భూ సమస్యల పరిష్కారానికే భూభారతి .. కలెక్టర్ల అవగాహన కార్యక్రమాలు

భూ సమస్యల పరిష్కారానికే భూభారతి .. కలెక్టర్ల అవగాహన కార్యక్రమాలు

జన్నారం, వెలుగు: భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకే ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. భూభారతిపై బుధవారం జన్నారం మండల కేంద్రంలోని రైతు వేదికలో, దండేపల్లి తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన రైతుల అవగాహన సదస్సులో కలెక్టర్​ పాల్గొని మాట్లాడారు. గతంలో ఉన్న ధరణిలో కొన్ని లోపాలుండడంతో భూ సమస్యలు పరిష్కారం కాలేదని, ప్రస్తుత ప్రభుత్వం రూపొందించిన భూభారతిలో వాటిని సరిచేసినట్లు చెప్పారు. భూభారతిలో రెవెన్యూ రికార్డులు కరెక్ట్​గా ఉంటాయని, ఏడాదికోరి భూముల రికార్డులను తీసి వాటి ఫైళ్లను తహసీల్దార్ ఆఫీస్ లో భద్రపరచనున్నట్లు చెప్పారు. 

భూ సమస్యలన్నీ తహసీల్దార్​ వద్దనే పరిష్కారమయ్యేలా భూభారతిని రూపొందించామన్నారు. ఒకవేళ తహసీల్దార్ వద్ద పరిష్కారం కాకపోతే ఆర్డీవోకు అప్పీల్ చేసుకోవచ్చని, అక్కడ కూడా న్యాయం జరగకపోతే కలెక్టర్​కు అప్పీల్ చేసుకునే ఆవకాశం భూభారతిలో ఉందని వివరించారు. కార్యక్రమం అనంతరం ఐకేపీ ఆధ్వర్యంలో మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో అడిషనల్ కలెక్టర్ మోతీలాల్, ఆర్డీవో శ్రీనివాస్, జిల్లా వ్యవసాయధికారి కల్పన, ఏడీ శ్రీనివాస్, తహసీల్దార్ రాజామనోహర్ రెడ్డి, ఏవో సంగీత, మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీనారాయణ, పొనకల్ పీఏసీఎస్ చైర్మన్ అల్లం రవి, దండేపల్లి మండల స్పెషల్ ఆఫీసర్ దుర్గప్రసాద్, తహసీల్దార్ సంధ్యారాణి, ఎంపీడీవో ప్రసాద్, అధికారులు, కాంగ్రెస్​ నేతలు పాల్గొన్నారు.

భూభారతిపై అవేర్​నెస్​ కల్పిస్తాం

ఆసిఫాబాద్, వెలుగు: భూభారతి, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇండ్ల వెల్ఫేర్ స్కీమ్​లను జిల్లాలో పకడ్బందీగా అమలు చేస్తామని ఆసిఫాబాద్​ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. బుధవారం కలెక్టరేట్​లో ఎస్పీ డీవీ శ్రీనివాసరావు, అడిషనల్ కలెక్టర్లు దీపక్ తివారీ, డేవిడ్ తో కలిసి భూ భరతి చట్టం అమలు, సన్న బియ్యం పంపిణీ, నకిలీ విత్తనాల అక్రమ రవాణా నివారణ చర్యలు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు, అర్హులైన జాబితా రూపకల్పన, వేసవిలో తాగునీటి సరఫరా అంశాలపై మీడియా సమావేశంలో మాట్లాడారు. సంక్షేమ పథకాలను అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ అందిస్తామని చెప్పారు. భూభారతి నూతన ఆర్ఓఆర్ చట్టంలోని అంశాలు, హక్కులపై అవగాహన కల్పించడంతో పాటు రైతులకు మేలు కలిగేలా అప్పీలు చేసుకునే అవకాశం కల్పించినట్లు చెప్పారు.

 విరాసత్, పంపకాలు, కొనుగోలు, పట్టా మార్పిడిలో సంబంధీకులకు నోటీసులు జారీ చేసే అవకాశాన్ని కల్పించడం ద్వారా పారదర్శకమైన పట్టా మార్పిడికి అవకాశం ఉంటుందన్నారు. భూభారతి చట్టంపై ఈ నెల 17 నుంచి 30వ తేదీ వరకు ప్రతి మండల కేంద్రంలో అవగాహన కల్పిస్తామని తెలిపారు. సన్నబియ్యం అక్రమ రవాణా చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నకిలీ పత్తి విత్తనాల అక్రమ రవాణా, అమ్మకాలు జరగకుండా విస్తృతస్థాయిలో తనిఖీలు చేపడతామని, సరిహద్దు ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి నకిలీ విత్తనాల అక్రమ రవాణాను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.