యువత మత్తుకు బానిస కావొద్దు : తేజస్ నందలాల్ పవార్

యువత మత్తుకు బానిస కావొద్దు  :  తేజస్ నందలాల్ పవార్
  •  కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్  

సూర్యాపేట, వెలుగు : యువత మత్తు మందుకు బానిసై భవిష్యత్ ను నాశనం చేసుకోవద్దని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ లో నార్కోటిక్ కో–ఆర్డినేషన్ సెంటర్ పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలను విద్యాసంస్థలు ఎక్కువ ఉన్న సూర్యాపేట, కోదాడలో యువతకి అవగాహన కల్పించాలని సూచించారు. డ్రగ్స్ నుంచి బయట పడేందుకు డీ–అడిక్షన్ సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించామని తెలిపారు. ఇండస్ట్రీయల్ ఉన్న ప్రదేశాల్లో వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికుల ఉన్నచోట కమ్యూనిటీ మీటింగ్ నిర్వహించాలన్నారు. 

విద్య, పోలీస్ శాఖ సంయుక్తంగా యువత డ్రగ్స్ నుంచి దూరంగా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలు అమలు చేయాలని చెప్పారు. ఎస్పీ నరసింహ మాట్లాడుతూ 2024 లో 139 మంది, 2025 లో 23 మందిని గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. గంజాయి మహమ్మరి నేడు గ్రామాలకు విస్తరించిందని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం  తెలంగాణ ఆంటీ నార్కోటిక్ బ్యూరో వారు రూపొందిన పోస్టర్ ను కలెక్టర్ విడుదల చేశారు. 

రోడ్లపై బ్లాక్ స్పాట్లను గుర్తించాలి..

జిల్లాలోని రోడ్లపై బ్లాక్ స్పాట్లను గుర్తించాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధికారులను ఆదేశించారు. రోడ్ల భద్రతా ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ జిల్లా పరిధిలో నేషనల్ హైవే -65పై 22 బ్లాక్ స్పాట్లను గుర్తించామన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు లైట్స్, స్ట్రాంగ్ స్ట్రిప్స్, సూచిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు వంటి ఏర్పాటు చేయాలని చెప్పారు. వాహనాల వేగం తగ్గించి ప్రజల ప్రాణాలను కాపాడాలని అధికారులకు సూచించారు. 

ఎన్ హెచ్ 365( ఏ) కోదాడ –-ఖమ్మం  ఏఈఈ, ఎన్ హెచ్ఏఐ అధికారులు సమావేశానికి హాజరుకాకపోవడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమావేశంలో యాంటీ నార్కోటిక్ డ్రగ్స్ డీఎస్పీ భిక్షపతిరావు, డీటీవో సురేశ్ కుమార్, డీఈవో అశోక్, డీఐఈవో భానునాయక్, డ్రగ్స్ ఇన్​స్పెక్టర్​ సురేందర్ తదితరులు పాల్గొన్నారు.