
- పాలమూరు ప్రాజెక్టులను కేసీఆర్ పూర్తి చేసుంటే.. ఇప్పుడు చంద్రబాబుతో నీళ్ల పంచాది ఉండేదే కాదు
- ఆనాడు వైఎస్సార్‌కు ఊడిగం చేసి.. రాయలసీమకు కృష్ణా జలాల తరలింపుకు సహకరించిండు
- ఏపీ పోతిరెడ్డిపాడుకు పొక్క కొట్టి 40 వేల క్యూసెక్కులు తరలించుకుపోయేలా చేసిండు
- ప్రగతిభవన్‌లో జగన్‌కు పంచభక్ష్య పరమాన్నాలు పెట్టి.. రాయలసీమ లిఫ్ట్‌కు పథకం పన్నిండు
- కాంట్రాక్టర్ల కమీషన్ల కోసం కక్కుర్తిపడి మన ప్రాజెక్టులను పట్టించుకోలేదని ఫైర్
- మోదీ, కేసీఆర్, తన పాలనపై చర్చకు సిద్ధమని సవాల్
- నారాయణపేట జిల్లా అప్పక్‌పల్లిలో ఇందిరమ్మ ఇండ్లకు సీఎం శంకుస్థాపన
మహబూబ్‌నగర్, వెలుగు: బీఆర్ఎస్ పాలనలో కృష్ణా నీళ్లు రాయలసీమకు, ప్రాజెక్టుల కోసం కేటాయించిన నిధులు కేసీఆర్ ఇంటికి తరలిపోయాయని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. పదేండ్లు అధికారంలో ఉన్న కేసీఆర్.. పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేసి ఉంటే, ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబుతో నీళ్ల పంచాయితీ ఉండేదే కాదన్నారు. వైఎస్సార్ హయాంలో పోతిరెడ్డిపాడుకు పొక్క కొట్టి 4 వేల క్యూసెక్కులకు బదులు 40 వేల క్యూసెక్కుల నీటిని ఏపీ తరలించుకు వెళ్లేలా చేసిందే కేసీఆర్ అని ఆయన ఫైర్ అయ్యారు.
మళ్లీ వైఎస్ జగన్ సీఎం అయ్యాక ప్రగతిభవన్‌లో పంచ భక్ష్య పరమాన్నాలు పెట్టి రాయలసీమ లిఫ్ట్‌కు పథకం పన్నారని దుయ్యబట్టారు. శుక్రవారం నారాయణపేట జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. మధ్యాహ్నం హెలికాప్టర్లో నారాయణపేటకు చేరుకున్న ఆయన.. మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్‌బంక్‌ను ప్రారంభించారు. అక్కడి నుంచి అప్పక్‌పల్లికి వెళ్లి, ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత నారాయణపేట గవర్నమెంట్ మెడికల్‌కాలేజీ, నర్సింగ్కాలేజీతో పాటు రూ.966 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ‘ప్రజాపాలన- ప్రగతి బాట’ బహిరంగ సభలో మాట్లాడారు. కేసీఆర్ వల్లే పాలమూరు ఎడారిగా మారిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
పదేండ్లు అధికారంలో ఉన్న కేసీఆర్.. పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేయలేదని ఫైర్ అయ్యారు. జూరాల, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్, ఆర్డీఎస్ పనులను ఎందుకు పెండింగ్‌లో పెట్టారని రేవంత్ నిలదీశారు. పాలమూరు ప్రాజెక్టును కేసీఆర్ రీడిజైన్ చేసి, జిల్లాను ఎడారిగా మార్చారని మండిపడ్డారు. ‘‘ఉమ్మడి రాష్ట్రంలో మంత్రులుగా ఉన్న జూపల్లి కృష్ణారావు, చిన్నారెడ్డి, డీకే అరుణ 12 లక్షల ఎకరాలకు సాగు నీరందించేందుకు పాలమూరు లిఫ్ట్ స్కీమ్‌కు అనుమతులు తీసుకొచ్చారు. రూ.16 వేల కోట్లతో ప్రాజెక్టు మంజూరైంది.
