చివరి ఆయకట్టుకు సాగునీరందించాలి : తేజస్ నందలాల్ పవార్

చివరి ఆయకట్టుకు సాగునీరందించాలి : తేజస్ నందలాల్ పవార్
  • కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ 

సూర్యాపేట, వెలుగు : ఎస్సారెస్పీ స్టేజీ–2 ద్వారా సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ నియోజకవర్గాల్లోని చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్​లో ఇరిగేషన్, రెవెన్యూ, పోలీస్, వ్యవసాయశాఖ అధికారులతో వెబెక్స్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎస్సారెస్పీ ద్వారా సాగునీరు అందిస్తామని, రైతులు నీటిని జాగ్రత్తగా వినియోగించుకోవాలని సూచించారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలని, పగలు, రాత్రి సమయాల్లో కూడా కాల్వల వెంట తిరుగుతూ పరిశీలించాలని చెప్పారు. 

కొందరు రైతులు కాల్వల వెంట మోటార్లతో నీటిని వృథా చేస్తున్నారని, వాటిని అరికట్టాలని ఆదేశించారు. ప్రతిరోజు నీటి వినియోగాన్ని పరిశీలించాలని చెప్పారు. సమావేశంలో ఎస్సీ శివధర్మ తేజ, డీసీ ప్రేమ్​చంద్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శ్రీనివాసరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సత్యనారాయణ, వ్యవసాయశాఖ అధికారి శ్రీధర్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. 

ఉత్తీర్ణత శాతాన్ని పెంచాలి..

తుంగతుర్తి, వెలుగు : పదో తరగతి ఉత్తీర్ణత శాతాన్ని పెంచే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సూచించారు. బుధవారం నూతనకల్, మద్దిరాల మండల కేంద్రాలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతోపాటు క్రమశిక్షణ, నైతిక విలువలను బోధించాలన్నారు. అంతకుముందు నూతనకల్ మండల కేంద్రంలోని మోటార్ బైక్ పై ప్రయాణం చేసి ఉపాధి హామీ పనులను ఆయన పరిశీలించారు.