కేంద్ర విధానాలపై కాంగ్రెస్ పోరు..తెలంగాణకు రానున్న రణదీప్ సూర్జేవాలా

కేంద్ర విధానాలపై కాంగ్రెస్ పోరు..తెలంగాణకు రానున్న రణదీప్ సూర్జేవాలా
న్యూఢిల్లీ, వెలుగు: కేంద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై కాంగ్రెస్ పోరుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా సోమవారం నుంచి దేశవ్యాప్తంగా ప్రెస్‌‌‌‌మీట్లు పెట్టి.. ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీని నిలదీయనుంది. ఈ నెల 21 నుంచి 24 వరకు దేశంలోని 57 నగరాల్లో ప్రెస్‌‌‌‌మీట్లు నిర్వహించనున్న 57 మంది నాయకుల పేర్లతో కూడిన లిస్టును పార్టీ హైకమాండ్ ఆదివారం రాత్రి రిలీజ్ చేసింది. ఇందులో తెలంగాణకు పార్టీ సీనియర్ నేత రణదీప్ సూర్జేవాలాను ఎంపిక చేసింది. 

ఏపీ, గుజరాత్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, కేరళ, తమిళనాడు తదితర రాష్ట్రాలకు ఇద్దరి కంటే ఎక్కువ మంది నేతలను ఎంపిక చేసింది. వీరంతా నాలుగు రోజుల పాటు ఆయా రాష్ట్రాల్లో ప్రెస్‌‌‌‌మీట్లు పెట్టి.. బీజేపీ చెబుతున్న అబద్ధాలు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, రాజ్యాంగాన్ని దెబ్బతీసేందుకు, స్వాతంత్ర్య పోరాట చరిత్రను మార్చేందుకు చేస్తున్న ప్రయత్నాలను ప్రజలకు వివరించనున్నట్టు కాంగ్రెస్ పేర్కొంది. కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రతిపక్ష నేతలపై ప్రయోగిస్తున్న తీరునూ వివరిస్తామని తెలిపింది.