రూ.35 వేల కోట్లకు టెండర్లు అయ్యాయి. 2014లో కేసీఆర్ అధికారంలోకి వచ్చాక.. రీడిజైన్ పేరుతో రూ.35 వేల కోట్ల ప్రాజెక్టును రూ.55 వేల కోట్లకు పెంచిండు. కాంట్రాక్టర్లకు పనులిచ్చి, కమీషన్లు మెక్కిండు. జూరాల నుంచి నీళ్లు తీసుకోవాల్సి ఉండగా, శ్రీశైలం బ్యాక్‌వాటర్‌నుంచి తీసుకునేలా డిజైన్ మార్చిండు. డిజైన్ మార్చడం వల్ల పాలమూరు ఎడారిగా మారింది. కేసీఆర్ పాలమూరు స్కీమ్‌ను పూర్తి చేసినా, ఉమ్మడి పాలమూరులోని పెండింగ్ ప్రాజెక్టులు కంప్లీట్చేసినా.. ఇప్పుడు ఏపీ అభ్యంతరాలు పెట్టకపోతుండే. ఇప్పుడు చంద్రబాబుతో పంచాయితీకి కేసీఆరే కారణం” అని రేవంత్ ఫైర్ అయ్యారు.
నా మీద కక్షతో పాలమూరును పక్కనపెట్టిండు..
కృష్ణా జలాలు పారుతున్నా దశాబ్దాలుగా పాలమూరు జిల్లాలో పసిడి పంటలు పండటం లేదని, ఇక్కడి ప్రజల కన్నీళ్లు ఎవరూ ఎందుకు తుడవలేదని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ‘‘పాలమూరు జిల్లా ప్రజలను అడుక్కుంటే 2009లో ఎంపీగా కేసీఆర్‌ను గెలిపించారు. పాలమూరును దత్తత తీసుకుంటానని, తెలంగాణ వస్తే ఈ జిల్లా బాగుపడ్తదని, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తానని ఆనాడు కేసీఆర్ మాట ఇచ్చి నిలబెట్టుకోలేదు. కొడంగల్, -నారాయణపేట-, మక్తల్ స్కీమ్‌ను అప్పటి ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి ప్రతిపాదించారు.
2009లో నేను ఈ ప్రాజెక్టు కోసం కొట్లాడి, 2014లో స్కీమ్‌ను తీసుకొచ్చాను. కానీ కేసీఆర్ అధికారంలోకి వచ్చాక నా మీద కక్షతో, పాలమూరు మీద పగతో ఈ స్కీమ్‌ను పక్కనపెట్టారు. మళ్లీ నేను సీఎం అయ్యాక ఈ పనులు మొదలుపెట్టాలని ప్రయత్నిస్తుంటే, కేసీఆర్ అడ్డుకుంటున్నారు. వైఎస్సార్‌హయాంలో పోతిరెడ్డిపాడుకు పొక్క కొట్టి 4 వేల క్యూసెక్కులకు బదులు 40 వేల క్యూసెక్కుల నీటిని ఏపీ తరలించేకువేళ్లేలా చేసింది కేసీఆరే.
వైఎస్సార్‌కు ఊడిగం చేసి, ఆయన చెప్పులు మోసి, కృష్ణా జలాలను రాయలసీమకు తరలించడానికి అనుమతినిచ్చిన సన్నాసి కేసీఆర్. మళ్లీ వైఎస్సార్ కొడుకు వైఎస్ జగన్ సీఎం అయ్యాక ప్రగతిభవన్‌లో పంచభక్ష పరమాన్నాలు పెట్టి రాయలసీమ లిఫ్ట్‌కు పథకం పన్నారు. ఏపీ పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు తరలించుకు వెళ్లినప్పుడు హరీశ్‌రావు.. వైఎస్ఆర్మంత్రివర్గంలో ఉన్నాడు” అని పేర్కొన్నారు.
