లోక్​సభ ఎన్నికల ఫలితాలపై .. కాంగ్రెస్ కమిటీ పోస్టుమార్టం పూర్తి

  • లోక్​సభ ఎన్నికల ఫలితాలపై .. కాంగ్రెస్ కమిటీ పోస్టుమార్టం పూర్తి

హైదరాబాద్, వెలుగు:  లోక్​సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్​కు ఆశించినన్ని సీట్లు రాకపోవడానికి గల కారణాలు ఏమిటనే దానిపై ఏఐసీసీ నియమించిన త్రీమెన్ కమిటీ పోస్టుమార్టం శుక్రవారం నాటితో ముగిసింది. 3 రోజుల పాటు ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ రాష్ట్రంలోని వివిధ స్థాయి నేతల అభిప్రాయాలను తెలుసుకుంటుందని భావించినా.. రెండు రోజుల్లోనే అభిప్రాయ సేకరణ ను పూర్తి చేసింది. కమిటీ చైర్మన్ పీజే కురియన్ సభ్యులు పర్గత్ సింగ్, రక్బుల్ హుస్సేన్ బుధవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు గాంధీ భవన్ లో మొత్తం 16 మంది (ఓడిన, గెలిచిన) లోక్​సభ అభ్యర్థుల అభిప్రాయాలను తెలుసుకుంది. అదే రోజు రాత్రి సీఎం, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితోనూ భేటీ అయింది. శుక్రవారం కూడా గాంధీ భవన్​లోనే ఈ కమిటీ పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్​చార్జ్​ల అభిప్రాయాలను తీసుకుంది. చివరి రోజున కురియన్ లేకుండానే ఈ సేకరణ జరిగింది. ఆయన కుటుంబ సభ్యుల్లో ఒకరు ఆకస్మికంగా మృతిచెందడంతో శుక్రవారం ఉదయమే కేరళకు బయలుదేరారు. దీంతో కమిటీ సభ్యులైన పర్గత్ సింగ్, రక్బుల్ హుస్సేన్ పలువురితో భేటీ అయి పార్టీ ఓటమికి గల కారణాలను తెలుసుకున్నారు. ఈ నెల 21 ఏఐసీసీకి దీనిపై సమగ్రమైన రిపోర్టును అందజేస్తామని కమిటీ సభ్యుడు రక్బుల్ హుస్సేన్ చెప్పారు. 

ఓడినచోట అలా.. గెలిచిన చోట ఇలా.. 

చివరిరోజు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పద్మావతి, మల్ రెడ్డి రంగారెడ్డి, మనోహర్ రెడ్డి, సంజీవరెడ్డి, శ్రీ గణేష్, ఖైరతాబాద్ అసెంబ్లీ ఇన్​చార్జ్​ విజయారెడ్డి కమిటీకి తమ అభిప్రాయాలు తెలిపారు. కమిటీని కలవని మంత్రు లు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు రాతపూర్వకంగా తమ అభిప్రాయాలు పంపుతామని చెప్పినట్లు గాంధీ భవన్ వర్గాలు తెలిపాయి. అయితే, చాలా మంది నేతలు బీఆర్ఎస్.. బీజేపీ కుమ్మ క్కవడంతోనే ఓడిపోయామని చెప్పగా, గెలిచిన నియోజకవర్గాల నేతలు మాత్రం బీఆర్ఎస్​పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు తోడు రేవంత్ సర్కార్ గ్యారంటీలను అమలు చేస్తుండడం, కాంగ్రెస్ నేతల మధ్య సమన్వయంతో సాధ్యమైందని చెప్పారు. కొందరు ఇన్​చార్జ్​లు మాత్రం పార్టీలో అంతర్గతంగా ఉన్న సమస్యలను, నేతల తీరుపై కమిటీ దృష్టికి తీసుకువచ్చినట్లు సమాచారం.  

బీఆర్ఎస్ ఓటర్లు బీజేపీకి మళ్లారు: షబ్బీర్ అలీ 

అసెంబ్లీ, లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు వచ్చిన ఓట్లలో తేడాను కమిటీ సభ్యులు అడిగారని, నిజామాబాద్​లో కాంగ్రెస్ ఓటమికి కారణాలను వివరించానని షబ్బీర్ అలీ మీడియాతో చెప్పారు. బీఆర్ఎస్ ఓటర్లు బీజేపీ వైపు మళ్లారని చెప్పానన్నారు. కాగా, కాంగ్రెస్​ లోకి బీఆర్ఎస్ నేతల చేరికలపై గులాబీ నేతల విమర్శలపై షబ్బీర్ అలీ తీవ్రంగా స్పందించారు. తలసానితో రాజీనామా చేయించకుండా మంత్రిని చేసిందెవరని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీ లను బీఆర్ఎస్​లో చేర్చుకొని అటు అసెంబ్లీలో, ఇటు మండలిలో కాంగ్రెస్​ను విలీనం చేసుకోలేదా? అని గుర్తుచేశారు. ఇందులో తప్పు ఉంటే.. తన పదవికి రాజీనామా చేస్తానని.. లేకుంటే కేటీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.   కాగా, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి మాట్లాడుతూ.. త్రీమెన్ కమిటీకి బూత్​ల వారీగా రిపోర్టు ఇచ్చానని తెలిపారు. తన సెగ్మెంట్​లో బీఆర్ఎస్ పై వ్యతిరేకత వల్లే కాంగ్రెస్ కు భారీ మెజార్టీ వచ్చిందన్నారు.   

కేసీఆర్ జైలుకు పోతే నా లక్ష్యం నెరవేర్తది: రాజగోపాల్ రెడ్డి  

భువనగిరి లోక్​సభ ఇన్​చార్జ్​గా వ్యవహరించి మంచి మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించానని త్రీమెన్ కమిటీకి చెప్పానని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలం, పార్టీ అభ్యర్థి అంతా కలిసికట్టుగా పని చేసి గెలిచామన్నారు. కాగా, బీఆర్ఎస్ పార్టీ సమాధి అయిందని, దీంతో తన లక్ష్యం ఒకటి నెరవేరిందన్నారు. కేసీఆర్​ను జైలుకు పంపాలనే మరో లక్ష్యం నెరవేరాల్సి ఉందన్నారు. హరీశ్​ రావు బీజేపీలోకి పోతాడని, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి జైలుకు వెళ్లే వ్యక్తి అని, అలాంటి వారిని తాము చేర్చుకునేది లేదన్నారు.