
జనగామ, వెలుగు: ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో జాప్యం చేయవద్దని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను, సెంటర్ల నిర్వాహకులను ఆదేశించారు. శుక్రవారం ఆయన అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్తో కలిసి ఆర్డీవోలు, డీఆర్డీవో, సివిల్ సప్లై డీఎం, డీసీఎస్వో, డీసీవో, అన్ని మండలాల తహసీల్దార్లు, వ్యవసాయ, మార్కెటింగ్ తదితర అధికారులతో జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసి ప్రతీ కొనుగోలు కేంద్రంపై ఆరా తీశారు.
తేమ శాతం రాగానే ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. ఆ వెంటనే ఓపీఎంఎస్ లో వివరాల నమోదు పూర్తి చేసి ట్యాగ్ చేసిన మిల్లుకు తరలించాలన్నారు. కొనుగోలు ప్రక్రియకు సంబంధించిన రిజిస్టర్లను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేయాలన్నారు. ఎండల తీవ్రత ఎక్కువ కావడంతో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
మలేరియా నిర్మూలనకు కృషి చేయాలి..
మలేరియాను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ అవగాహన ఏర్పరచుకోవాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్అన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా జనగామలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆర్టీసీ చౌరస్తా నుంచి కలెక్టరేట్వరకు శుక్రవారం అవగాహన ర్యాలీని నిర్వహించారు. కార్యక్రమాన్ని కలెక్టర్ డీఎంహెచ్వో కావూరి మల్లికార్జున్రావుతో కలిసి జెండా ఊపి ప్రారంభించి, మాట్లాడారు. దోమల నివారణకు పరిసరాల పరిశుభ్రత, నీటి నిల్వ ఉండకుండా చూసుకోవాలని, గ్రామ స్థాయిల్లో అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్అశోక్, కమల్ హసన్, డెమో ప్రభాకర్, రవీందర్, ఆశలు పాల్గొన్నారు.