వీడు మామూలోడు కాదు.. రూ.150 కోట్ల సర్కారు భూమిని..ఓఎల్ఎక్స్​లో ప్లాట్లుగా విక్రయిస్తున్నడు

వీడు మామూలోడు కాదు.. రూ.150 కోట్ల సర్కారు భూమిని..ఓఎల్ఎక్స్​లో ప్లాట్లుగా విక్రయిస్తున్నడు
  •      కబ్జా చెర నుంచి 16 ఎకరాలను రక్షించాలని బీజేపీ ఫిర్యాదు

జీడిమెట్ల, వెలుగు: కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఓఎల్ఎక్స్​లో విక్రయిస్తున్న వ్యక్తిపై క్రిమినల్​కేసులు నమోదు చేయాలని స్థానిక బీజేపీ నాయకులు గురువారం కుత్బుల్లాపూర్​తహసీల్దార్ కు ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. గాజులరామారం సర్వే నంబర్ 307లోని 16 ఎకరాల ప్రభుత్వ భూమిని గతంలో మైనింగ్​కోసం లీజుకు ఇచ్చారని, అయితే సదరు భూమిని ఓ ప్రజాప్రతినిధి అనుచరుడు ఆక్రమించాడని ఆరోపించారు. 

దాదాపు రూ.150 కోట్ల విలువ చేసే 16 ఎకరాలను ఆక్రమించి 477 ప్లాట్లుగా మార్చాడని, వాటిని ఓఎల్ఎక్స్​లో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడని చెప్పారు. ఇప్పటికే రూ.కోట్లు గడించాడని చెప్పారు. ప్రభుత్వ స్థలాన్ని మట్టితో నింపి ఆక్రమిస్తున్న, ప్లాట్లుగా విక్రయిస్తున్న వ్యక్తిపై క్రిమినల్​ కేసులు నమోదు చేసి,  భూమిని రక్షించాలని కోరారు. ఫిర్యాదు చేసిన వారిలో బీజేపీ నేతలు ఆకుల సతీశ్, శ్రీనివాస్​గౌడ్, అరుణ్​రావు, చందు, బలరాం తదితరులు ఉన్నారు.