కేసీఆర్‍ 10 ఏండ్లల్లో ఎయిర్‍పోర్ట్​ ఎందుకుతేలే?

 కేసీఆర్‍ 10 ఏండ్లల్లో ఎయిర్‍పోర్ట్​ ఎందుకుతేలే?
  • ఎమ్మెల్యేలు నాయిని, రేవూరి, నాగరాజు, ఎంపీ కావ్య

వరంగల్‍, వెలుగు: మామునూర్‍ ఎయిర్​ పోర్ట్​అనుమతి అప్పటి సీఎం కేసీఆర్‍, మాజీ మంత్రి కేటీఆర్‍ వల్లనేనని మాట్లాడుతున్న బీఆర్‍ఎస్‍ నేతలు.. గత 10 ఏండ్ల పాలనలో ఎందుకు తేలేదని కాంగ్రెస్‍ ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. సోమవారం గ్రేటర్‍ వరంగల్ కాంగ్రెస్‍ భవన్​లో హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు, వరంగల్‍ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డి ఆధ్వర్యంలో  ప్రెస్‍మీట్‍ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ సీఎం రేవంత్‍రెడ్డి వరంగల్​ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీ ప్రకారమే భూసేకరణ కోసం రూ.205 కోట్లు మంజూరు చేయడమే కాకుండా ఎప్పటికప్పుడు జీఎంఆర్‍ సంస్థతో సంప్రదింపులు జరిపితే ఎయిర్‍పోర్ట్​ అనుమతి లభించిందన్నారు. 

ఫాంహౌజ్‍ దాటని కేసీఆర్‍ పేరు చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు. కాకతీయ టెక్స్​టైల్‍ పార్క్​ రైతులకు ఎకరానికి రూ.9 లక్షలు ఇచ్చిన బీఆర్‍ఎస్‍ ప్రభుత్వం ఇప్పుడు మాత్రం ఎకరానికి రూ.4 కోట్లు ఇవ్వాలని డిమాండ్‍ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రైతులను కావాలనే రెచ్చగొట్టి ఎయిర్‍పోర్ట్​ పనులను అడ్డుకునే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ కాంగ్రెస్‍ ప్రభుత్వం ఎన్నికల హామీ ప్రకారం టెక్స్​టైల్‍ పార్క్, ​కోచ్‍ ఫ్యాక్టరీ, అండర్‍గ్రౌండ్‍ డ్రైనేజీ, మాస్టర్‍ప్లాన్‍, ఓఆర్‍ఆర్‍, ఐఆర్‍ఆర్‍ ఇలా ఒక్కొక్కటిగా అమలుచేస్తోందన్నారు. మామునూర్‍ ఎయిర్‍పోర్ట్​భూసేకరణ, నిర్మాణ పనుల కోసం టైం లిమిట్‍ పెట్టుకుని స్పెషల్‍ ఆఫీసర్‍ను నియమిస్తున్నట్లు తెలిపారు.

ఎమ్మెల్యే రేవూరి మాట్లాడుతూ ఎయిర్‍పోర్ట్​డిమాండ్‍ అనేది జిల్లాలో 40 ఏండ్లనుంచి ఉందని, రాష్ట్రంలో కాంగ్రెస్‍ ప్రభుత్వం వచ్చాక 253 ఎకరాల భూసేకరణకు 2024 నవంబర్‍ 11న కలెక్టర్‍కు ఆర్డర్స్​ఇస్తే కేసీఆర్‍, కేటీఆర్‍ చేశాడని చెప్పుకోవడమేంటని ప్రశ్నించారు. భూసేకరణలో ప్రస్తుతానికి 186 ఎకరాల సర్వే పూర్తి చేశామని,  వారాంతానికి మొత్తం పూర్తి చేస్తామన్నారు. ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ రేవంత్‍రెడ్డిపై వక్రభాష మాట్లాడే కేటీఆర్‍ సన్యాసి అంటూ ఫైర్‍ అయ్యారు. ఎలక్షన్‍ కోడ్‍ ఉందని తెలిసి కూడా ఎయిర్‍పోర్ట్​ముందట నిబంధనలకు విరుద్ధంగా టెంట్‍ వేసి హంగామా చేసిన నేతలపై సుమోటోగా కేసులు పెట్టాలన్నారు. 

స్థానిక ముస్లింలను పాకిస్తాన్‍ అనేలా మాట్లాడుతున్న బండి సంజయ్​తోపాటు కిషన్‍రెడ్డిపై ఫైర్‍ అయ్యారు. ఎయిర్‍పోర్ట్​అంశంతోపాటు ఇతర అభివృద్ధి పనులపై రివ్యూ చేసేందుకు ఈ నెల 9న జిల్లాలో పొంగులేటి, కోమటిరెడ్డి పర్యటించనున్నారని ఎమ్మెల్యేలు తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కుడా చైర్మన్‍ ఇనగాల వెంకట్రామిరెడ్డి, పార్టీ వరంగల్‍ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ నాయకులు పాల్గొన్నారు.