
- హాజరుకానున్న పార్టీ రాష్ట్ర ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్
- నేడు మెదక్, మల్కాజిగిరి నియోజకవర్గాలపై..
- రేపు కరీంనగర్, ఆదిలాబాద్, పెద్దపల్లి సెగ్మెంట్లపై రివ్యూ
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాలఇన్చార్జ్గా బాధ్యతలు తీసుకున్న మీనాక్షి నటరాజన్ రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై దృష్టి పెట్టారు. ముఖ్యంగా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా పార్టీ బలోపేతం, నేతల మధ్య లోపించిన సమన్వయంపైనే ఆమె ప్రధానంగా కసరత్తు చేస్తున్నారు. త్వరలో జరగనున్న లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించాలంటే పార్టీ నేతల మధ్య సమన్వయం ముఖ్యమని ఆమె భావిస్తున్నారు. ఇదే సమయంలో బూత్ స్థాయిలో పార్టీ బలోపేతం కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై ఆమె పార్టీ నేతల అభిప్రాయాలను తీసుకోనున్నారు.
క్యాడర్ కు అందుబాటులో ఉంటూ జనం మధ్యలో ఉండే నేతలకే ప్రాధాన్యం ఇవ్వాలనేది ఆమె ప్రధాన ఉద్దేశంగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. గ్రూపులకు తావు లేకుండా అందర్ని కలుపుకొనిపోయే నేతలకే పార్టీ పదవుల్లో, నామినేటెడ్ పదవుల్లో తగిన న్యాయం చేయాలనేదే ఆమె లక్ష్యంగా కనిపిస్తోంది. ఇందులో భాగంగానే ఆమె మొదటగా లోక్ సభ నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మంగళ, బుధ వారాల్లో రెండు రోజుల పాటు ఐదు నియోజకవర్గాపై ఆమె సమీక్షలు నిర్వహించనున్నారు.
మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు మెదక్, సాయంత్రం 5 గంటలకు మల్కాజిగిరి లోక్ సభ నియోజకవర్గాల సమీక్ష గాంధీ భవన్ లో జరగనుంది. బుధవారం ఉదయం 11 గంటలకు కరీంనగర్, మధ్యాహ్నం 2 గంటలకు ఆదిలాబాద్, సాయంత్రం 5 గంటలకు పెద్దపల్లి లోక్ సభ నియోజకవర్గాల సమీక్ష సమావేశాలు గాంధీ భవన్ లో జరగున్నాయి. పీసీసీ చీఫ్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశాలకు ఆయా జిల్లాల ఇన్చార్జ్ మంత్రులు, మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, కార్పొరేషన్ల చైర్మన్లు హాజరుకానున్నారు.