తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఊపర్ షేర్వానీ..అందర్ పరేషానీ

 తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఊపర్ షేర్వానీ..అందర్ పరేషానీ
  • కేసీఆర్​ చేసిన అప్పులు, తప్పులకే ప్రతినెలా రూ.6,500 కోట్లు
  • రాష్ట్రానికి ఆయనిచ్చింది ఫైనాన్షియల్ క్యాన్సర్
  • వాస్తవాలు ఎన్నాళ్లు దాచిపెడ్తరు.. అబద్ధాలు చెప్తూ రాష్ట్రాన్ని నడుపలేం
  • నిజాలు మీతో పంచుకొని అభివృద్ధికి కృషిచేస్త
  • పదేండ్లు పాలించినోళ్లు.. మమ్మల్ని 10 నెలలకే దిగిపో అంటున్రు
  • వాళ్ల ఫామ్ హౌస్​ గుంజుకున్ననా?.. వాళ్ల బాధ ఏందో అర్థం కావట్లే 
  • కేసీఆర్ ఫ్యామిలీ మొత్తం ప్యాకేజీల అబద్ధాలు మాట్లాడుతున్నదని ఫైర్​
  • జేఎల్, పాలిటెక్నిక్ లెక్చరర్​ జాబ్​ల​కు​ ఎంపికైనోళ్లకు నియామక పత్రాలు అందజేత

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఊపర్​ షేర్వానీ.. అందర్​ పరేషానీ అన్నట్టుగా ఉందని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. ‘‘క్యాన్సర్ ముదిరిపోతుంటే నేను బాగున్నా అని ఎన్నిరోజులు అబద్ధాలు చెప్పాలి? రాష్ట్రానికి కేసీఆర్ ఆర్థిక క్యాన్సర్ ఇచ్చిపోయిండు. దీని నుంచి కోలుకొని ముందుకు పోవాలని చూస్తున్నా”అని పేర్కొన్నారు. పదేండ్లు పాలించినోళ్లు.. తమను పది నెలలకే  దిగిపో అంటున్నారని, ఐదేండ్ల కోసం ప్రజలు ఆశీర్వదిస్తే వాళ్ల బాధ ఏంటో అర్థం కావడం లేదని అన్నారు. బీఆర్ఎస్ వాళ్లది ఏమైనా గుంజుకున్నానా?.. వాళ్ల ఫామ్ హౌస్​ లాక్కున్నానా? అని ప్రశ్నించారు.  బుధవారం హైదరాబాద్​లోని రవీంద్రభారతిలో ‘ప్రజా ప్రభుత్వంలో కొలువుల పండుగ’ కార్యక్రమం  నిర్వహించారు.

  జూనియర్ లెక్చరర్‌, పాలిటెక్నిక్‌ లెక్చరర్ల ఉద్యోగాలకు ఎంపికైన 1,532 మందికి సీఎం రేవంత్​రెడ్డి  నియామక పత్రాలు అందజేశారు. కొత్తగా ఉద్యోగ బాధ్యతలు చేపడుతున్న వారికి రేవంత్​ అభినందనలు తెలిపారు. కొత్త అధ్యాపకులు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంవైపు నడిపించాలని సూచించారు. సీఎం కుర్చీని ప్రజలే గుంజుకొని తనకు ఇచ్చారని, అయినా.. తనను కొందరు పనిచేయనివ్వడం లేదని అన్నారు. గతంలో పాలించిన వాళ్లు (బీఆర్ఎస్) సక్రమంగా పనిచేస్తే.. ఇప్పుడు ఇవి తానెందుకు ఇచ్చేవాణ్ని అని అడిగారు. పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తే.. కొట్లాడే పరిస్థితి తనకెందుకు  వస్తుండేదని ప్రశ్నించారు. ఎస్ఎల్​బీసీని 2005–06లో ప్రారంభిస్తే.. 2025 దాకా పూర్తికాలేదని, అందువల్లే కదా ఇప్పుడు ప్రమాదం జరిగి 8 మంది చనిపోయారని అన్నారు.  సర్కారులోని అంశాలను తాను చూసుకుంటానని, లెక్చరర్లంతా పిల్లల భవిష్యత్తును చూసుకోవాలని సూచించారు. రేపటి నాయకత్వాన్ని ఇవ్వాల్సింది టీచర్లు, లెక్చరర్లేనని పేర్కొన్నారు. తామంతా గవర్నమెంట్ స్కూళ్లలో చదువుకొని ఈ స్థాయికి వచ్చామని చెప్పారు. తెలంగాణ భవిష్యత్​ పునర్నిర్మాణానికి ఉద్యోగులు కృషి చేయాలని కోరారు. 

కేసీఆర్​ను స్టేచర్ నుంచి స్ట్రెచర్​ మీదికి పంపిన్రు..

రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతోనే కొన్ని బిల్లులు ఆగిపోతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ‘‘ఉద్యోగుల సమస్యలు ఉన్నాయి. సమస్యలు పరిష్కారం కాలేదు. అలా అని సర్కారుకు సహకరించం అంటే మన పరిస్థితి ఇంకా దిగిజారిపోతుంది’’ అని వ్యాఖ్యానించారు. దీంతో నెలనెలా జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేకుండా పోతుందని చెప్పారు. గత ప్రభుత్వంలో ఒకటో తారీఖున జీతాలు వచ్చింది లేదని, కానీ ప్రస్తుతం ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతాలు ఇస్తున్నట్టు సీఎం చెప్పారు. ఈ నెల చాలా ఇబ్బంది వస్తే.. ప్రత్యేకంగా తల తాకట్టు పెట్టి రూ.4 వేల కోట్లు అప్పు తెచ్చి.. జీతాలు ఇచ్చినట్టు వెల్లడించారు. డీఏ, ఇతర బకాయిలు ఉన్నాయని తెలిపారు. ‘‘ నేను కేవలం  మీ కస్టోడియన్ ని. నాకు ఎలాంటి కిరీటం లేదు. గతంలో ఒకాయన స్టేచర్ ఉందని విర్రవీగితే.. స్ట్రెచర్ మీదికి పంపించారు. అలాగే చేస్తే మార్చురీకి పంపిస్తారు’’ అని  కేసీఆర్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం కాళేశ్వరం కట్టుడు అయిపోయింది.. కూలుడు కూడా అయిపోయిందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఫ్యామిలీ ప్యాకేజీల అబద్ధాలు మాట్లాడుతున్నదని మండిపడ్డారు. 

57,940 ఉద్యోగాలు నింపినం..

గత ప్రభుత్వానికి తెలంగాణ ఉద్యమం పట్ల గౌరవం లేకనో, నిరుద్యోగుల పట్ల నిబద్ధత లేకనో నిరుద్యోగ సమస్య పరిష్కారం కాలేదని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకూ 57,940 ఉద్యోగాలను భర్తీ చేసిందని చెప్పారు. గత ప్రభుత్వం సరిగా లేకపోవడంతో ఆ కుటుంబంలోని తండ్రి, కొడుకు, కూతురు, అల్లుడి ఉద్యోగాలను మీరు తీసేస్తే.. మీకు ఈ ఉద్యోగాలు వచ్చాయని పేర్కొన్నారు. 23 ఏండ్ల వయస్సులో ఉద్యోగాల్లో చేరాల్సిన వారంతా.. 35 ఏండ్లలో చేరుతున్నారని, ఇది కేవలం నిరుద్యోగులకు జరిగిన అన్యాయం కాదని, తెలంగాణ సమాజానికి జరిగిన అన్యాయమని పేర్కొన్నారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగ నియామకాలకు సంబంధించి న్యాయస్థానాల్లోని ఒక్కో చిక్కుముడి విప్పుకుంటూ వస్తున్నట్టు వివరించారు. దేశ చరిత్రలో అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 57,940 ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా లేదని అన్నారు. విద్యాశాఖ కీలకమైందని, అయినా పదేండ్ల పాటు నిర్ల క్ష్యానికి గురైందని చెప్పారు. అందుకే గత బడ్జెట్​లో రూ.21,650 కోట్ల నిధులు కేటాయించినట్టు వివరించారు. ఈ క్రమంలోనే ఏండ్ల నుంచి పెండింగ్​లో ఉన్న 22వేల మంది టీచర్లకు ప్రమోషన్లు, 36 వేలమంది బదిలీలు నిర్వహించినట్టు చెప్పారు. కేవలం 55 రోజుల్లోనే డీఎస్సీ నిర్వహించి, 11వేలకు పైగా టీచర్ పోస్టులు భర్తీ చేసినట్టు తెలిపారు.

సర్కారు స్కూల్స్​ కంటే ప్రైవేట్​ బడులు గొప్పవా? 

రాష్ట్రంలోని సర్కారు బడుల్లో ప్రతిఏటా విద్యార్థుల సంఖ్య తగ్గుతున్నదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. స్టేట్​లో మొత్తం 29,550 సర్కారీ విద్యాసంస్థల్లో 25.45 లక్షల మంది చదువుతుండగా, 11 వేల ప్రైవేట్​ బడుల్లో 36 లక్షల మంది పిల్లలు చదువుకుంటున్నారని చెప్పారు. ప్రభుత్వం సర్కారు విద్యార్థులపై ఒక్కొక్కరి మీద ఏటా రూ.80వేల నుంచి రూ.లక్ష వరకూ ఖర్చు చేస్తున్నదని తెలిపారు. సర్కారు స్కూల్స్ కంటే ప్రైవేట్​ బడులు గొప్పవా? అని ప్రశ్నించారు. మన గవర్నమెంట్​ స్కూళ్లు ప్రైవేట్​తో పోటీ పడేలా ఎందుకు ఉండడం లేదో ఆలోచించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సర్కారును నడిపే శక్తి సర్కారు బడుల్లో చదివిన వారికి ఉన్నప్పుడు.. మరి ఎందుకు పేరెంట్స్ పిల్లలను సర్కారు స్కూళ్లకు పంపించడం లేదనే దానిపై అందరం ఆలోచించాలని అన్నారు. ప్రస్తుతం మన రాష్ట్రం విద్యలో అట్టడుగున ఉందని తెలిపారు.  

విద్యారంగంపై పదేండ్లు నిర్లక్ష్యం: మంత్రి పొన్నం

గత ప్రభుత్వం హయాంలో విద్యారంగం పదేండ్లపాటు నిర్లక్ష్యానికి గురైందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.  సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో విద్యారంగంలో సమూల మార్పులు తీసుకొస్తున్నట్టు చెప్పారు. వర్సిటీలకు కొత్త వీసీలను నియమించామని, ప్రొఫెసర్ల రిటైర్​మెంట్​ ఏజ్ పెంచామని తెలిపారు. సర్కారు బడుల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నట్టు వివరించారు. భవిష్యత్తులో సర్కారు విద్యాసంస్థల్లో చదువుకుంటే గౌరవం అన్న విధంగా లెక్చరర్లు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, ఎమ్మెల్యేలు శ్రీహరి, జయవీర్, సత్యనారాయణ, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, సీఎస్ శాంతికుమారి, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, టెక్నికల్ ఎడ్యుకేషన్ సెక్రెటరీ శ్రీదేవసేన, ఇంటర్ బోర్డు సెక్రెటరీ కృష్ణ ఆదిత్య, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నర్సింహారెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఇంటర్ బోర్డు సీఓవో జయప్రదబాయి పాల్గొన్నారు.


ఎట్ల పంచాలో మీరే చెప్పండి 

రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పైసాపైసా లెక్క తాను చెప్తానని, తన నెల జీతం కూడా ఇస్తానని, దాన్ని ఎట్ల పంచాలో చెప్పాలని సీఎం రేవంత్​ అన్నారు.  ప్రతినెలా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.18 వేల కోట్ల నుంచి రూ.18,500 కోట్ల వరకూ ఆదాయం వస్తున్నదని తెలిపారు. దీంట్లో రూ.6, 500 కోట్లు ఉద్యోగుల జీతభత్యాలకు ఇస్తున్నామని, మరో రూ.6,500 కోట్లు కేసీఆర్ చేసిన అప్పులు, తప్పులకు ప్రతినెలా పదో తారీఖు వరకూ కట్టాల్సి వస్తున్నదని వివరించారు.  మిగిలిన ఐదు, ఐదున్నర వేల కోట్లలోంచే రైతు రుణమాఫీ, రైతు భరోసా, కల్యాణ లక్ష్మి, పింఛన్లు, షాదీ ముబారక్​ లాంటి 25–30 ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఉపయోగిం చాల్సి ఉంటుందని తెలిపారు. ఇవికాకుండా కూలిపోయిన కాళేశ్వరం నిర్మాణం, ఆగిపోయిన శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ కట్టాలని, రింగ్ రోడ్డు నిర్మాణానికి ఇవ్వాలని అన్నారు. గత ప్రభుత్వం కాంట్రాక్టర్లకే రూ.42 వేల కోట్ల బకాయిలు పెట్టి పోయిందని తెలిపారు. రూ. 22 వేల కోట్లు వస్తే  తాము ఇచ్చిన హామీలన్నీ అమలు చేయగలమని, కానీ  పూర్తిస్థాయి నిధులు లేకపోవడంతో ఒకనెల అంగన్ వాడీలకు, మరో నెల ఆశాలకు, ఇంకో నెల షాదీ ముబారక్, కల్యాణలక్ష్మికి బకాయి పెట్టాల్సి వస్తున్నదని వెల్లడించారు. 

చదువుతోపాటు ఆటల్లోనూ ప్రోత్సాహం

ప్రపంచంతో తెలంగాణ పోటీ పడేలా ఐక్యంగా కృషి చేద్దామని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. స్టేట్​లో 100 యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లు, యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న ఇండియా ఈసారి ఒలింపిక్స్​లో ఒక్క గోల్డ్ మెడల్ సాధించలేకపోయిందని అన్నారు. దీంతో స్పోర్ట్స్​ను ప్రోత్సహించాలని తమ ప్రభుత్వం నిర్ణయించినట్టు చెప్పారు. ఇంటర్ పాసైన హైదరాబాదీ క్రికెటర్ సిరాజ్​కు, బాక్సింగ్​లో రాణిస్తున్న నిఖత్​ జరీన్​కు డీఎస్పీ కొలువులు ఇచ్చామని, దీప్తికి గ్రూప్-2 జాబ్ ఇచ్చామని గుర్తుచేశారు.