
- ఏర్పాట్లు పూర్తి చేసిన ఆఫీసర్లు
- రూ.966 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
- జనసమీకరణపై దృష్టి పెట్టిన పేట ఎమ్మెల్యే పర్ణికా రెడ్డి
మహబూబ్‌నగర్, వెలుగు:అసెంబ్లీ ఎన్నికల తరువాత మొదటిసారి సీఎం హోదాలో రేవంత్ రెడ్డి నారాయణపేట జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం ఈ జిల్లాలోనే ఉండడంతో కొత్తగా వరాలు కురిపిస్తారని ప్రజలు ఆశతో ఎదురు చూస్తున్నారు.
ఇది షెడ్యూల్..
మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సీఎం నారాయణపేట జిల్లాలో పర్యటిస్తారు. ఉదయం 11.30 గంటలకు ఆయన హెలికాప్టర్ ద్వారా బేగంపేట నుంచి బయల్దేరుతారు. మధ్యాహ్నం 12 గంటలకు విరాకాబాద్ జిల్లా దుద్యాల మండలం పోలేపల్లి గ్రామానికి చేరుకొని ఎల్లమ్మ జాతరలో పాల్గొంటారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు అనంతరం హెలికాప్టర్ ద్వారా నారాయణపేట జిల్లాకు రానున్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. 2:10 నుంచి 3:25 వరకు బహిరంగ సభలో పాల్గొంటారు. 3:40కు అప్పక్‌పల్లి నుంచి హెలికాప్టర్ ద్వారా తిరిగి హైదరాబాద్‌కు బయల్దేరి వెళ్లనున్నారు.
ప్రారంభోత్సవాలు.. శంకుస్థాపనలు..
సీఎం నారాయణపేట జిల్లా పర్యటనలో భాగంగా రూ.966 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఇందులో రూ.56 కోట్లతో నారాయణపేట గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అకడమిక్ బ్లాక్‌ను, రూ.26 కోట్లతో గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్, రూ.40 కోట్లతో వంద పడకల యూనిట్, రూ.5.58 కోట్లతో ధన్వాడ, నారాయణపేట రూరల్ పోలీస్ స్టేషన్లు, రూ.1.23 కోట్లతో జిల్లా మహిళా సమాఖ్య నిర్వహించే పెట్రోల్ బంక్, రూ.7 కోట్లతో మరికల్ మండల కేంద్రంలో నిర్మించిన మండల పరిషత్ ఆఫీస్ కాంప్లెక్స్ బిల్డింగ్‌ను పర్చువల్గా ప్రారంభించనున్నారు.
అలాగే రూ.13 కోట్లతో నారాయణపేట గవర్నమెంట్ కాలేజ్ హాస్టల్ నిర్మాణానికి, రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణానికి, రూ.295 కోట్లతో తుంకిమెట్ల, నారాయణపేట రోడ్డు, కోటకొండ, మద్దూరు రోడ్డు అభివృద్ధి పనులకు, అప్పక్‌పల్లి, గుండుమాల్ రోడ్డు, మద్దూరు, లింగాల్చెడ్ రోడ్డులో హై లెవల్ బ్రిడ్జిల నిర్మాణానికి, రూ.193 కోట్లతో గుల్బర్గా-కొడంగల్, రావులపల్లి–-మద్దూరు, కోస్గి–-దౌల్తాబాద్ రోడ్డు అభివృద్ధి పనులకు, రూ.12.70 కోట్లతో నారాయణపేట నియోజకవర్గంలో సీఆర్ఆర్ రోడ్లకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు.
ప్రతి మండలం నుంచి 5 వేల మంది..
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని అన్ని మండలాల నుంచి జన సమీకరణ చేసేందుకు నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికా రెడ్డి ఏర్పాట్లు చేశారు. ఇందుకుగాను ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలతో ఆమె సభ సక్సెస్ చేయడంపై మాట్లాడారు. ప్రతి మండలం నుంచి ఐదు వేల మందిని తరలించేలా ప్రయత్నిస్తున్నారు. ఇందుకుగాను ఆయా మండలాల కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జీలతో ఆమె ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు.
దీనికితోడు యూత్ కాంగ్రెస్ తరపున కూడా యువతను సభకు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సభకు లక్ష మందిని తరలించి గ్రాండ్ సక్సెస్ చేయాలని శ్రమిస్తున్నారు. కాగా.. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.