జిల్లాలో సజావుగా కుటుంబ సర్వే : రాజీవ్ గాంధీ హనుమంతు

జిల్లాలో సజావుగా కుటుంబ సర్వే : రాజీవ్ గాంధీ హనుమంతు
  • కలెక్టర్  రాజీవ్ గాంధీ హనుమంతు
  • చిట్టాపూర్ లో పోలింగ్ బూత్, సర్వే ప్రక్రియ పరిశీలన
  • బాల్కొండలో వడ్ల కొనుగోలు కేంద్రం తనిఖీ 

బాల్కొండ, వెలుగు:  నిజామాబాద్​ జిల్లాలో ఎలాంటి అవాంతరాలు లేకుండా సమగ్ర ఇంటింటి సర్వే కొనసాగుతోందని, ప్రజల నుంచి సేకరించిన సమాచారాన్ని డేటా ఎంట్రీ ఆపరేటర్ల ద్వారా ఎప్పటికప్పుడు ఆన్​లైన్​ లో ఎంట్రీ చేసేందుకు చర్యలు తీసుకున్నామని కలెక్టర్  రాజీవ్  గాంధీ హనుమంతు తెలిపారు. ఆదివారం బాల్కొండ మండలం చిట్టాపూర్ లో నిర్వహిస్తున్న ఇంటింటి సర్వే ప్రక్రియను పరిశీలించారు. ఎన్యుమరేటర్లు ఇంటింటికి వెళ్లి సమాచారం సేకరిస్తున్న తీరు, నిర్ణీత ఫారంలో కోడ్ ల వారీగా వివరాలు నమోదు చేస్తున్న విధానాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు.

 ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సర్వేను పక్కాగా చేపట్టాలన్నారు. ఎలాంటి అనుమానం లేకుండా ప్రజలు సర్వేలో భాగస్వాములు కావాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఇండ్లను ఎన్యుమరేషన్  బ్లాక్ లుగా విభజించి, 175 ఇండ్లకు ఒక ఎన్యుమరేటర్ ను, 10 మంది ఎన్యుమరేటర్లకు ఒక సూపర్​వైజర్ ను నియమించామన్నారు. సర్వే నిర్వహణపై ఇప్పటికే శిక్షణ ఇవ్వడంతో ఎన్యుమరేటర్లు, సూపర్​వైజర్లు సర్వేను పక్కాగా నిర్వహిస్తున్నారని తెలిపారు. సర్వేను ఆర్డీవోలు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారని చెప్పారు.

 అంతకుముందు చిట్టాపూర్  గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలోని పోలింగ్  కేంద్రాన్ని తనిఖీ చేశారు. ప్రత్యేక ఓటరు సవరణ ప్రక్రియలో భాగంగా చేపడుతున్న ఓటరు నమోదు కార్యక్రమాన్ని పరిశీలించారు. ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా వలస వెళ్లిన వారు, చనిపోయిన వారి పేర్లు ఓటరు జాబితా నుంచి తొలగించారా? లేదా? అని పరిశీలించుకోవాలని సూచించారు. బాల్కొండలోని పీఏసీఎస్​ ఆధ్వర్యంలో కొనసాగుతున్న వడ్ల కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్  తనిఖీ చేశారు.

 రైతుల వారీగా వడ్ల కొనుగోలు, బిల్లుల చెల్లింపుల వివరాల రిజిస్టర్ ను పరిశీలించారు. మిల్లులకు ట్రాన్స్​పోర్ట్​ చేసిన ట్రక్  షీట్లను పరిశీలించి, ఎప్పటికప్పుడు ఓపీఎంఎస్  ఎంట్రీలు చేయాలని, దీంతో రైతులకు సకాలంలో బిల్లుల చెల్లింపులు జరుగుతాయన్నారు. సన్న, దొడ్డు వడ్ల వివరాలను ఆన్​లైన్ లో జాగ్రత్తగా నమోదు చేయాలని సూచించారు. కలెక్టర్  వెంట ఆర్మూర్  ఆర్డీవో రాజాగౌడ్, బాల్కొండ ఎంపీడీవో విజయభాస్కర్, తహసీల్దార్ శ్రీధర్  ఉన్నారు.