ఖమ్మం, వెలుగు: ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ కి పూర్వ వైభవం తెచ్చేందుకు ఆ పార్టీ నేతలు చేస్తున్న ప్రయత్నాలకు లీడర్ల మధ్య అనైక్యత అడ్డంకిగా మారుతోంది. వర్గాలుగా విడిపోయిన ముఖ్య నేతల మధ్య సఖ్యత తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో పార్టీ నుంచి బయటకు లీడర్లు వలసలు వెళ్లారు. కాగా ఇప్పుడు ఇతర పార్టీల నుంచి చేరికలను ప్రోత్సహించేందుకు చేస్తున్న ప్లాన్ లకు కూడా అదే ఇబ్బందికరంగా మారింది. దీంతో పార్టీని మళ్లీ గాడిన పెట్టే ప్రయత్నాల్లో భాగంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈ రోజు(సోమవారం) ఖమ్మం రానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ చేపట్టిన నిరుద్యోగ నిరసన ర్యాలీల్లో భాగంగా ఖమ్మంలోని ఇల్లందు క్రాస్ రోడ్ నుంచి పాత బస్టాండ్వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. పాత బస్టాండ్వద్ద జరిగే సభలో రేవంత్ మాట్లాడనున్నారు. మాజీ కేంద్రమంత్రి రేణుకాచౌదరితో పాటు మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, మాజీ ఎంపీ వి.హనుమంతరావు ఇతర ముఖ్యనేతలు విచ్చేయనున్నారు. 10 నియోజకవర్గాల నుంచి భారీ సంఖ్యలో కేడర్ ను, నిరుద్యోగులను రప్పించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే జిల్లాకు చెందిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కనిపించడం లేదు. ఆయన ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో ‘హాత్ సే హాత్ జోడో యాత్ర’ నిర్వహిస్తున్నారు.
కేడర్ ఉన్నా.. ఐక్యత లేని లీడర్లు..
ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్పార్టీకి పటిష్టమైన క్యాడర్ఉంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 10 నియోజకవర్గాలకు గాను టీఆర్ఎస్ ను ఒక్కస్థానానికే పరిమితం చేయడం ద్వారా కాంగ్రెస్ కూటమి రాష్ట్రంలోనే ఈ జిల్లాలో తమ బలాన్ని చాటుకుంది. ఆరు స్థానాల్లో కాంగ్రెస్, రెండు చోట్ల టీడీపీ, ఒక సెగ్మెంట్ లో కాంగ్రెస్ టికెట్ ఆశించి ఇండిపెండెంట్ గా పోటీ చేసిన అభ్యర్థి విజయం సాధించారు. ఆ తర్వాత ఒక్కొక్కరుగా కాంగ్రెస్, టీడీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరారు. చివరకు కాంగ్రెస్ లో ఉమ్మడి జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు. నాలుగేళ్ల కింద అత్యంత బలంగా కనిపించిన హస్తం పార్టీ కాస్తా ఇప్పుడు వలసలతో బలహీనంగా కనిపిస్తోంది. నేతల మధ్య ఐక్యత లేకపోవడం, ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్లు కూడా పార్టీ మారడంతో కేడర్నిరుత్సాహానికి గురయ్యారు. లీడర్లు లేకున్నా ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో కనీసం10 వేల నుంచి15 వేల సంప్రదాయ ఓటర్లు ఆ పార్టీకి ఉన్నారు. నాలుగేళ్లుగా సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, మాజీ కేంద్ర మంత్రి రేణుకాచౌదరి వర్గాలుగానే కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయా అసెంబ్లీ సెగ్మెంట్లలో చేసే ప్రోగ్రాంలల్లో కూడా లీడర్లు, కేడర్ మధ్య ఐక్యత కనిపించడం లేదు.
పొంగులేటి కేంద్రంగా సాగుతున్న చర్చ..
జిల్లాలో గతేడాది 500కు పైగా కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేసిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టి ప్రస్తుతం కంటిన్యూ చేస్తున్నారు. ఇక రేణుకాచౌదరి కూడా అప్పుడప్పుడు జిల్లాలో జరిగే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాక రేణుక వర్గం ఆయనతో సన్నిహితంగా ఉంటుండగా, భట్టితో రేవంత్ కు ఉన్న అభిప్రాయభేదాల ప్రభావం జిల్లాలోని ఆయన వర్గంపై కూడా కనిపిస్తోంది. ఇక ఇటీవల మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో రాహుల్టీమ్ హైదరాబాద్ లో భేటీ అయ్యారన్న ప్రచారం నేపథ్యంలో జిల్లాలోనూ దీనిపై చర్చ నడుస్తోంది. ఉమ్మడి జిల్లా పరిధిలో మధిర మినహా మిగిలిన 9 అసెంబ్లీ సెగ్మెంట్లనూ తన వర్గానికి కేటాయించాలని పొంగులేటి కండిషన్ పెట్టారనే ప్రచారం సాగుతోంది. కాగా దీన్ని భట్టి, రేణుకా చౌదరి వ్యతిరేకించారన్న టాక్వినిపిస్తోంది. ఇదే సమయంలో ముఖ్యనేతల మధ్య అనైక్యత కారణంగా పార్టీలో ఉన్న నిస్తేజ పరిస్థితులను తొలగించేందుకు పొంగులేటి లాంటి లీడర్ చేరిక ఉపయోగపడుతుందని కేడర్అభిప్రాయపడుతోంది. ఇలాంటి చర్చలు, ప్రచారాల నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఖమ్మం వస్తుండడం, జిల్లా కేంద్రంగా పొంగులేటి చేరికతోపాటు పార్టీ పటిష్టతపై ఆయన ఎలాంటి స్పష్టత ఇస్తారు, ఏం కామెంట్లు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. పార్టీని నమ్ముకున్న కేడర్మాత్రం బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఉమ్మడి జిల్లాలో ముఖ్య నేతలు ఐక్యంగా పనిచేయడంతో పాటు, పొంగులేటి లాంటి ఆర్థిక, కార్యకర్తల బలమున్న నాయకుడిని పార్టీలోకి స్వాగతించాలని కోరుకుంటున్నారు.