పాలనలో కాంగ్రెస్ సర్కారు ఫెయిల్​ : ప్రభాకర్

పాలనలో కాంగ్రెస్ సర్కారు ఫెయిల్​ : ప్రభాకర్
  • బీజేపీ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనలో విఫలమవుతోందని, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా విశ్వాసం కోల్పోతున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. సీఎల్పీ మీటింగ్​లో సీఎం చేసి న వ్యాఖ్యలతో ఆయనలోని నిరాశ, నిస్పృహ స్పష్టంగా కన్పిస్తోందని తెలిపారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి దివాలా స్థితికి చేరుకోవడంతో పాటు శాంతిభద్రతలు, సంక్షేమం అన్నీ తీవ్రంగా దెబ్బతిన్నాయనడానికి.. తాజా రాజకీయ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయని ఆయన చెప్పారు.

 బుధవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి తన పార్టీ ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పనిచేయడం లేదని, విపక్షాల విమర్శలకు తగిన సమాధానం ఇవ్వడం లేదని పేర్కొన్నారంటే.. సీఎల్పీపై ఆయనకు ఉన్న అవిశ్వాసం స్పష్టంగా తెలుస్తోందని పేర్కొన్నారు. ఏఐసీసీ పరిశీలకురాలు మీనాక్షి నటరాజన్ ఒక రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కార్పొరేటర్లు తమ అంతరాత్మ ప్రకారం ఓటు వేయాలని కోరారు.