పతార ఉంటేనే కదా అప్పు పుట్టేది అని తన పాలనలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ తరచూ చెప్పేవారు. అప్పు పొందే అవకాశం ఉండి అప్పు తెచ్చుకోకపోతే ఆ ప్రభుత్వం సన్నాసి కిందే లెక్క. తెలంగాణ రాష్ట్రం అప్పులు ఎక్కువగా చేస్తోందంటూ ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయి. రాష్ట్ర అభివృద్ధి కోసం అప్పు తీసుకోవడంలో తప్పు లేదు.
అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశమే అప్పు తీసుకుంటున్నది అని కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు చేసిన వ్యాఖ్యలు గమనార్హం. అప్పు చేయడం ఘన కార్యం అని ఆయన భావన. పంజాబ్, రాజస్తాన్, బెంగాల్, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు ఆర్థిక సంక్షోభంలో ఉండడానికి కారణాలు వేరు. కానీ, తెలంగాణలో ఏర్పడ్డ సంక్షోభం పూర్తిగా కేసీఆర్ స్వయంకృతాపరాధంగా విశ్లేషణలు సాగుతున్నవి. అయితే, కేసీఆర్‌ను ‘దాన వీర శూర కర్ణ’గా బీఆర్ఎస్ ప్రాయోజిత మీడియా ప్రచారం చేస్తోంది.
2014లో తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి అప్పుల భారం 10 రెట్లు పెరిగింది. కేసీఆర్ పాలనలో సంక్షేమ కార్యక్రమాలు, చేసిన అభివృద్ధి కమిషన్లతో చచ్చుబండలు కావడం వల్ల ఈ పరిస్థితులు నెలకొన్నట్టు ఆర్థికరంగ నిపుణులు చెబుతున్నారు. ప్రజలపై పెనుభారాన్ని మోపుతూ అధిక వడ్డీలకు నిధులు తీసుకునే తప్పులకు మా ప్రభుత్వం పాల్పడదు.
ఆర్థిక అవరోధాలున్నప్పటికీ, ఎన్నికలకు ముందు ఇచ్చిన గ్యారంటీలను నెరవేర్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది అని ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. 2014లో ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయినప్పుడు తెలంగాణ రెవెన్యూ మిగులు రాష్ట్రం. కేసీఆర్ పాలించిన పదేండ్లలో ఏం జరిగింది? రాష్ట్ర స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తిలో బకాయి రుణాలు 35.6 శాతంగా ఉన్నాయి. ఇది 15వ ఆర్థిక సంఘం అనుమతించిన 29.7 శాతం కంటే ఎక్కువ అని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ 2022-–23 నివేదికలో తెలిపింది.
గొర్రెల పథకం, కేసీఆర్ కిట్లలో గోల్మాల్
గొర్రెల పంపిణీ, పెంపకం వంటి సంక్షేమ పథకాలు,నిరుపేద బాలింతల కోసం కేసీఆర్ కిట్‌ల వంటి వాటిల్లో జవాబుదారీతనం లోపించినట్టు 'కాగ్' వెల్లడించింది. 'కేసీఆర్ కిట్' డైరెక్ట్ బెనిఫిట్ పథకం ద్వారా యేటా రూ. 1,261.7 కోట్ల చెల్లింపులకు సంబంధించిన రికార్డులు లేవు.
గొర్రెల పెంపకం పథకంలో, లబ్ధిదారుల డేటాను నిర్వహించడంలో తీవ్రమైన లోపాలు ఉన్నాయి. గొర్రెల కాపరి కుటుంబాలకు స్థిరమైన జీవనోపాధిని అందించడానికి ఈ పథకాన్ని 2017లో ప్రవేశపెట్టారు. గొర్రెలను 'రీసైక్లింగ్' జరిగినట్టు విమర్శలున్నవి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏసీబీ, విజిలెన్స్ విచారణలో 254 కోట్ల రూపాయలు గోల్ మాల్ జరిగినట్లు కనుగొన్నారు.
అప్పులు, వడ్డీల చెల్లింపులకే ఆదాయం సరిపోదు!
తెలంగాణ అప్పులో లెక్కకు మించిన భాగం రూ. 1.2 లక్షల కోట్లు ఆఫ్- బడ్జెట్ రుణాలున్నాయి. అందులో సింహ భాగం (రూ. 66,854 కోట్లు) కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ కు చెందినవి. ఆఫ్ బడ్జెట్ రీపేమెంట్ గరిష్ట పీరియడ్ 14 సంవత్సరాలు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై చేసిన అప్పుల భారం రాబోయే 10 సంవత్సరాలలో దాదాపు రూ. 1.4 లక్షల కోట్లకు చేరనుంది.
