
భద్రాచలం, వెలుగు : మండు వేసవిలో, శ్రీరామనవమి నాడు అభిజిత్ లగ్నంలో మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఏప్రిల్‌లో భద్రాచలం మిథిలాస్టేడియంలో జరిగే శ్రీరామనవమి సీతారాముల కల్యాణాన్ని ‘చల్లచల్లగా చూద్దాం రారండి’ అంటూ భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్ వి పాటిల్ భక్తులకు పిలుపునిచ్చారు. బుధవారం సీతారామచంద్రస్వామిని ఆయన దర్శించుకున్నారు.
వేదపండితుల నుంచి ఆశీర్వచనం తీసుకున్నాక శ్రీరామనవమి ఏర్పాట్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భక్తులు సీతారాముల కల్యాణం తిలకించే మిథిలాప్రాంగణంలో వేసవి ఉక్కపోత నుంచి విముక్తి కల్పించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. ప్రాంగణంతో పాటు, అవుట్ డోర్లో కూడా మైక్రో ఇరిగేషన్ ద్వారా స్పింక్లర్లతో నీటిని స్ప్రే చేస్తామని చెప్పారు.
ప్రయోగాత్మకంగా చేపట్టే ఈ ప్రయత్నానికి నీళ్లు ఎక్కువగా అవసరమవుతాయని, కనీసం 20వేల లీటర్లు కావాల్సి ఉంటుందని పేర్కొన్నారు. సమీపంలో బోర్ పాయింట్‌ను సిద్ధం చేయాలని ఈవో రమాదేవిని ఆదేశించారు. త్వరలో ఈ ఏర్పాట్లు పరిశీలించేందుకు మైక్రో ఇరిగేషన్ ఇంజినీర్ల బృందాన్ని భద్రాచలం రప్పిస్తున్నట్లు చెప్పారు. భక్తులకు అవసరమైనన్ని తలంబ్రాలను పంపిణీ చేసేందుకు సిద్ధం చేస్తున్నామన్నారు.
వసతికి కూడా ఇబ్బంది లేకుండా గోదావరి ఒడ్డున పందిళ్లు నిర్మిస్తున్నామని వివరించారు. మిథిలా ప్రాంగణంలో సెక్టార్లు నిర్మాణం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆఫీసర్లంతా కో ఆర్డినేట్ చేసుకోవాలని, మరో ఐదు రోజుల్లో మీటింగ్ నిర్వహించి రివ్యూ చేద్దామన్నారు. అనంతరం గోదావరి బ్రిడ్జి సెంటర్లో ఉన్న బాలల సదనాన్ని సందర్శించారు. అక్కడి సౌకర్యాలను పరిశీలించి వేసవిలో చిన్న పిల్లల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వారికి సూచించారు. కలెక్టర్‌వెంట ఆర్డీవో దామోదర్ ఉన్నారు.
దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ఎదగాలి
భద్రాద్రికొత్తగూడెం : దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ఎదగాలని కలెక్టర్ జితేశ్ఆకాంక్షించారు. పాతకొత్తగూడెంలో బుధవారం ఏర్పాటు చేసిన ప్రోగ్రాంలో విద్యాశాఖ, అలింకో సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉపకరణాలను ఆయన పంపిణీ చేశారు. 288 మంది దివ్యాంగులకు 348 ఉపకరణాలను పంపిణీ చేయడం ఆనందంగా ఉందన్నారు. పారా ఒలంపిక్ ప్రపంచ పోటీల్లో దివ్యాంగులు ఎంతో మంది మెడల్స్ సాధించారన్నారు.
భవిత కేంద్రాలను దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ ప్రోగ్రాంలో డీఈవో వెంకటేశ్వరాచారి, సమ్మిళిత విద్య జిల్లా కో ఆర్డినేటర్ ఎస్కె. సైదులు, జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలత లెనినా, అలింకో సంస్థ ఇన్చార్జి సురుష, మోహిత్ పాల్గొన్నారు.