
- కలెక్టర్ ఇలా త్రిపాఠి
నల్గొండ అర్బన్, వెలుగు : రాజీవ్ యువ వికాసం పథకానికి అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. శుక్రవారం కనగల్ మండలం జీ.ఎడవెల్లి గ్రామంలో రాజీవ్ యువ వికాసం పథకంపై యువతకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. జిల్లాలో జీ.ఎడవల్లి అత్యంత వెనుకబడిన గ్రామమని, ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి దత్తత తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈనెల 14లోపు ఈ పథకం కింద ఆర్థిక సహాయం కోరే వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
రేషన్ కార్డులు లేనివారు ఆదాయం, కులం ధ్రువపత్రాలు సమర్పించాలని తెలిపారు. అనంతరం జీ.ఎడవల్లి చెరువు అలుగును కలెక్టర్ పరిశీలించారు. అలుగు మరమ్మతుల కోసం ప్రతిపాదనలు పంపించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి.మాన్యనాయక్, ఆర్డీవో వై.అశోక్ రెడ్డి, జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి విజయేందర్ రెడ్డి, గిరిజన సంక్షేమశాఖ అధికారి రాజ్ కుమార్, సహాయ బీసీ సంక్షేమ అధికారి సంజీవయ్య, అధికారులు పాల్గొన్నారు.