ALSO READ : అసెంబ్లీకి వచ్చినా చాంబర్లోనే సీఎం రేవంత్ రెడ్డి
రాబోయే 10 సంవత్సరాలలో తెలంగాణ కేవలం మార్కెట్ రుణాలపై అసలు, వడ్డీ కలిపి 2.7 లక్షల కోట్ల రూపాయలను చెల్లించవలసి ఉందని 'కాగ్' చెబుతోంది. ఇతర ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న రుణాలకు సంబంధించి చెల్లించాల్సిన రూ.19,210 కోట్ల అసలు చెల్లింపు ఇందులో లేదు. ఆర్ధిక వ్యవస్థను సమర్థంగా నిర్వహించకపోవడం, రుణాలపైనే ఆధారపడడం వలన తెలంగాణకు ఈ దుస్థితి వచ్చిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
పట్టని పారదర్శకత
నీటిపారుదల, విద్యుత్ రంగాలతో పాటు, ఇతర రంగాలలోనూ సబ్సిడీలు ఇవ్వడం, పారదర్శకత లేకపోవడం, రాష్ట్ర ప్రయోజనాలను అప్పుల ఊబిలోకి నెట్టిన ఉచిత విద్యుత్, వడ్డీ రాయితీలు ఉన్నాయి. ఈ రాయితీలకు ఆర్థిక సహాయం చేయడానికి రుణాలపై ఆధారపడటం సముచిత వ్యూహం కాదన్నది విశ్లేషకుల వాదన. కీలకమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి, పెట్టుబడి కోసం అందుబాటులో ఉన్న వనరులు దెబ్బతిన్నాయి. తెలంగాణ ప్రజలను ఆంధ్రా ప్రాంతం వాళ్ళు దోపిడికి గురిచేశారని కేసీఆర్ ఉద్యమకాలంలో పదే పదే చెబుతుండేవారు. పోరాడి సాధించుకున్న రాష్ట్ర ప్రజలను అప్పుల ఊబిలోకి ఆయన నెట్టివేశారన్న విమర్శలు వస్తున్నవి.
కాళేశ్వరం ఇరిగేషన్ స్కీం ఓ ‘తెల్ల ఏనుగు’
ప్రపంచంలోనే అతి పెద్దదిగా ప్రచారం పొందిన కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ 'తెల్ల ఏనుగు' అని కాగ్ నివేదిక పేర్కొంది. ఇది ఎంత భారీ వ్యయంతో నిర్మించారో, కాంట్రాక్టర్‌లకు ఆ మేరకు భారీ లబ్ధి జరిగిందని ఆడిట్ రిపోర్టు తెలిపింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై జస్టిస్ మదన్ ఎస్.లోకూర్ న్యాయ విచారణ జరుపుతున్నారు. కేసీఆర్ ఆదేశానుసారం అనేక నిర్ణయాలు తీసుకున్నట్టు ఆయా న్యాయమూర్తుల ఎదుట హాజరైన అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ 'కాస్ట్- బెనిఫిట్ రేషియో' కూడా పెంచారు. తాజా ప్రాజెక్ట్ వ్యయం రూ. 1.5 లక్షల కోట్లు కాగా ప్రయోజనం 0.52 మాత్రమే. ఈ ప్రాజెక్టుపై వెచ్చించే ప్రతి రూపాయికి 52 పైసలు మాత్రమే తిరిగి వస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు ఏ విధంగా చూసినా లాభదాయకం కాదని స్పష్టంగా కాగ్ ఆడిట్ నివేదిక పేర్కొంది.
కొందరి సంపద అందరిదా?
తెలంగాణ ఏర్పడినప్పుడు రాష్ట్ర అప్పు 75 వేల కోట్లు మాత్రమే. కాగా, 10 ఏళ్లలో కేసీఆర్ ఒక్కొక్క మనిషిపై 95 వేల రూపాయల అప్పు చేశారని ఆర్థిక రంగ విశ్లేషకుల అభిప్రాయం.3.17 లక్షలకోట్ల అప్పు చేసి తెలంగాణను పునర్నిర్మించామని, జీఎస్డీపీలో దేశంలోనే అగ్రభాగాన నిలిపామని, సంపద పెంచి ప్రజలకు పంపిణీ చేశామని బీఆర్ఎస్ బల్లగుద్ది వాదిస్తున్నది.
కానీ కార్పొరేషన్ల పేర తెచ్చిన అప్పుల గురించి బీఆర్ఎస్ చెప్పడం లేదెందుకు? ప్రభుత్వ అప్పులు, కార్పొరేషన్ల పేర తెచ్చిన అప్పులు కలిపితే రూ. 7 లక్షల కోట్ల అప్పు ఉందనే విషయాన్ని బీఆర్ఎస్ యజమానులు చెప్పడం లేదెందుకో? పేదప్రజల ఉత్పాదకతను పెంచటం ఎలా? వారి కొనుగోలు శక్తిని పెరిగే మార్గాలేమిటి? అనే అంశాలను కేసీఆర్ విస్మరించి ధనికుల సంపదను పేదల సంపదగా లెక్కించి తెలంగాణ అంతా బంగారమైపోయిందనే భ్రమలు కల్పించారు.
కేసీఆర్ తలసరి ఆదాయం లెక్కల్లో రవ్వంత కూడా నిజం లేదని ఆర్థిక నిపుణలకూ తెలుసు. పదేండ్ల కేసీఆర్ మసిపూసి మారేడు కాయ చేయడంలో పాలన రాటుదేలింది. చివరకు తెలంగాణకు పుట్టెడు అప్పులు, గుదిబండల అభివృద్ధి మిగిల్చిపోయాడు. ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వ పరిస్థితి ఎలాంటిదంటే, గత పాలకుడి అనర్థ అప్పులన్నీ, ప్రస్తుత పాలకుడికి తిప్పలుగా మారాయి.
- ఎస్.కె. జకీర్, సీనియర్ జర్నలిస్ట్-