- కలెక్టర్ హనుమంతరావు
యాదగిరిగుట్ట, వెలుగు : ఉద్యోగులు సమయపాలన పాటించకుండా.. ముందస్తు సమాచారం లేకుండా విధులకు గైర్హాజరైతే చర్యలు తప్పవని యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు హెచ్చరించారు. గురువారం బొమ్మలరామారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీలు చేశారు. పీహెచ్సీ అటెండెన్స్ రిజిస్టర్ ను పరిశీలించి ఎంతమంది సిబ్బంది విధులకు వచ్చారు.? ఎంతమంది డుమ్మా కొట్టారో ఆరా తీశారు.
సమాచారం లేకుండా విధులకు గైర్హాజరైన మండల మెడికల్ ఆఫీసర్ శ్రీహర్ష, ల్యాబ్ టెక్నీషియన్ మమత, ఎంపీహెచ్ఎస్ సుమతికి కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదన్నారు. పీహెచ్సీలో మందుల కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలన్నారు.
హాస్పిటల్ పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని పీహెచ్సీ సిబ్బందిని ఆదేశించారు. అనంతరం బొమ్మలరామారం తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ సందర్శించారు. రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.