సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలోని తెలంగాణ రైజింగ్ టీమ్ మూడు రోజుల సింగపూర్ పర్యటన విజయవంతంగా ముగిసింది. చివరి రోజున సింగపూర్ పర్యటనలో రేవంత్ బృందం అక్కడి ప్రధాన వ్యాపార సంస్థల అధినేతలు, సింగపూర్ బిజినెస్ ఫెడరేషన్ (SBF) ప్రతినిధులతో చర్చలు జరిపింది. హైదరాబాద్ లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వ విధానాలను సీఎం వారికి వివరించారు.
సింగపూర్ లో చేసుకున్న కీలక ఒప్పందాలు:
సింగపూర్ లోని పలు సంస్థల అధ్యయనం, టెక్నాలజీ సహకారం, తెలంగాణకు పెట్టుబడులు తెచ్చే లక్ష్యంతో వెళ్లిన సీఎం రేవంత్ బృందం సింగపూర్ లో పలు కీలక ఒప్పందాలు చేసుకుంది. సింగపూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఐటీఈ)తో తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరస్పర అవగాహన కుదుర్చుకోవటం కీలక పరిణామం.
ALSO READ | హైదరాబాద్లో క్యాపిటల్ ల్యాండ్ భారీ పెట్టుబడి..రూ.450 కోట్లతో కొత్త ఐటీ పార్క్
అదే విధంగా హైదరాబాద్ లోని ఫ్యూచర్ సిటీలో అత్యాధునిక ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు ఎస్టీ టెలీ మీడియా గ్లోబల్ డేటా సెంటర్ ముందుకు వచ్చింది. రూ. 3,500 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్ లో భారీ ఐటీ పార్కు ఏర్పాటుకు క్యాపిటల్ ల్యాండ్ కంపెనీ నిర్ణయం తీసుకుంది. దాదాపు రూ.450 కోట్లతో ఈ పార్కును అభివృద్ధి చేయనుంది. రాష్ట్రంలో సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమలు, పెట్టుబడుల అవకాశాలపై సింగపూర్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ అసోసియేషన్ తో జరిపిన చర్చలు ఫలవంతమయ్యాయి.
సింగపూర్ నుంచి దావోస్ పర్యటనకు:
సింగపూర్ పర్యటనను విజయవంతంగా ముగించుకున్న సీఎం బృందం ఆదివారం (19 జనవరి 2025) రాత్రి దావోస్ కు బయల్తేరనుంది. సీఎం సీఎంతో పాటు మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు సోమవారం దావోస్ కు చేరుకుంటారు. దావోస్ లో నాలుగు రోజుల పాటు జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వార్షిక సదస్సులో పాల్గొంటారు.
వరల్డ్ ఎకనమిక్ ఫోరం వేదికగా తెలంగాణకు ఉన్న సానుకూలతలను చాటి చెప్పి పెట్టుబడులను తెచ్చే లక్ష్యంతో తెలంగాణ రైజింగ్ టీమ్ దావోస్ పర్యటనకు వెళ్లనుంది. సింగపూర్ పర్యటన విజయవంతం కావటంతో దావోస్ సదస్సుపై భారీ అంచనాలు పెట్టుకుంది.