నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : బైక్స్ పై వచ్చే వారికి హెల్మెట్ లేకుంటే కలెక్టరేట్లోకి ఎంట్రీ లేదని కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. శనివారం కలెక్టరేట్లో రోడ్డు భద్రతా మాసోత్సవాల పోస్టర్లను ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ట్రాఫిక్ రూల్స్ పాటించాలని చెప్పారు. ప్రతి పాఠశాలలో విద్యార్థులకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించేలా వ్యాసరచన, చిత్రలేఖన పోటీలను నిర్వహించాలని డీఈఓ ను ఆదేశించారు.
ప్రతిభ చూపిన వారికి జనవరి 26న ప్రశంసా పత్రాలు అందజేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. మహిళా సంఘాలతో రోడ్డు భద్రతా ప్రమాదాలు జరగకుండా అవగాహన పెంచేలా కలెక్టరేట్ ప్రాంగణంలో ముగ్గుల పోటీలను ఏర్పాటు చేయాలని డీఆర్డీఏను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా రవాణా శాఖ అధికారి చిన్న బాలు, డీఈఓఏ రమేశ్ కుమార్ పాల్గొన్నారు.