గోదావరిఖని, వెలుగు: రామగుండం కార్పొరేషన్ సమగ్రాభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. బుధవారం రామగుండంలో కలెక్టర్ పర్యటించారు. మల్కాపూర్ శివారులోని ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను సందర్శించారు. కార్పొరేషన్, పరిసర గ్రామాల్లోని సెప్టిక్ వ్యర్థాలను శుభ్రం చేశాకే ఇక్కడికి తరలించాలన్నారు. అనంతరం కార్పొరేషన్ ఆఫీస్‌లో అభివృద్ధి, శానిటేషన్, ఇతర అంశాలపై అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ, ఇతర ఆఫీసర్లతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు.
టీయూఎఫ్‌ఐడీసీ స్కీమ్ ద్వారా బల్దియాకు మంజూరైన రూ.100 కోట్లతో చేపట్టే పనుల వివరాలు, అమృత్ 2 స్కీమ్‌లో భాగంగా జరుగుతున్న పనులు, శానిటేషన్, వన మహోత్సవం.. తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. రామగుండంలో రూ.4 కోట్లతో చేపట్టే ఫ్రూట్‌మార్కెట్‌ఏర్పాటుకు తుది ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. అనంతరం గోదావరిఖని హాస్పిటల్‌లో నిర్మిస్తున్న 355 పడకల ఆసుపత్రి పనులను పరిశీలించారు. కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్, ఇతర ఆఫీసర్లు పాల్గొన్నారు.