హనుమకొండ/ జనగామ అర్బన్, వెలుగు: ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల వెరిఫికేషన్ స్పీడప్ చేయాలని హనుమకొండ, జనగామ కలెక్టర్లు పి.ప్రావీణ్య, రిజ్వాన్బాషా షేక్అధికారులను ఆదేశించారు. గురువారం ఆయా జిల్లాల కలెక్టరేట్లలో వారు అధికారులతో కలిసి రివ్యూ నిర్వహించారు. హనుమకొండలో జీడబ్ల్యూఎంసీ, కుడా పరిధిలోని వివిధ అభివృద్ధి పనులపై గ్రేటర్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడేతో కలిసి వివిధ డిపార్ట్మెంట్ల ఆఫీసర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన, కుడా ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిపై ఆరా తీశారు.
విస్తీర్ణం ప్రకారం చెరువులు, కుంటలకు సంబంధించిన భూములకు హద్దులను ఏర్పాటు చేయాలని, ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. కుడా ఆధ్వర్యంలో ఎల్కతుర్తిలో చేపట్టనున్న జంక్షన్, సుందరీకరణ పనులకు సంబంధించిన వివిధ అంశాలను కుడా, ఆర్టీసీ అధికారులతో చర్చించారు. సమావేశంలో హనుమకొండ ఆర్డీవో వెంకటేశ్, కుడా పీవో అజిత్ రెడ్డి, డీపీవో లక్ష్మీరమాకాంత్, ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల ధ్రువీకరణ నోడల్ అధికారి శంకర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జనగామ కలెక్టర్అడిషనల్ కలెక్టర్ పింకేశ్ కుమార్ తో కలిసి మాట్లాడుతూ మండలానికి ఇచ్చిన యాక్షన్ ప్లాన్ ప్రకారం ఎల్ఆర్ఎస్ ప్రక్రియ జరగాలన్నారు. క్షేత్రస్థాయి పరిశీలన, తదితర పూర్తి వివరాలు అధికారులు కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో మన్సూరీ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.