యాదాద్రి, వెలుగు : భువనగిరి లోక్‌సభ స్థానంలో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు రంగంలోకి దిగాయి. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా మిర్యాలగూడకు బదులు 2009లో భువనగిరి లోక్‌సభ స్థానం ఏర్పడింది.18 లక్షలకు పైబడి ఓటర్లున్న ఈ నియోజకవర్గం రంగారెడ్డి, నల్గొండ, యాదాద్రి, సూర్యాపేట, జనగాం, సిద్దిపేట (చేర్యాల మండలం) జిల్లాల్లో విస్తరించి ఉంది. ఈ జిల్లాల్లోని ఇబ్రహీంపట్నం, మునుగోడు, నకిరేకల్, భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, జనగామ శాసనసభ నియోజకవర్గాలుగా ఉన్నాయి. భువనగిరి స్థానానికి ఇప్పటివరకు మూడు సార్లు లోక్‌సభ ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ రెండుసార్లు, బీఆర్ఎస్ఒకసారి గెలిచాయి. ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో గెలిచి తీరాలని కాం గ్రెస్, బీఆర్ఎస్ పట్టుదలతో ఉండగా..ఈసారైనా బోణీ కొట్టాలని బీజేపీ ఆరాటపడుతోంది. మరోవైపు తమ ఓట్లు తామే సాధించుకొని సత్తా చాటుతామని సీపీఎం బరిలోకి దిగింది.
మూడోసారి ‘చే’జిక్కించుకోవడానికి..
భువనగిరి లోక్‌సభ నియోజకవర్గానికి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఇన్చార్జిగా ఉన్నారు. ఈ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి కాంగ్రెస్‌కు అనుకూలంగానే ఉంది. 2009లో జరిగిన మొదటి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పోటీ చేసి గెలిచారు. 2014 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి నల్లు ఇంద్రసేనారెడ్డి ఓట్లు చీల్చడంతో బీఆర్ఎస్ నుంచి బరిలో నిలిచిన బూర నర్సయ్య గౌడ్ గెలుపొందారు. ఆరు అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలిచారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భువనగిరి లోక్‌సభ పరిధిలోని జనగామ మినహా మిగిలిన ఆరు స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుని 8,17,279 ఓట్లు రాబట్టుకుంది. సిట్టింగ్స్థానాన్ని కాపాడుకోవాలనే లక్ష్యంతో ఈ నియోజకవర్గ కాంగ్రెస్‌పార్టీ ఇన్చార్జి రాజగోపాల్‌రెడ్డి పోటా పోటీగా ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్అధికారంలోకి రావడం, హామీ ఇచ్చినట్టు ఆరు గ్యారంటీల్లో కొన్నింటిని ఇప్పటికే అమలు చేస్తుండడంతో గెలుపు తమదే అన్న ధీమాలో కాంగ్రెస్ ఉంది. మెజారిటీ అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్యేలు ఉండడంతో భారీ మెజారిటీ వస్తుందని ఆశిస్తోంది.
రెండోసారి గెలవాలని బీఆర్ఎస్ ఆశ
2014 లోక్ సభ ఎన్నికల్లో ఈ స్థానంలో పాగా వేసిన బీఆర్ఎస్ మళ్లీ ఇప్పుడు గెలిచి తీరాలనే పట్టుదలతో ఉంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచినప్పటికీ 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ (ఇప్పటి బీజేపీ అభ్యర్థి) స్వల్ప ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతిలో ఓడి పోయారు. తర్వాత జరిగిన పరిణామాలతో నర్సయ్యగౌడ్ పార్టీని వీడడంతో ఇబ్రహీంపట్నంకు చెందిన బీసీ నేత క్యామ మల్లేశ్‌ను బీఆర్ఎస్ తమ అభ్యర్థిగా ప్రకటించింది. ఇప్పుడు ఒక జనగామలో మాత్రమే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నా...భువనగిరి పరిధిలోనూ బీఆర్ఎస్ కొంత బలంగానే ఉంది. బీసీల్లో పెద్ద సామాజిక వర్గమైన కురుమ,యాదవ ఓట్లు ఎక్కువగా ఉన్నందున లాభిస్తుందని అనుకుంటున్నారు. మాజీ సీఎం కేసీఆర్ప్రచారం కలిసి వస్తుందని ఆ పార్టీ కేడర్భావిస్తోంది. అయితే అసెంబ్లీ ఓటమి షాక్ నుంచి ఆ పార్టీ కేడర్ఇంకా తేరుకోలేదు. అనధికార ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో నియోజకవర్గాల వారీగా ఇప్పటికే సమావేశాలు పూర్తి చేసినా కేడర్‌లో ఉత్సాహం రావడం లేదు. దీంతో ప్రచారం ఇంకా ఊపందుకోలేదు. మాజీ ఎమ్మెల్యేలు కూడా ప్రచారంలో ఇంకా పూర్తి స్థాయిలో మమేకం కావడం లేదు.
