ఓటుకు నోటు కోసం రోడ్డెక్కడమా?

  • ఎన్నికలంటే.. డబ్బు పంచుడేనా?

హుజూరాబాద్​ ఉప ఎన్నిక సందర్భంగా డాక్టర్​ బీఆర్ అంబేద్కర్ కల్పించిన ఓటు హక్కును అవమానించేలా టీఆర్ఎస్ వ్యవహరిస్తోంది. ఓటు వేయడం అనేది మన హక్కు దీనిని సద్వినియోగం చేసుకోవాలి. మందు, మటన్, డబ్బుకు లొంగిపోయి ప్రజలు ఓటు వేస్తే ఇక వారికి ప్రశ్నించే హక్కు ఉంటుందా! పోలీసులు, ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వానికి తొత్తులుగా మారిపోయారు. ఇది ముమ్మాటికీ ఆందోళన కలిగించే విషయం. ఇవి హుజూరాబాద్ కే పరిమితమైన ఎన్నికలు కావు. రాష్ట్ర ప్రజల భవిష్యత్ కు సంబంధించిన ఎన్నికలివి. ఇప్పటికైనా ప్రజలు కళ్లు తెరిచి ప్రశ్నించే తమ హక్కును కోల్పోవడం మానేయాలి. ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవాలి.

ఎమ్మెల్యేగా ఆరుసార్లు గెలిచిన ఈటల రాజేందర్​ను అహంకారపూరితంగా కేబినెట్​ నుంచి బర్తరఫ్ చేయడంతో హుజూరాబాద్​ ఉప ఎన్నిక వచ్చింది. ఈటల ఆత్మగౌరవం దెబ్బతినడంతో ఏ పార్టీ అయితే తనను బర్తరఫ్ చేసిందో ఆ పార్టీకి రాజీనామా చేసి మళ్లీ ఎన్నికకు వచ్చారు. దేశ రాజకీయాల్లోనే హుజూరాబాద్ ఉప ఎన్నిక చరిత్ర లిఖించబోతోంది. ఇది అత్యంత కఠినమైన ఉప ఎన్నికకు సంకేతం. చివరకు అధికార పార్టీ ఇంత పెద్ద ఎత్తున ఓటర్లకు డబ్బు పంపిణీ చేయడం.. అది కూడా కేవలం మూడు గంటల్లోనే దాదాపు 150 కోట్ల డబ్బు పంపిణీ చేశారని వార్తలు రావడం దేనికి సంకేతం. ఇంత డబ్బు ఎక్కడిది. పెట్టుబడిదారులే రాజకీయాలను శాసించడం, ఇవాళ పెట్టిన పెట్టుబడి రేపు రెట్టింపు చేసుకోవడం కోసమే ఇటువంటి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఇది ప్రజాస్వామ్యమా? ధనస్వామ్యమా?.
ఓటుకు నోటు కోసం రోడ్డెక్కడమా?
హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఓటుకు నోట్ల కోసం నిరసనల హోరు నడుస్తున్నది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తరఫున ఓటుకు రూ.6 వేల చొప్పున లిపాపల్లో పెట్టి పంచారని, ఆ డబ్బు అందనివారు ఆగ్రహం వ్యక్తం చేశారనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. టీఆర్ఎస్ పార్టీ తరఫున డబ్బుల పంపిణీ తీరుపై బుధవారం రాత్రి హుజూరాబాద్ మండలం రంగాపూర్ లో మొదలైన ఆందోళనలు గురువారం ఉదయం ఇతర గ్రామాలు, మండలాలకు వ్యాపించింది. హుజూరాబాద్ మండలంలో ఇప్పల నర్సింగాపూర్, కాట్రపల్లి, రంగాపూర్, పెద్ద పాపయ్యపల్లి, కందుగుల గ్రామాల్లో ప్రజలు రోడ్డెక్కి నిరసన తెలిపారు. పెద్దపాపయ్యపల్లిలో గ్రామ పంచాయతీ ఆఫీస్​ ఎదుట ఆందోళనకు దిగారు. వీణవంక మండలం గంగారంలో, ఇల్లందకుంట మండలం బూజునూరులోనూ ప్రజలు నిరసనలకు దిగారు. కమలాపూర్ మండల కేంద్రంలోని 8, 9, 10 వార్డులకు చెందిన మహిళలు తమకు టీఆర్ఎస్ పార్టీ రూ.6 వేలు రాలేదంటూ రోడ్డెక్కి ఆందోళన చేశారు. గ్రామ పంచాయతీల ఎదుట, రోడ్ల మీద నిరసనలకు దిగారు. తమకు పైసలు ఎందుకివ్వలేదని స్థానిక లీడర్లను నిలదీశారు. పైసలు ఇచ్చేదాకా విడిచిపెట్టేది లేదని ఆందోళనలకు దిగారు. తమకు పంచాలని ఇచ్చిన డబ్బులను లీడర్లు, సర్పంచ్​లు కాజేశారని ఆరోపించారు. “మేము ఓట్లేయ్యనిదే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందా? లిస్టులో పేర్లు ఉన్నా లీడర్లు ఎందుకు పంచుతలేరు”అని ప్రశ్నించారు. డబ్బుల కోసం ఓటర్లు ఆందోళనలకు దిగిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. మరోవైపు నియోజకవర్గంలో గురువారం కూడా డబ్బుల పంపిణీ కొనసాగింది. 
రాజకీయాన్ని వ్యాపారంగా మార్చిన్రు
దేశంలోని రాజకీయ పార్టీలు, మేధావులు, విద్యావేత్తలు, మీడియాకు విజప్తి. 75 ఏండ్ల భారత చరిత్రలో ఏ నియోజకవర్గంలోనూ వేల కోట్లు ఖర్చు చేసిన దాఖలాల్లేవు. కోట్ల కొద్దీ మందు తాగించలేదు. ఈ స్థాయిలో ఎక్కడా బెదిరింపులకు, ప్రలోభాలకు పాల్పడలేదు. ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బుతో కట్టిన పన్నులే ప్రభుత్వాలకు ఆదాయం. ప్రభుత్వం ప్రజల ప్రమేయం లేకుండా అప్రజాస్వామికంగా, ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని, సంక్షేమ పథకాల పేరు మీద అయినవారికి, కాని వారికి పప్పు బెల్లాల మాదిరిగా ప్రజాధనాన్ని ఓట్ల కొరకు పంచే అధికారం ఎవరిచ్చారు. దశాబ్దాల తరబడి విస్మరించబడ్డ వర్గాలు, వెనకకు నెట్టేయబడ్డ వర్గాలు, కనీసం విద్య, వైద్యానికి నోచుకోకుండా అల్లాడుతున్న అణగారిన వర్గాలను కాదని ఓట్ల వెంపర్లాటలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం ఎంత వరకు సబబు. మనుషులను మానవత్వంతో చూడకుండా ఓటుగానే చూడడం భావ్యమా. వృద్ధులు, వితంతువులు, వికలాంగులను పెన్షనర్లుగానే పరిగణించాలా? వాళ్ళలో దాగి ఉన్న తెలివితేటలను, మేధస్సును సానపెట్టే అవకాశాలు కల్పించి, పోటీ ప్రపంచంలో ధీటైన మానవ వనరులుగా మార్చకుండా పెన్షన్లతో చేతులు దులుపుకోవడమే రాజకీయమా? విలువలతో కూడుకున్న రాజకీయాలకు స్వస్తి పలికి పెట్టుబడిదారులకు పెద్దపీట వేసి, అంకెల గారడీతో అధికారం హస్తగతం చేసుకుని రాజకీయాన్ని వ్యాపారంగా మార్చడమే ప్రజాస్వామ్యమా?
సేవాభావం కనుమరుగైంది
హుజూరాబాద్ రాజకీయాలు- తెలంగాణ అంతటికీ వ్యాప్తి చెందితే ప్రజాస్వామ్యం బతికి బట్టకడుతుందా! ధనస్వామ్యం రాజ్యమేలుతూ రాజకీయాల్లో సేవా భావన కనుమరుగై వ్యాపారమే ధ్యేయంగా పెట్టుబడి రాజకీయాలకు నాంది పలుకుదామా! ప్రజలను అవినీతిపరులను చేస్తే కంచే చేను మేసినట్లుగా అవుతుంది. ప్రచారానికి డబ్బులు, ఓటుకు డబ్బులు, కుల సంఘాలకు డబ్బులు, మహిళా సంఘాలకు, యువజన సంఘాలకు టీచర్లకు, ఇతర పార్టీల లీడర్లకు, కార్యకర్తలకు చివరకు సొంత పార్టీ నాయకులకు, కార్యకర్తలకు డబ్బులు, డబ్బులేని ఎన్నికలు ఎండమావియేనా. నీతి, నిజాయితీ, సేవే లక్ష్యంతో ముడిపడిన పార్టీ సిద్ధాంతాలు, సంస్థాగత నిర్మాణాలు, ఆదర్శాలు అన్నీ ఎన్నికల సమయంలో కనుమరుగేనా? తెలంగాణలో టీఆర్ఎస్ లీడర్లు ఏం సాధించాలని అనుకుంటున్నారు. రాష్ట్రాన్ని, ప్రజలను ఎటువైపు తీసుకెళ్తున్నారు. సభ్య సమాజం హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఏరులై పారుతున్న మద్యం, తూలి తూగుతున్న ప్రజలను చూసి ఇంటింటికి ఓట్ల కోసం నోట్ల కట్టలను చూసి సిగ్గుతో తల వంచుకుంటున్నది.

