అదానీ ఇష్యూపై పార్లమెంట్ ఉభయ సభల్లో రెండో రోజు రగడ కొనసాగుతూనే ఉంది. అదానీ ఇష్యూపై చర్చకు కాంగ్రెస్ పట్టుబడుతోంది. కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ లోక్‌సభలో అదానీ లంచం ఆరోపణలపై జేపీసీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వాయిదా తీర్మానం ఇచ్చారు. కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ గౌతమ్ అదానీపై చర్చకు డిమాండ్ చేశారు. ఈ విషయంపై మోడీ ప్రభుత్వం మౌనం వహించడం భారతదేశ సమగ్రతను దెబ్బతీస్తుందన్నారు. అదానీతో ఉన్న స్నేహభంధంపై మోదీ వివరణ ఇవ్వాలన్నారు. మరో వైపు కాంగ్రెస్ ఎంపీ హిబీ ఈడెన్ మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు.. శాంతిభద్రతలపై చర్చించడానికి లోక్‌సభలో వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు.
నవంబర్ 25 న పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన రోజే ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అదానీ అంశం గురించి ప్రస్తావించారు.. మోడీ అదానీకి మద్దతుగా నిలుస్తున్నారని ఆరోపించారు ఖర్గే. ఈ అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో సభలో పరిస్థితి ఎంతసేపటికి అదుపులోకి రాకపోవటంతో సభను ఇవాళ్టికి నవంబర్ 27 వాయిదా వేశారు చైర్మెన్. ఇవాళ కూడా అదానీ ఇష్యూ పార్లమెంట్ లో ఆందోలన కొనసాగుతోంది.
Also Read:-మళ్లీ బ్యాలెట్ పేపర్లు తేవాలి...
గౌతమ్ అదానీపై అమెరికాలోని న్యూయార్క్ కోర్టులో క్రిమినల్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీతోపాటు మరో ఆరుగురికి కోర్టు అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. సోలార్ పవర్ కాంట్రాక్టులు పొందడం కోసం ఆంధ్రప్రదేశ్, ఒడిశా, చత్తీస్ గఢ్, తమిళనాడు, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాలకు చెందిన గుర్తుతెలియని అధికారులు, వ్యక్తులకు రూ. 2 వేల 200 కోట్ల లంచాలు ఇచ్చినట్లు కోర్టులో అభియోగాలు నమోదయ్యాయి.