కేసీఆర్ చేసిన పాపం.. మనకు శాపమైంది
రంగారెడ్డి, పాలమూరు, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో ఇప్పటికే కృష్ణా నది జలాలు పారాల్సిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘ఏపీ రాయలసీమ లిఫ్ట్, ముచ్చుమర్రి నిర్మించుకుంటుంటే.. ఆనాడు అధికారంలో ఉన్న కేసీఆర్అడ్డుచెప్పలేదు. అప్పుడు కేసీఆర్ చేసిన పాపం ఇప్పుడు మనకు శాపమైంది. త్వరలో రాయలసీమ లిఫ్ట్ పూర్తయితది. రోజుకు పది టీఎంసీల చొప్పున నెల రోజుల్లో 300 టీఎంసీలు శ్రీశైలం నుంచి ఏపీ వాళ్లు తరలించుకుపోతారు. ప్రాజెక్టు మొత్తం ఖాళీ అవుతుంది. దీనికి పునాదులు వేసింది కేసీఆరే.. కాంట్రాక్టర్ల కమీషన్ల కోసం కక్కుర్తి పడింది కేసీఆర్, హరీశ్ రావే” అని మండిపడ్డారు.
ఐదేండ్లు ఇరిగేషన్ మంత్రిగా ఉన్న హరీశ్ రావు.. పాలమూరు ప్రాజెక్టులను పట్టించుకోకుండా, ఇక్కడి భూములను ఎడారిగా మార్చారని ఫైర్ అయ్యారు. కృష్ణా జలాల వల్ల పాలమూరులో వెలుగులు రాలేదని, వలసలు పోవడానికి పనికొచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పాపం బీఆర్ఎస్‌దే అన్నారు. ‘‘రాష్ట్రంలో పదేండ్లలో సాగునీటి మీద రూ.2 లక్షల కోట్లు ఖర్చు పెట్టారు. అందులో లక్ష కోట్లతో కాళేశ్వరం కట్టారు. వాటిలో వేల కోట్లు మింగారు. కట్టిన కాళేశ్వరం కుప్పకూలిపోయింది. ఇలాంటి దిక్కుమాలిన ప్రాజెక్టు దేశంలోనే మరొకటి లేదు” అని అన్నారు.
ఎకరాకు 20 లక్షల పరిహారం ఇస్తం..
బీఆర్ఎస్‌కు 2023లో అధికారం పోయిందని, 2024 పార్లమెంట్ఎన్నికల్లో డిపాజిట్లు పోయాయని, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులు కూడా దొరకడం లేదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ‘‘వారిదో దిక్కుమాలిన పార్టీ. తండ్రి, అల్లుడు, కొడుకు, బిడ్డ.. కాకుల్లా పొడవాలని చూస్తున్నరు. ఈ కాకులకు జవాబు చెప్పాల్సింది కాంగ్రెస్ కార్యకర్తలే. 10 నెలల్లో మనం ఏమీ చేయలేదని వాళ్లు అంటున్నారు. ఐదేండ్లలో అన్ని పనులు పూర్తి చేసే బాధ్యత మనది. పేదలు బాగుపడి, పాలమూరు పచ్చబడుతుంటే వాళ్ల కడుపు మండుతున్నది. మన జీవితాలు పాడుగావాలనేదే వాళ్ల ఆలోచన.