ప్రజాస్వామిక ఉద్యమానికి సిద్ధం కావాలె
ఇప్పటికైనా మరో ప్రజాస్వామిక ఉద్యమానికి రాష్ట్ర ప్రజలు సమాయత్తం కావాలి. ఇందుకు హుజూరాబాద్ ప్రజలే న్యాయనిర్ణేతలుగా మారాలి. నోట్ల కట్టలను మరిచి, ఓటు ఆయుధానికి సానపెట్టి ఓటుకు ఉన్న విలువను, శక్తిని చాటి చరిత్రాత్మకమైన తీర్పునివ్వాలి. హుజూరాబాద్ ప్రజలు ఆత్మగౌరవాన్ని చాటాలి. తెలంగాణ జాతి ఆకలితో అలమటిస్తుంది.. అవసరమైతే పస్తులుంటుంది.. చావునైనా కోరుకుంటాం తప్పితే ఆత్మగౌరవాన్ని అమ్ముకోమని చాటి చెప్పే సమయం వచ్చింది. 30 అక్టోబర్ 2021 చరిత్రలో నిలిచిపోవాలి. ప్రజాస్వామ్యం గెలవాలి-. ధనస్వామ్యం ఓటమి పాలవ్వాలి. సేవా రాజకీయాలు కొనసాగాలి. -పెట్టుబడి రాజకీయాలకు స్వస్తి పలకాలి. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రసాదించిన ఓటుకు.. కులం, మతం, ప్రాంతం, భాషా, ధనిక, పేద వ్యత్యాసం లేకుండా ఒకటే విలువ. అందుకే ఓటు విలువను కాపాడండి. ఓటు బజారులో అమ్ముడుపోయే సరుకు కాదని నిరూపించండి. డా.కె.లక్ష్మణ్,బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు.