- రాష్ట్రంలో అన్ని రంగాల్లో అవకాశాలు ఉన్నయ్: రేవంత్ రెడ్డి
- అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ లో సీఎం
హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. సినిమా, వ్యాపారం, రాజకీయం ఏ రంగంలోనైనా అవకాశాలు ఉన్నాయన్నారు. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. న్యూయార్క్, టోక్యో వంటి ప్రముఖ నగరాలతో పోటీ పడి హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ధి చేందుతోందన్నారు.
మూసీ పునరుజ్జీవనం, మెట్రో రైలు విస్తరణ, ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఈవీ హబ్, గ్రీన్ ఎనర్జీ హబ్, రీజనల్ రింగ్ రోడ్.. ఇలా ఎన్నో గొప్ప ప్రాజెక్టులు చేపడుతున్నామన్నారు. హైదరాబాద్ ఒక గ్లోబల్ సిటీ అని ఇక్కడ అవకాశాలు అనేకం ఉన్నట్లు చెప్పారు. ఎన్నో పెట్టుబడులకు అవకాశం ఉందని తెలిపారు. తెలంగాణకు అత్యధికంగా పెట్టుబడులు వచ్చి అభివృద్ధి జరగాలని.. ఫలితంగా ఎంతో మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. పెట్టే పెట్టుబడులకు సంపూర్ణమైన రక్షణ ప్రభుత్వం వైపు నుంచి ఉంటుందన్నారు.