- 2 ఆస్పత్రులు, 3 పోలీస్ స్టేషన్లు, రోడ్లకు గ్రీన్ సిగ్నల్
- నేడు పెద్దపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి సభ
- 9 వేల మందికి నియామకపత్రాలు
హైదరాబాద్/పెద్దపల్లి, వెలుగు: ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా పెద్దపల్లిలో బుధవారం జరగనున్న ‘యువవికాసం విజయోత్సవం’ కార్యక్రమానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా ఆ ప్రాంత అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి భారీ వరాలు కురిపించారు. పెద్దపల్లిలో రూరల్, మహిళా, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎలిగేడు మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ తోపాటు వ్యవసాయ మార్కెట్ కమిటీని కూడా శాంక్షన్ చేసింది.
అలాగే పెద్దపల్లి జిల్లా మంథనిలో 50 బెడ్ల కమ్యూనిటీ హెల్త్ సెంటర్, అదే జిల్లా గుంజపడుగులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటుకు కూడా సర్కారు అనుమతులు ఇచ్చింది. ఈ రెండు హాస్పిటళ్లకు కలిపి రూ.25 కోట్లు కేటాయించింది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని 50 బెడ్ల హాస్పిటల్‌ను రూ. 51 కోట్ల వ్యయంతో 100 బెడ్లకు అప్‌గ్రేడ్ చేయనున్నారు. బుధవారం పెద్దపల్లిలో జరిగే సభలో సీఎం రేవంత్ రెడ్డి ఈ హాస్పిటళ్లకు వర్చువల్‌గా శంకుస్థాపన చేసే అవకాశం ఉంది. పెద్దపల్లిలో ఫోర్ లేన్ బైపాస్ రోడ్డుతో పాటు దాదాపు రూ.352 కోట్లతో ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ రోడ్లకు కూడా సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Also Read :- దమ్ముంటే నిధులు తే లేకుంటే గుజరాత్ పో!
తొలి ఏడాదిలోనే 54 వేల జాబ్స్
రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాదిలోనే 54 వేలకుపైగా ఉద్యోగాలు భర్తీ చేసినట్టు యువ వికాసం ప్రోగ్రామ్ సందర్భంగా సర్కారు ప్రకటించింది. టీజీపీఎస్సీ ద్వారా 12,324, మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 7,378, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 16,067, గురుకుల బోర్డు ద్వారా 8,304, డీఎస్సీ ద్వారా10,006, ఇతర సంస్థల ద్వారా 441 కలిపి మొత్తం 54,520 ఉద్యోగాలను భర్తీ చేసినట్టు ప్రభుత్వం వెల్లడించింది.
నేడు పెద్దపల్లికి సీఎం
సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం పెద్దపల్లిలో పర్యటించనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ‘యువ వికాసం విజయోత్సవం’ పేరిట నిర్వహించనున్న సభలో పాల్గొని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇటీవల ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన 9 వేల మందికి అదే సభలో నియామక పత్రాలు అందజేయనున్నారు.