- మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన 10 మంది
కిన్షాసా: కాంగోలో భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మంగళవారం సెంట్రల్ కాంగోలో వరదల కారణంగా దాదాపుగా 22 మంది మృతి చెందారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన వారు 10 మంది ఉన్నారు. వరద తాకిడికి గోడ కూలిపోవడంతో వీరు మరణించారు. కసాయి సెంట్రల్ ప్రావిన్స్‌లోని కనంగా జిల్లాలో వరద ప్రభావం ఎక్కువగా పడింది. ఇళ్లు, చర్చిలు కూలడం, రోడ్లు ధ్వంసం కావడంతో భారీ ఎత్తున ఆస్తి నష్టం సంభవించింది. పలువురు గల్లంతయ్యారు. వెంటనే స్పందించిన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. భారీ వర్షాలతో కాంగోలోని మారుమూల ప్రాంతాల్లో తరచూ వరదలు సంభవిస్తున్నాయి. మేలో తూర్పు కాంగోలోని సౌత్ కివు ప్రావిన్స్ లో కుండపోత వర్షం కురవడంతో కొండ విరిచయలు విరిగిపడి 400 మంది మరణించారు.