హైదరాబాద్: తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాది కాలంలో సాధించిన విజయాలు, చేపట్టిన కార్యక్రమాలు, వివిధ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి డిసెంబర్ 7వ తేదీతో ఏడాది కావస్తోన్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రజాపాలన – ప్రజా విజయోత్సవ వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రజాపాలన – ప్రజా విజయోత్సవ కార్యక్రమాల నిర్వహణపై 2024, నవంబర్ 14న సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజాపాలన విజయోత్సవాలకు సంబంధించి డిసెంబర్ 9 వరకు చేపట్టనున్న కార్యక్రమాలను ఈ సందర్భంగా అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు.
ఒకవైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే ఏడాది కాలంలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినందున వాటన్నంటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్ ట్యాంక్‌బండ్, సెక్రటేరియట్, నెక్లెస్‌రోడ్ పరిసరాల్లో విజయోత్సవ వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. డిసెంబర్ 9న సచివాలయం ఆవరణలో ఏర్పాటు చేయనున్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎ రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలను ఆహ్వానించనున్నారు.
ALSO READ | కులగణన ఆధారంగా సంక్షేమ పథకాలు తొలగించం: CM రేవంత్ కీలక ప్రకటన
ఈ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఈ నెల 19న వరంగల్ వేదికగా 22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. మహిళల సాధికారత, రైతుల సంక్షేమం, యూత్ ఎంపవర్‌మెంట్‌కు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చిన నేపథ్యంలో వాటికి సంబంధించి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నారు.
ఈ విజయోత్సవాల నేపథ్యంలో నియోజకవర్గాల వారీగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు తొలి ఏడాదిలో ప్రభుత్వం సాధించిన విజయాలు, కార్యక్రమాలపై శాఖలు, విభాగాల వారిగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహదారులు వేం నరేందర్ రెడ్డి, కె.కేశవరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.