- రెడ్ అలర్ట్ ప్రకటించిన ఆఫీసర్లు
- మునిగిన రోడ్లు.. నిలిచిన రాకపోకలు
- ముంపు ప్రాంతాల్లోనే అధికారుల బస
- మైక్‌ల ద్వారా ప్రచారం.. ముందస్తు చర్యలు
భద్రాచలం, వెలుగు : గోదావరికి శనివారం భద్రాచలం వద్ద 53 అడుగుల వద్ద మూడో ప్రమాద హెచ్చరికను కలెక్టర్ జితేశ్వి పాటిల్జారీ చేశారు. గోదావరి తీరంలోని భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల, బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు, పినపాక మండలాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. సెక్టోరియల్ ఆఫీసర్లంతా వారికి కేటాయించిన మండలాల్లోనే బస చేశారు.
ముంపు ప్రభావ గ్రామాల్లో మైక్‌ల ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నారు. ముందస్తుగా ట్రాక్టర్లు, ఆటోల ద్వారా పునరావాస కేంద్రాలకు వారిని తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే గోదావరి పరివాహక ప్రాంతంలోని భద్రాచలం, బూర్గంపాడు, దుమ్ముగూడెం మండలాలకు చెందిన 104 కుటుంబాల్లోని 346 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు.
ఎన్డీఆర్ఎఫ్ టీంలతో గస్తీ
ఏడు మండలాల్లో వరద ప్రభావం ఉన్న గ్రామాలకు ఎన్డీఆర్ఎఫ్ బలగాలను తరలించారు. వీరు స్థానికంగా ప్రజలను చైతన్య పరుస్తూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తున్నారు. ఆస్తి, ప్రాణనష్టం వాటిల్లకుండా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. నాటు పడవలతో పాటు ఎన్డీఆర్ఎఫ్ నుంచి వచ్చిన కొన్ని బోట్లు సిద్దంగా ఉంచారు. కలెక్టర్, ఐటీడీఏ పీవో, ఆర్డీవో ఆఫీసుల్లో కంట్రోల్ రూంల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ ఆఫీసర్లను అలర్ట్ చేస్తున్నారు. వాగులు, నదుల్లో పడవ ప్రయాణాలు చేయకుండా గస్తీ కాస్తున్నారు. దుమ్ముగూడెం, చర్ల మండలాల్లోని గిరిజన గ్రామాల్లో ముందస్తు చర్యలు తీసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ముంపు ప్రాంతాలకు 4వేల టన్నుల బఫర్ స్టాక్ పంపించారు. డీజిల్, పెట్రోలు నిల్వలు సిద్ధం చేశారు.
ఆంధ్రా బ్యాక్ వాటర్‌తో సమస్య..
భద్రాచలం టౌన్‌ను ఆనుకుని ఉన్న విలీన ఆంధ్రా ఎటపాక మండల కేంద్రం వద్ద ఉన్న గోదావరి కరకట్ట వద్ద స్లూయిజ్‌లను ఆంధ్రా సర్కారు పట్టించుకోలేదు. శనివారం మధ్యాహ్నం వరకు అశోక్‌నగర్ కొత్తకాలనీ, ఏఎంసీ కాలనీల్లోకి చుక్కనీరు లేని టైంలో ఆంధ్రా నుంచి వచ్చిన బ్యాక్ వాటర్ ఇళ్లలోకి వచ్చింది. కలెక్టర్, ఆర్డీవోలు అలెర్ట్ అయి వెంటనే వారిని పునరావాస కేంద్రాలకు తరలించారు. వారికి మహిళా సంఘాలతో భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. బ్యాక్ వాటర్‌ను మోటార్ల సాయంతో ఎత్తిపోస్తున్నారు. 206 మందిని ఇళ్ల నుంచి ఖాళీ చేయించారు.
రహదారులు మునక
గోదావరి వరద ప్రభావంతో వాగులు, వంకలు ద్వారా నీరు రోడ్లెక్కాయి. భద్రాచలం నుంచి బూర్గంపాడు మండలంతో పాటు, అటు వైపు నుంచి రాజమండ్రి, అశ్వారావుపేట, కుక్కునూరు వెళ్లే మార్గాలు నీటమునిగాయి. దీనితో రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం నుంచి పేరూరు స్టేట్‌హైవేపై కూడా నీరు చేరింది. దుమ్ముగూడెం మండలం తూరుబాక, పర్ణశాల వద్ద నీరు చేరి వాహనాల రాకపోకలు ఆగిపోయాయి. భద్రాచలం నుంచి ఆంధ్రా, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలకు వెళ్లే విజయవాడ-జగదల్పూర్ జాతీయ రహదారిపై రాయనపేట, చట్టిల వద్ద రోడ్లు మునిగాయి. భద్రాచలం నుంచి ఖమ్మం, హైదరాబాద్‌కు వెళ్లే మణుగూరు క్రాస్ రోడ్డు మాత్రమే రవాణాకు అనువుగా ఉంది.