బోణీ కొట్టాలని బీజేపీ..
ఈ ఎన్నికల్లో ఎలాగైనా భువనగిరిలో గెలిచి బోణీ కొట్టాలని బీజేపీ భావిస్తోంది. గత మూడు ఎన్నికల్లోనూ ఇక్కడ బీజేపీ ఓడిపోయింది. 2009 ఎన్నికల్లో 4.1 శాతం (45,808) ఓట్లు మాత్రమే వచ్చాయి. 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేయగా ఉమ్మడి అభ్యర్థి నల్లు ఇంద్రసేనారెడ్డికి 15.1 శాతం (1,82,817) ఓట్లు వచ్చాయి. 2019 ఎన్నికల్లో 5.4 శాతం (65,222) ఓట్లు వచ్చాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భువనగిరి లోక్‌సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో కలిపి 74,782 ఓట్లు మాత్రమే రాబట్టుకోగలిగారు. ఈ ఫలితాలు బీజేపీకి పూర్తి నిరాశను కలిగించినా.. లోక్‌సభ ఎన్నికలపై భారీ ఆశలు పెట్టుకుంది. బీసీల్లో పెద్ద సామాజకవర్గమైన గౌడ్స్ఓట్లు ఇక్కడ ఎక్కువగా ఉండగా తమకు కలిసి వస్తుందని ఆ పార్టీ భావిస్తోంది. ఇటీవలే అయోధ్యలో రామాలయం ప్రారంభం కావడంతో ఆ అంశాన్ని ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నారు. మోదీ మళ్లీ ప్రధాని అయితే దేశం అభివృద్ధిలో పరుగులు పెడుతుందని చెబుతూ ఓట్లడుగుతున్నారు. మోదీ, రాముడితో పాటు జాతీయ అంశాలతో ఓట్లు కొల్లగొట్టాలనే ప్లాన్‌తో ఉన్నారు. అయితే బీజేపీ సీనియర్లు ప్రచారంలో పాల్గొనకపోవడం, కేడర్ఉత్సాహంగా లేకపోవడం ఇక్కడ వీరికి మైనస్.
సత్తా చూపాలని సీపీఎం..
రాష్ట్రంలో సీపీఎం పోటీ చేస్తున్న ఏకైక స్థానం భువనగిరి. ఈ సీటులో ఆ పార్టీ యాదాద్రి జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ పోటీ చేస్తున్నారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు నేతృత్వంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. పార్టీ సభ్యులు, ప్రజా సంఘాల్లోని సభ్యులను కలుస్తున్నారు. ‘మన ఓట్లు మనం వేసుకొని సత్తా చూపుదాం’ అంటూ ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర స్థాయి లీడర్లు కూడా ఇక్కడి ప్రచారంలో పాల్గొంటున్నారు. 2009లో జరిగిన ఎన్నికల్లో మహాకూటమి తరపున సీపీఎం నుంచి నోముల నర్సింహయ్య పోటీ చేసి 3,63,143 ఓట్లు సాధించారు. 2014 ఎన్నికల్లో తక్కువగా 54,035 ఓట్లు మాత్రమే వచ్చాయి. 2019 వచ్చేసరికి సీపీఎం మద్దతుతో పోటీ చేసిన సీపీఐకి 28,135 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈసారి పార్టీ, ప్రజా సంఘాల సభ్యులైన మూడు లక్షల మందిలో కనీసం లక్ష ఓట్లు సాధించాలని సీపీఎం భావిస్తోంది. అయితే హేమాహేమీల మధ్య మనం ఎక్కడ అన్నట్టుగా సీపీఎం క్యాడర్నిరుత్సాహంగా ఉంది.
కాంగ్రెస్‌కు 8 లక్షల ఓట్లు
భువనగిరి లోక్‌సభ పరిధిలో 18,08,585 ఓట్లున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో భువనగిరి పరిధిలోని కాంగ్రెస్‌కు 8,17,279 ఓట్లు రాగా, బీఆర్ఎస్కు 5,60,002 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌తో పోలిస్తే 2.57 లక్షల ఓట్లు తక్కువగా వచ్చాయి. బీజేపీకి కేవలం 74,782 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ ఎన్నికల్లో 70 నుంచి 80 శాతం పోలింగ్‌నమోదు అవుతుందని భావించినా 13 నుంచి 14 లక్షలకు పైగా ఓట్లు పోలయ్యే అవకాశం ఉంటుంది. దీన్ని బట్టి గెలిచే అభ్యర్థికి 5 లక్షల నుంచి 6 లక్షల ఓట్లు రావాల్సి ఉంటుంది. ఇప్పుడున్న అంచనాల ప్రకారం ఈ స్థాయిలో ఓట్లు కాంగ్రెస్‌కు మాత్రమే వచ్చే అవకాశం కన్పిస్తోంది. గడిచిన మూడు ఎన్నికల్లో రెండుమార్లు కాంగ్రెస్ 5 లక్షల ఓట్లకు మించి సాధించి గెలిచింది.