- కామారెడ్డి జిల్లాలోని 12 మండలాల్లో అత్యంత పోషకాహార లోపం ఉన్న పిల్లలు
- చిన్నారులు, నవజాత శిశువుల్లో పోషకాహార లోప నివారణే లక్ష్యంగా వీవోఏలకు శిక్షణ
- వచ్చే నెల నుంచి ఇంటింటికీ వెళ్లి పరిశీలన
కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లాలో నవజాత శిశువులు, చిన్న పిల్లల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ప్రోగ్రాం అమలు చేయనున్నారు. రాష్ట్రంలో 25 మండలాల్లో అత్యంత పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులు, నవజాత శిశువుల్లో పోషకాహార లోపం లేకుండా చేయడమే లక్ష్యంగా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా అవేర్‌నెస్ ప్రోగ్రాం చేపట్టనున్నారు. దీని కోసం ప్రభుత్వం మండల స్థాయిలో వీవోఏ ( విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్) లకు శిక్షణ ఇస్తున్నారు.
12 మండలాలు కామారెడ్డి జిల్లాలోనే
రాష్ర్టంలో కామారెడ్డి జిల్లాలో 12 మండలాలు, జోగులాంబ గద్వాల జిల్లాలో 6, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 7 మండలాల్లో అత్యంత పోషక లోపాలతో బాధపడుతున్న చిన్నారులు అధిక సంఖ్యలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ సమస్యను అధిగమించి చిన్నారులు ఆరోగ్యవంతంగా ఉండేలా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా ఆయా గ్రామాల్లో యూనిసెఫ్ సహకారంతో కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ ప్రోగ్రాం అమలు చేస్తారు.
ఇప్పటికే అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు, గర్భిణులకు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారాన్ని అందిస్తున్నారు. రెగ్యులర్ ఆహారంతో పాటు బాలామృతం ఫ్లస్ ఆహారాన్ని ప్రత్యేకంగా ఇస్తారు. రాష్ర్ట స్థాయిలో శిక్షణ పొందిన డీపీఎంలు ప్రస్తుతం ఆయా జిల్లాల్లో ఎంపిక చేసిన మండలాల్లో వీవోఏలకు శిక్షణ ఇస్తున్నారు.
కామారెడ్డి జిల్లాలోని మద్నూర్, జుక్కల్, పెద్దకొడప్గల్, లింగంపేట, గాంధారి, మాచారెడ్డి, రాజంపేట, పిట్లం, నిజాంసాగర్, నస్రుల్లాబాద్, సదాశివనగర్, నాగిరెడ్డిపేట మండలాల్లో ప్రత్యేక కార్యక్రమం అమలుకానుంది.
మండల స్థాయిలో శిక్షణ పొందిన వీవోఏలు గ్రామాల్లోని అంగన్వాడీ కార్యకర్తలు, ఆశ కార్యకర్తల సహకారంతో మెంటర్లను గుర్తిస్తారు. గ్రామంలో 2 ఏండ్ల లోపు చిన్న పిల్లలున్న మూడు లేదా నాలుగు ఫ్యామిలీలను గుర్తిస్తారు. ఆయా పేరేంట్స్ పిల్లలకు ఎలాంటి ఆహారం ఇస్తున్నారు.. పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారా?.. పోషక లోపాలతో బాధపడుతుంటే ఎందుకు ఇలా అయ్యారనే దానిపై మిగతా వారికి అవేర్ నెస్ కలిగిస్తారు. గర్భవతి, బాలింతతో పాటు, చిన్నారికి ఎలాంటి ఆహారం ఇవ్వాలి అనే దానిపై చెబుతారు.
గర్భవతిగా ఉన్నప్పుడు 9 నెలలు ( 270 రోజులు), బిడ్డకు 2 ఏండ్లు వచ్చేవరకు 730 రోజులు మొత్తం వెయ్యి రోజుల కార్యాచరణ ఉంటుంది. బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు తల్లి సరైన ఆహారం తీసుకోవడం, తర్వాత 2 ఏండ్ల వరకు పోషకాలతో కూడిన ఆహారం అందించడం ద్వారా చిన్నారుల్లో పోషక లోపాలను నివారించవచ్చనేది ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. మండల స్థాయిలో వీవోఏలకు శిక్షణ కంప్లీట్ అయిన తర్వాత వచ్చే నెలలో ఆయా గ్రామాల్లో ప్రారంభం కానుంది.
కామారెడ్డి జిల్లాలో 5 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 1193 అంగన్ వాడీ సెంటర్లు ఉన్నాయి. వీటిలో 6 నెలల నుంచి 5 ఏండ్ల లోపు ఉన్న చిన్నారుల్లో 1,461 మంది చిన్నారులు అత్యంత పోషకాహార లోపంతో ఉన్నారు. వీరిలో సరైన ఎదుగుదల లేదు. బాలామృతం ఫ్లస్ ప్రత్యేక ఆహారం ఇచ్చి వీరిని ఆరోగ్య వంతులుగా చేయాలని సంకల్పించారు.