
గద్వాల, వెలుగు: వేసవిలో తాగునీటి సమస్య రానీయవద్దని కలెక్టర్ సంతోష్ ఆఫీసర్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లో మంచినీటి సరఫరాపై మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో తాగునీటి డిమాండ్, పంపిణీపై దృష్టి పెట్టి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలన్నారు. జిల్లాలో బల్క్ వాటర్ సప్లై, చేతి పంపులు, ప్రైవేట్ బోర్ వెల్స్, ట్యాంకర్స్ ను రెడీ చేసుకోవాలని సూచించారు. ఎక్కడైనా నీటి సమస్య వస్తే వెంటనే నీటిని అందించేందుకు రెడీగా ఉండాలన్నారు.
ఎల్ఆర్ఎస్ను వినియోగించుకోవాలి
అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో 46,739 దరఖాస్తులు వచ్చాయని, వాటిలో ఎల్ వన్ ఆఫీసర్లు ఫీల్డ్ విజిట్ చేసి 14,241 వాటికి అప్రూవల్ ఇచ్చారని తెలిపారు. వీటిలో ఇప్పటివరకు 254 మంది మాత్రమే డబ్బులు కట్టారని, మిగిలిన వారు ఈ నెల 31 వరకు డబ్బులు కట్టి 25 శాతం రాయితీ పొందాలని సూచించారు. ఉపాధి హామీ పనులపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని, కూలీల సంఖ్యను పెంచాలన్నారు. అడిషనల్ కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు, డీపీవో నాగేంద్రం ఉన్నారు.