తెలంగాణకు మీ బిడ్డ సీఎంగా ఉంటే వాళ్లకు కడుపు కాలుతున్నది. కండ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు. మన మధ్య పంచాయితీలు పెట్టాలని చూస్తున్నరు. ప్రాజెక్టులను ఆపాలని చూస్తున్నరు. మీరంతా అప్రమత్తంగా ఉండాలి. మన పనులు మనమే పూర్తి చేసుకుందాం. పరిశ్రమలు, సాగునీటి ప్రాజెక్టులు, భూసేకరణను అడ్డుకోకండి.. మీకు నష్టపరిహారం అందించే బాధ్యత నాది. ఎకరానికి రూ.10 లక్షలు కాదు.. భూమి పోతే ఎకరానికి రూ. 20 లక్షలు ఇస్తా. కొత్తగా భూములు కొనుక్కోండి” అని చెప్పారు.
నీ ఇంట్లో వాళ్లను కొట్టు.. బుద్ధి వస్తది
దేశంలోనే మొదటిసారి తెలంగాణలో కులగణన చేసి, రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలిపామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘1931లో తెల్ల దొరలు కులాల లెక్కలు తీశారు. ఆ తర్వాత ఏడు దశాబ్దాల పాటు దేశంలో బీసీ కులగణన జరగలేదు. కాంగ్రెస్ ఏడాదిలో సాధించిన విజయాలు.. కేసీఆర్ కండ్లకు కనిపిస్తలేవా? ఆయనకు పసిరికలు వచ్చాయా? కండ్లు పచ్చగా అయ్యాయా? అసెంబ్లీకి వస్తే చర్చిస్తాం కదా.. కానీ ఆయన రాడు” అని ఫైర్ అయ్యారు. ‘‘కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోవాలని, పాలన ఏం బాగోలేదని కేసీఆర్ అంటున్నరు.
‘నేను కొడితే గట్టిగా కొడతా’ అని ఆయన చెబుతున్నరు. కేసీఆర్గట్టిగా కొడితే హాఫ్, ఫుల్ కొడ్తడు. కేసీఆర్.. మమ్మల్ని కొట్టుడు కాదు. ఫామ్‌హౌస్‌లలో డ్రగ్స్పార్టీలు చేస్తున్న నీ కొడుకును కొట్టు బుద్ధి వస్తది. ఢిల్లీలో లిక్కర్ దందా చేసి తెలంగాణ గౌరవాన్ని దెబ్బతీసిన నీ బిడ్డను దవడ మీద కొట్టు. కాళేశ్వరం పేరు మీద కోట్లు మింగిన నీ అల్లుడి దవడ మీద కొట్టు సిగ్గు, బుద్ధి వస్తది. తెలంగాణను ముంచినందుకు గట్టిగా కొట్టాలనుకుంటే నీ ఇంట్లో వాళ్లను కొట్టి, దారిలో పెట్టు. కాంగ్రెస్‌ను గట్టిగా కొడతానంటే కార్యకర్తలు ఊరుకుంటారా? రా చూద్దాం?” అని సవాల్ చేశారు.
ఇందిరమ్మ ఇల్లు లేని ఊళ్లో ఓట్లడగం..
ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తున్నామని, అవసరమైతే 5 వేల ఇండ్లు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పదేండ్లలో కేసీఆర్ఎన్ని ఇండ్లు ఇచ్చారో చెప్పాలని సవాల్‌చేశారు. ఇందిరమ్మ ఇల్లు ఉన్న ఊళ్లోనే సర్పంచ్ఎన్నికల్లో ఓట్లు అడుగుతామని, ఇండ్లు లేని చోట పోటీనే చెయ్యమని చెప్పారు. డబుల్బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చిన చోటే బీఆర్ఎస్ పోటీ చేయాలన్నారు. ‘‘ఉదండాపూర్ రిజర్వాయర్ కింద రైతులను ఆదుకునే బాధ్యత నాది.
మీ కష్టాలు, సమస్యలు తీర్చకపోతే సీఎంగా ఉండి ఏం లాభం? సమస్యను పరిష్కరించి, ప్రాజెక్టును పూర్తి చేస్తా’ అని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ, స్థానిక ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి తదితరులు పాల్గొన్నారు.