ఆర్డీఎస్ పూర్తి చేసి..వాటా నీళ్లు వచ్చేలా చూడండి 

  • తుంగభద్ర నది బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

హైదరాబాద్: తుంగభద్ర నది యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్) ప్రాజెక్టు ఆధునీకరణ పనులు వెంటనే పూర్తి చేసి.. మా వాటా నీరు పూర్తిగా అందేలా చూడాలని ప్రభుత్వం తరపున తెలంగాణ ఇరిగేషన్ శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్ మురళీధర్ లేఖ రాశారు. బళ్లారి జిల్లా హోస్పేట సమీపంలోని తుంగభద్ర డ్యాం నుండి నీటి విడుదల కోసం ఆంధ్రప్రదేశ్ రాసిన లేఖ గురించి కూడా ఈఎన్సీ మురళీధర్ తన లేఖలో ప్రస్తావించారు. 
తుంగభద్ర నది నికర జలాల కేటాయింపుల్లో ఆర్డీఎస్‌కి 15.9 టీఎంసీల నీరు రావాల్సి ఉండగా.. కేవలం 5, 6 టీఎంసీలు మాత్రమే అందుతున్నాయని ఈఎన్సీ మురళీధర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం శ్రీశైలం నుంచి కృష్ణా జలాలతోపాటు తుంగభద్ర నీటి నుంచి కూడానీటిని యథేచ్ఛగా తరలిస్తోందని ఆయన ఆరోపించారు. గతంలోనే ఆంధ్రప్రదేశ్‌కు 2 టీఎంసీల నీటిని విడుదల చేస్తే.. ఏపీ ప్రభుత్వం మరోసారి కేసీ కెనాల్‌ కోటా 2 టీఎంసీల నీటిని హెచ్‌ఎల్‌సీకి విడుదల చేయాలని కోరిందని ఫిర్యాదు చేశారు. ఏపీ ప్రభుత్వం డిమాండ్ కృష్ణానది నీటి వివాదం ట్రైబ్యునల్-1 అవార్డుకు విరుద్ధమైన డిమాండ్‌ అని ఆయన ఆరోపించారు. ఏపీ కోరిందని నీటిని విడుదల చేస్తే ఇప్పటికే నీటి లభ్యత తక్కువగా ఉన్న ఆర్డీఎస్ ఆయకట్టుకు మరింత అన్యాయం జరుగుతుందని తెలంగాణ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్ సి. మురళీధర్ ఫిర్యాదు చేశారు.