- మహిళా శక్తి’ లోన్లు పొందిన వాళ్లతో కలెక్టర్ ముచ్చట
పెనుబల్లి, వెలుగు : షాప్ ఎలా ఉందమ్మా.. లాభాలు వస్తున్నాయా.. ప్రభుత్వం నుంచి ఇంకేమైనా సహాయం కావాలా.. ’ అని ఇందిరా మహిళా శక్తి స్వయం ఉపాధి ద్వారా లోన్లు పొంది దుకాణాలు నడుపుతున్న మహిళలను ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ పలుకరించారు. గురువారం పెనుబల్లి మండలంలో కలెక్టర్ పర్యటించారు. ఇందిరా మహిళా శక్తి ద్వారా రుణాలు పొంది ఏర్పాటు చేసుకున్న కుటీర పరిశ్రమలను ప్రారంభించారు.
మండలంలో నాలుగు షాప్ లను లబ్ధిదారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని మహిళలకు లబ్ధి చేకూరేలా తెలంగాణ ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి ద్వారా రుణాలు మంజూరు చేస్తోందని తెలిపారు. వాటిని సద్వినియోగం చేసుకొని వ్యాపారాలు బలపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ గంటా ప్రతాప్, ఎంపీడీవో అన్నపూర్ణ, ఎంపీవో ఉపేంద్రయ్య, ఆర్ఐ విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
పేషెంట్లతో మర్యాదగా ఉండాలి..
వెంసూరు : ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులతో సిబ్బంది మర్యాదగా ఉండాలని కలెక్టర్ సూచించారు. వెంసూరు మండల కేంద్రంలోని పీహెచ్ సీని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతోనే ప్రభుత్వ సిబ్బంది పని చేయాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలు ప్రోత్సహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్వో కళావతి బాయి, డిప్యూటీ డీఎంహెచ్ వో సీతారామ్, మెడికల్ ఆఫీసర్ ఇందుప్రియాంక, డాక్టర్ శ్రీవిద్య, తహసీల్దార్ ఎం.రాజు పాల్గొన్నారు.