- సిరిసిల్ల వాణిజ్య ప్రాంతంలో ఇరుకు రోడ్లతో ట్రాఫిక్ కష్టాలు
- భారీ, సరుకు వాహనాలే ట్రాఫిక్‌కు కారణం
- రద్దీకి అనుగుణంగా రోడ్ల విస్తరణ చేపట్టని అధికారులు
- షాపుల ముందే వాహనాల పార్కింగ్‌తో తీవ్ర ఇబ్బందులు
రాజన్నసిరిసిల్ల ,వెలుగు: సిరిసిల్లలోని వాణిజ్య ప్రాంతం పెద్దబజార్ ట్రాఫిక్‌తో బేజారవుతోంది. ఇరుకు రహదారులతో ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ ప్రాంతంలోకి వెళ్లాలంటే వాహనదారులు భయపడాల్సిన పరిస్థితి. పెద్ద బజార్ వాణిజ్య ప్రాంతం కావడంతో లారీలు, వ్యాన్ల వంటి భారీ వాహనాల రాకపోకలు ఎక్కువగానే ఉంటాయి.
సరుకుల అన్ లోడింగ్, లోడింగ్ కోసం వచ్చే వాహనాలతో ట్రాఫిక్ కష్టాలు పెరుగుతున్నాయి. దీంతోపాటు షాపింగ్‌ల కోసం వచ్చేవారి వాహనాలు షాపుల ముందే నిలుపుతుండడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోంది. నానాటికీ జిల్లాకేంద్రంలో జనాభాతోపాటు వాహనాల రద్దీ పెరుగుతోంది. దీనికనుగణంగా రోడ్ల విస్తరణ చేపట్టకపోవడం వల్లే ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది.
వాహనాలు పెరిగినా.. రోడ్ల విస్తరణ లేకపాయె
సిరిసిల్ల పట్టణంలో చాలా ఏళ్లుగా పెద్దబజార్‌లో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. టౌన్‌లో పాపులేషన్‌తోపాటు వాహనాల సంఖ్య కూడా పెరుగుతోంది. కానీ రోడ్ల విస్తరణ చేపట్టకపోవడంతో రోజురోజుకీ సమస్య పెరుగుతోంది. టౌన్ ప్లానింగ్‌పై మున్సిపల్ పాలకులు, అధికారులు పట్టించుకోకపోవడం వల్లే సమస్య పరిష్కారం దొరకడం లేదని పట్టణ వాసులు వాపోతున్నారు. ట్రాఫిక్ సమస్యపై ఆఫీసర్లకు ఫిర్యాదు చేసినా.. తాత్కాలికంగా బారికేడ్లు ఏర్పాటు చేసి ఆ తర్వాత పట్టించుకోవడం లేదంటున్నారు.
Also Read : ఉమ్మడి మెదక్ జిల్లాలో మూడు ఎకో టూరిజం స్పాట్స్
రోడ్డు విస్తరణ చేపడితేనే సమస్యకు పరిష్కారం
పెద్ద బజార్‌లో ట్రాఫిక్ నియంత్రణకు రోడ్డు విస్తరణే పరిష్కారం. మున్సిపల్ ఎన్నికలకు ముందు రోడ్డు విస్తరణ చేపడతామని నాటి లీడర్లు, అభ్యర్థులు హామీలిచ్చి మరిచిపోయారు. గతేడాది మున్సిపల్ఆఫీసర్లు దుకాణాల్లో మార్కింగ్ చేశారు. ఆ తర్వాత ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. ఈ ప్రాంతంలోని బడా వ్యాపారులకు నష్టం జరగకూడదనే రోడ్డు విస్తరణ పనులు చేపట్టడడం లేదని విమర్శలున్నాయి. సిరిసిల్లలోని పెద్దబజార్‌తోపాటు గాంధీచౌక్‌లో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది.
ఇక్కడ మార్కెట్‌తోపాటు పెద్ద దుకాణాల సముదాయం ఉండడం, నాలుగు రోడ్ల జంక్షన్ కావడంతో ట్రాఫిక్ సమస్య పెరుగుతూనే ఉంది. దీంతో పెద్ద బజార్ నుంచి గాంధీచౌక్ వరకు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. దీనికి తోడు ట్రాఫిక్ నియంత్రణకు మున్సిపాలిటీ, ట్రాఫిక్పోలీసులు చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి.