ఆధునిక పద్ధతులతో పంటల సాగు : అభిలాష అభినవ్

 ఆధునిక పద్ధతులతో పంటల సాగు : అభిలాష అభినవ్
  • కలెక్టర్​ అభిలాష అభినవ్

నిర్మల్, వెలుగు: ఆధునిక పద్ధతులలో సంప్రదాయ పంటలు సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. జాతీయ ఆహార భద్రత పథకం–2024 కింద జిల్లాలో వ్యవసాయ శాఖ ద్వారా అమలవుతున్న కార్యాచరణపై శనివారం కలెక్టరేట్ లో వ్యవసాయ శాఖ అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఆధునిక పద్ధతుల ద్వారా సాంప్రదాయ పంటలు సాగు చేస్తూ అధిక దిగుబడులు సాధించేలా రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. 

జిల్లాలో వరి, జొన్న, నూనె గింజలు, పప్పు ధాన్యాల విస్తీర్ణం పెంచాలని, అధిక దిగుబడులు సాధించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యాచరణ అమలుకు రూ.కోటి నివేదిక ఆమోదించినట్లు చెప్పారు. రైతులందరికీ సేంద్రియ వ్యవసాయ ప్రాధాన్యంపై అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించి, సహజ సిద్ధ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని సూచించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి అంజి ప్రసాద్, డీఆర్డీవో విజయలక్ష్మి, మార్క్ ఫెడ్ డీఎం ప్రవీణ్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలి

జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో నిర్మూలించేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్ లో అడిషనల్ కలెక్టర్ కిషోర్ కుమార్​తో కలిసి రెవెన్యూ, భూగర్భ జల, మైనింగ్ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు నిర్దేశించిన ప్రాంతాల్లోనే రాయల్టీ రుసుము చెల్లించి ఇసుక తవ్వకాలు చేపట్టాలన్నారు. జిల్లాలోని వాగులు, నదీ పరివాహక, ఇసుక తవ్వకాల ప్రాంతాలను గుర్తించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. తహసీల్దార్లు ఇసుక అక్రమ రవాణాపై నిరంతరం పర్యవేక్షణ ఉంచాలన్నారు. ఏడీ మైన్స్ రవీందర్, డీపీవో శ్రీనివాస్, నిర్మల్, భైంసా ఆర్డీవోలు రత్నకల్యాణి, కోమల్ రెడ్డి, తహసీల్దార్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.