బీఆర్​ఎస్​ కన్నా మేం స్ట్రాంగ్ .. మాకు వాళ్లతో పోలికే లేదు: ఖర్గే

బీఆర్​ఎస్​ కన్నా మేం స్ట్రాంగ్ .. మాకు వాళ్లతో పోలికే లేదు: ఖర్గే
  • పార్టీ పుట్టినప్పటి నుంచిరాష్ట్రంలో మూలాలున్నయ్​
  • బీఆర్​ఎస్​ వాళ్లది డబ్బు బలమే
  • మా పార్టీలో తప్పు జరిగితే ప్రశ్నించే హక్కుంది.. బీఆర్​ఎస్​లో ఎవరైనా గొంతెత్తే అవకాశం ఉందా అని ప్రశ్న
  • ఇండియా టుడే కాన్​క్లేవ్​లో పాల్గొన్న ఏఐసీసీ చీఫ్​

హైదరాబాద్​, వెలుగు :  బీఆర్​ఎస్​, కాంగ్రెస్ మధ్య పోలికే లేదని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. కాంగ్రెస్​ పార్టీ ప్రజల కోసం పోరాడుతున్నదని, బీఆర్​ఎస్​ పార్టీ కేవలం తన కుటుంబం బాగు కోసమే పోరాడుతున్నదని పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్​లో నిర్వహించిన ఇండియా టుడే కాన్​క్లేవ్​లో ఆయన పాల్గొన్నారు. బీఆర్​ఎస్​ లీడర్ల కన్నా కాంగ్రెస్​ లీడర్లు చాలా దృఢమైనవాళ్లని చెప్పారు. ప్రజలు తమ జీవనం కోసం పోరాడాల్సిన పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయన్నారు.

అసలు బీఆర్​ఎస్​ చరిత్రేందో తెలుసుకోవాలన్నారు.  కానీ, కాంగ్రెస్​కు రాష్ట్రంలో ఎప్పటి నుంచో మూలాలున్నాయన్నారు. పార్టీని స్థాపించినప్పటి నుంచి తెలంగాణలో ఉనికిలోనే ఉన్నదన్నారు. పార్టీ కార్యకర్తలు, నేతలు ఎంతో కష్టపడి పార్టీని నిలబెట్టారన్నారు. బీఆర్​ఎస్​ది డబ్బు బలమేనన్నారు. 

బీఆర్​ఎస్​ దగ్గర డబ్బు ఉండొచ్చు గానీ.. తమ దగ్గర మాత్రం జనం ఉన్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్​ ఎంత విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెడుతున్నారో అందరికీ తెలుసని చెప్పారు. కానీ, తమతో పోలిస్తే వాళ్ల దగ్గర ఎక్కువ డబ్బులుండవచ్చన్నారు. వారితో తమకు పోలికే లేదన్నారు. తమ పార్టీలో ఏదైనా తప్పు జరిగితే ప్రశ్నించే హక్కు ఉంటుందని, ఆ పార్టీలో అలాంటి స్వేచ్ఛ ఉందా అని ప్రశ్నించారు. వాళ్లంతా కుటుంబం, స్వార్థం కోసం పాటు పడే వ్యక్తులని విమర్శించారు.

తమ పార్టీ తెలంగాణలో ఏమీ పోలేదని, పార్టీ కోసం ఎప్పుడూ ఏదో ఒక చోట కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయన్నారు. తెలంగాణలో పార్టీ అధికారంలోకి వస్తే సీఎం ఎంపిక.. పద్ధతి ప్రకారం ఉంటుందన్నారు. మెజారిటీ వస్తే ఎమ్మెల్యేలందరితో చర్చలు జరిపి... హైకమాండ్​ సీఎంను నిర్ణయిస్తుందని, న్యాయంగానే సీఎం ఎంపిక ఉంటుందని స్పష్టం చేశారు.