గుజరాత్‌లో అధికారంలోకి వస్తే అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం పేరును సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియంగా మారుస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం ఆ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. రాష్ట్రంలో 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న కాంగ్రెస్ ... ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని పేర్కొంది. రాష్ట్రంలోని వితంతువులు, వృద్ధులకు నెలకు రూ. 2,000 చొప్పున ఫించన్ మంజూరు చేస్తామని తమ మేనిఫెస్టోలో పేర్కొంది.
అంతేకాకుండా 3,000 ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లను ఏర్పాటు చేస్తామని, రాష్ట్రంలోని బాలికలకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఉచిత విద్యను అందిస్తామని మేనిఫెస్టోలో తెలిపింది. ఇక రైతులకు రూ. 3 లక్షల వరకు రుణమాఫీ , 300 యూనిట్ల ఉచిత విద్యుత్, నిరుద్యోగులకు రూ. 3,000 నిరుద్యోగ భృతి, రూ. 500 కే గ్యాస్ సిలిండర్లు అందిస్తామని కాంగ్రెస్ వాగ్దానాలు చేసింది.
గుజరాత్‌లోని ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం విపరీతమైన అవినీతికి పాల్పడుతోందని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే గత 27 ఏళ్లలో జరిగిన అన్ని అవినీతి ఫిర్యాదులపై విచారణకు ఆదేశించి, దోషులపై కేసులు నమోదు చేస్తామని వెల్లడించింది. గుజరాత్‌లో డిసెంబర్ 1, 5 తేదీల్లో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు జరగనుంది.