగంగా అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీలతో పాటు ఎంపీలకూ లేఖలు రాయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు.​

రాష్ట్ర ప్రభుత్వం చేయనున్న బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్​లో చేర్చేందుకు సహకరించాలని అందరికి విజ్ఞప్తి చేయనున్నారు. అవసరమైతే తెలంగాణ ఉద్యమ సమయంలో చేసినట్టు.. అన్ని పార్టీల నుంచి సమ్మతి లేఖలు తీసుకొని కేంద్ర సర్కారుకు అందించాలని సీఎం భావిస్తున్నట్టు తెలిసింది.

అవసరమైతే తెలంగాణ ఉద్యమ సమయంలో చేసినట్టు.. అన్ని పార్టీల నుంచి సమ్మతి లేఖలు తీసుకొని కేంద్ర సర్కారుకు అందించాలని సీఎం భావిస్తున్నట్టు తెలిసింది. కాగా, మార్చి 10న ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లి 42శాతం బీసీ రిజర్వేషన్లపై ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. 

పార్టీల సమ్మతి లేఖలతో ఢిల్లీకి.. 

దేశంలోని అన్ని పార్టీలకు, ఆయా పార్టీల ఎంపీలకు లేఖలు రాయడంతో పాటు రాష్ట్రం నుంచి అఖిలపక్షాన్ని ప్రధాని మోదీ దగ్గరికి తీసుకెళ్లాలని సీఎం రేవంత్ నిర్ణయించారు. ఈ అఖిలపక్షంలో మంత్రులు, అన్ని పార్టీల ఎంపీలు, ఇతర సీనియర్​నాయకులు, బీసీ సంఘాల నేతలు ఉండేలా చూసుకోవాలని భావిస్తున్నారు. త్వరలోనే ఆయా పార్టీల రాష్ట్ర అధ్యక్షులతోనూ సీఎం మాట్లాడుతారని తెలుస్తున్నది. మాజీ సీఎం, ప్రతిపక్ష నేత కేసీఆర్​కు కూడా లేఖ రాయనున్నట్టు సమాచారం. 

గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో దేశంలోని అన్ని రాజకీయ పార్టీల సమ్మతి తీసుకుంటూ కేంద్రానికి లేఖలు సమర్పించారు. పార్లమెంట్​లోనూ సహకారం తీసుకున్నారు. ఇప్పుడు బీసీల రిజర్వేషన్ల విషయంలోనూ అదే పంథాలో ముందుకు పోవాలని సీఎం భావిస్తున్నారు. ఆయా రాష్ట్రాలు కూడా కులగణన సర్వే చేస్తే, తమ ప్రభుత్వం కూడా మద్దతు ఇస్తుందని స్పష్టం చేయనున్నారు. ఇప్పటికే ఇండియా కూటమికి పార్లమెంట్​లో 234 మంది ఎంపీలు ఉండడం తమకు కలిసివస్తుందని అంచనా వేస్తున్నారు.

త్వరలోనే కేబినెట్ మీటింగ్.. 

వచ్చే నెల 1 నుంచి 5లోపు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్టు తెలుస్తున్నది. బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణకు మార్చి మొదటి వారంలో చట్టబద్ధత కల్పిస్తామని సీఎం రేవంత్​రెడ్డి ప్రకటించారు. దీంతో ఈ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో 3వేర్వేరు బిల్లులు ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా బిల్లు పెట్టనుంది. ఇప్పటికే ఇచ్చిన రిపోర్ట్​పై ఏకసభ్య కమిషన్​అభ్యంతరాలు స్వీకరిస్తున్నది. ఇక బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఒకటి.. విద్య, ఉద్యోగాల్లోనూ బీసీలకు  42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఇంకో బిల్లును తేనున్నట్టు తెలుస్తున్నది. 

ఈ మూడు బిల్లులపై అసెంబ్లీలో చర్చించి ఆమోదం తెలపనున్నారు. వీటి ముసాయిదా రూపకల్పనలో అధికారులు నిమగ్నమయ్యారు. త్వరలోనే కేబినెట్ భేటీ ఏర్పాటు చేసి, ముసాయిదా బిల్లులపై చర్చించనున్నారు. కాగా, మార్చి మూడో వారంలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నది.