- కాంగ్రెస్ నుంచి షబ్బీర్ అలీ
- గెలుపొటములపై కామారెడ్డి మాస్టర్ ఫ్లాన్ ఉద్యమం ఎఫెక్ట్
- కేసీఆర్ పోటీ చేస్తానని ప్రకటించడంతో మారనున్న సమీకరణాలు
- దీటుగా ఎదుర్కొంటామంటున్న బీజేపీ, కాంగ్రెస్ నేతలు
కామారెడ్డి , వెలుగు : సీఎం కేసీఆర్ ఈసారి గజ్వేల్లో పాటు కామారెడ్డిలోనూ పోటీకి సిద్ధపడడంతో ఇప్పుడు అందరి దృష్టి కామారెడ్డిపై పడింది. కేసీఆర్కు దీటుగా నిలబడేందుకు కాంగ్రెస్, బీజేపీ పార్టీల ప్యూహాలను పదును పెడుతున్నాయి. కేసీఆర్ కు గట్టి పోటీ ఇచ్చేందుకు రెండు పార్టీల హైకమాండ్ కామారెడ్డి మీద స్పెషల్ ఫోకస్ పెడుతున్నాయి.. కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో బీఆర్ఎస్ వర్గాలతో పాటు ప్రతిపక్ష పార్టీల్లో చర్చనీయాంశంగా మారింది.
ఒక్కసారిగా రాష్ట్రంలో అందరి చూపు ఇప్పుడు కామారెడ్డిపై పడింది. సీఎం కేసీఆర్ కు దీటుగా పోటీ ఇస్తామని కాంగ్రెస్, బీజేపీ నాయకులు చెబుతున్నారు. ఈ రెండు పార్టీల నుంచి బలమైన క్యాండిడేట్లను పోటీలో నిలపాలని పార్టీ ముఖ్య నేతలు సమాలోచనలు చేస్తున్నారు. కేసీఆర్ పోటీతో రాజకీయంగా కొన్ని సమీకరణాలు మారే అవకాశముంది.
కాంగ్రెస్‌కు ఓటు బ్యాంకు బలం
కామారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి బలమైన ఓటు బ్యాంక్ ఉంది. గతంలో జరిగిన పలు ఎన్నికల్లో వరుసగా మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్నేత షబ్బీర్అలీ కామారెడ్డి నుంచి పోటీ చేస్తూ వస్తున్నారు. గతంలో షబ్బీర్ మంత్రిగా కూడా పని చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మరో సారి బరిలో దిగనున్నారు. నియోజక వర్గంలో ఇప్పటికే విస్తృతంగా పర్యటిస్తున్నారు. పలు ప్రోగ్రాంలు చేపట్టారు. కేసీఆర్ పోటీ చేయనున్నట్లు కొద్ది రోజుల క్రితం నుంచే ప్రచారం జరిగిన సందర్భంలోనూ షబ్బీర్అలీ స్పందించారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి తాను పోటీ చేసి కేసీఆర్‌ను ఎదుర్కొంటానని ప్రకటించారు. పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్అలీ హైదరాబాద్లో స్పందించారు. తమ పార్టీ నుంచి షబ్బీర్అలీ పోటీలో ఉండి కేసీఆర్‌ను ఓడిస్తారని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇతర లీడర్లు కామారెడ్డిలో టికెట్ ఆశించకపొవటం, షబ్బీర్అలీ ఒకరే టికెట్ ఆశిస్తున్న దృష్ట్యా ఈయనకే ఇక్కడి నుంచి టికెట్ కన్ఫార్మ్ కానుంది. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి పై మరింత ఎక్కువగా ఫోకస్ పెట్టేందుకు ముఖ్య నేతలు సమాలోచనలు చేస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
బీజేపీ దూకుడు
కామారెడ్డి సీటుపై బీజేపీ కొన్నాళ్లుగా దృష్టి పెట్టింది. ఈ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తూ మాజీ జడ్పీ చైర్మన్ కాటిపల్లి వెంకటరమణరెడ్డి అనేక ప్రోగ్రాంలు చేపట్టారు. మాస్టర్ ఫ్లాన్కు వ్యతిరేకంగా రైతులతో చేపట్టిన ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇక్కడ చేపట్టిన ఉద్యమం మాస్టర్ ఫ్లాన్లకు వ్యతిరేకంగా రాష్ర్ట వ్యాప్తంగా మార్గం చూపింది. ప్రభుత్వం దిగి వచ్చి మాస్టర్ ఫ్లాన్ పక్రియను పక్కన పెట్టింది. డ్వాక్రా సంఘాలకు పావల వడ్డీ బకాయిల కోసం కూడా మహిళలతో ఉద్యమం చేపట్టారు.
పలు అంశాలపై బీజేపీ ఇక్కడ ఆందోళనలు చేపట్టింది. ఆ పార్టీ తరఫున చేపట్టిన ఉద్యమాలకు మంచి స్పందన రావటంతో పార్టీ ముఖ్య నేతలు కామారెడ్డిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ కచ్చితంగా గెలిచి తీరాలని ఆ పార్టీ ముఖ్య నేతలు భావిస్తున్నారు. బీఆర్ఎస్ తరపున కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేస్తానని ప్రకటించిన తర్వాత బీజేపీ ముఖ్య నేతలు స్పందించారు.
ఎవరు పోటీ చేసిన తమ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి నుంచి కాటిపల్లి వెంకటరమణరెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న తరుణంలో తమ పార్టీ తరఫున వెంకటరమణరెడ్డి బరిలో ఉంటారా? లేక ఎవరైనా బడా నేతకు టికెట్ఇస్తారా అన్న చర్చ నడుస్తోంది.