- 2 వేల మంది పోలీసులతో బందోబస్తు
- పట్టణంలో ఉదయం 10గంటల నుంచే ట్రాఫిక్ ఆంక్షలు
- పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం
పెద్దపల్లి, వెలుగు: ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా పెద్దపల్లిలో బుధవారం నిర్వహించనున్న యువవికాసం, విజయోత్సవ సభకు సీఎం రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారు. ఈ సందర్భంగా సీఎం పాల్గొననున్న సభకు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. 2వేల మంది పోలీసులతో బందోబస్త్ ఏర్పాటు చేస్తున్నారు. సీఎం రాక సందర్భంగా పెద్దపల్లిలో పండుగ వాతావరణం నెలకొంది.
పట్టణం కాంగ్రెస్ ఫ్లెక్సీలతో నిండిపోయింది. మంగళవారం నుంచే ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బుధవారం ఉదయం 10 గంటల నుంచి పెద్దపల్లిలోకి ఎలాంటి వాహనాలు రాకుండా ఆంక్షలు విధించారు. వాహనాల దారి మళ్లింపుపై పోలీసులు రూట్‌మ్యాప్ విడుదల చేశారు. యువ వికాసం విజయోత్సవ సభలో ఇటీవల నిర్వహించిన పోటీపరీక్షల్లో ఉద్యోగాలు సాధించిన 9 వేల మందికి నియామక పత్రాలను సీఎం అందజేయనున్నారు. పెద్దపల్లి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు.
వాహనాల దారి మళ్లింపు
రామగుండం నుంచి కరీంనగర్ వైపు వెళ్లే అన్ని వాహనాలు ధర్మారం- ఎక్స్‌రోడ్ (బసంత్ నగర్) ద్వారా కుక్కలగూడూరు, రాజారాంపల్లి, ధర్మారం మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. మంథని వైపు నుంచి కరీంనగర్ వెళ్లే భారీవాహనాలు అప్పన్నపేట, ధర్మారం- ఎక్స్‌రోడ్ (బసంత్ నగర్) ద్వారా కుక్కలగూడూరు, రాజారాంపల్లి, ధర్మారం మీదుగా, కార్లు, చిన్నవాహనాలు అప్పన్నపేట నుంచి ఎడమ వైపు తీసుకుని బొంపల్లి, దొంగతుర్తి, ధర్మారం మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.
కరీంనగర్ నుంచి రామగుండం, మంథని వెళ్లే భారీ వాహనాలు ముగ్దుంపూర్- ఎక్స్ రోడ్ నుంచి కరీంనగర్–-లక్సెట్టిపేట రోడ్డు ద్వారా చొప్పదండి, ధర్మారం, రాజారాంపల్లి వద్ద కుడి వైపు తీసుకుని కుక్కలగూడూర్, ధర్మారం- ఎక్స్‌రోడ్ ద్వారా రాజీవ్ రహదారి మీదకు చేరుకొని రామగుండం, మంథని వెళ్లాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.
బందోబస్త్‌పై సీపీ రివ్యూ
సీఎం పర్యటన బందోబస్త్‌పై పోలీస్ అధికారులు, సిబ్బందికి జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో రామగుండం సీపీ శ్రీనివాస్ సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం పర్యటన సందర్భంగా 2వేల మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
బందోబస్త్‌లో ఏడుగురు ఎస్పీలు-, ముగ్గురు అడిషనల్ ఎస్పీలు, ఏసీపీ, డీఎస్పీ స్థాయి అధికారులు 15 మంది, సీఐలు- 48 మంది, ఎస్సైలు -124 మంది, మహిళా ఎస్ఐలు --15 మంది, ఏఎస్సై, హెడ్ కానిస్టేబుళ్లు -316 మంది, కానిస్టేబుళ్లు 846 మంది, హోంగార్డులు-384 మంది, క్యూఆర్టీలు --70, స్పెషల్ పార్టీలు -10 ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బందోబస్త్‌ను సెక్టార్లుగా విభజించి డీఎస్పీ, ఏసీపీలను ఇన్‌చార్జిలుగా నియమించారు.