
- అలా చేస్తే కఠిన చర్యలు తప్పవు: మీనాక్షి నటరాజన్
- పని చేస్తున్నది ఎవరో? యాక్టింగ్ చేస్తున్నది ఎవరో? నాకు తెలుసు
- నా పనితీరు నచ్చకపోతే హైకమాండ్‌కు ఫిర్యాదు చేయొచ్చు
- ఆదిలాబాద్, పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గాల రివ్యూ మీటింగ్‌లో కాంగ్రెస్ స్టేట్ ఇన్‌చార్జ్
హైదరాబాద్, వెలుగు: పార్టీ కోసం పనిచేస్తున్నది ఎవరు? పని చేసినట్టు యాక్టింగ్ చేస్తున్నది ఎవరు? అనేది తనకు తెలుసని కాంగ్రెస్ స్టేట్ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ అన్నారు. ఆదిలాబాద్, పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై బుధవారం రివ్యూ మీటింగ్ జరిగింది. అంతకుముందు పీసీసీ అనుబంధ సంఘాల రాష్ట్ర అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీనాక్షి నటరాజన్ మాట్లాడారు. ‘‘నేతలు తమ ప్రాంత పరిధిలో పార్టీ పరిస్థితి, వారు చేపట్టిన కార్యక్రమాలపై నాకు నివేదికలు ఇవ్వకపోయినా.. ఎవరి పనితీరు ఏంటనేది? నా వద్ద అన్ని నివేదికలు ఉంటాయి. పార్టీలోని అంతర్గత విషయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు చెప్పొద్దు.
అలా ఎవరైనా చేస్తే చర్యలు తప్పవు. ఎవరికైనా నా పనితీరు నచ్చకపోతే.. సోనియా, రాహుల్‌కు ఫిర్యాదు చేయవచ్చు” అని ఆమె చెప్పారు. పదేండ్లు పార్టీ కోసం పని చేసిన వారికే కార్పొరేషన్, డీసీసీ పదవులివ్వాలని.. లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా వారికే టికెట్లలో ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. పార్టీ లైన్ ఎవరూ దాటవద్దని, ఈ విషయంలో ఎవరినీ ఉపేక్షించేది లేదన్నారు. పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశాలకు ఏఐసీసీ కార్యదర్శులు విశ్వనాథం, విష్ణునాథ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, శ్రీధర్ బాబు, ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, వినోద్ తదితరులు హాజరయ్యారు.
పదవులిచ్చినా పని చేస్తలేరు: పీసీసీ చీఫ్
పార్టీలో క్రమశిక్షణ చాలా ముఖ్యమని పీసీసీ చీఫ్మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ అనుబంధ సంఘాల్లో తాను, మీనాక్షి నటరాజన్ పని చేయడం వల్లనే.. ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామని చెప్పారు. పార్టీలో చిత్తశుద్ధితో, అంకితభావంతో పనిచేస్తే పదవు లు అవే వస్తాయని తెలిపారు. ‘‘చాలామంది నేతలకు పదవులు ఇచ్చాం. కార్పొరేషన్ చైర్మన్లుగా పదవులిచ్చి ఏడాది దాటుతున్నా.. ఇంకా చాలామంది బాధ్యతగా పనిచేయడం లేదు. పదవులు పొందినవారు.. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఇష్టానుసారంగా విమర్శలు చేస్తే ఎందుకు స్పందించడం లేదు? కలిసి కట్టుగా ఉంటే అద్భుతమైన ఫలితాలను సాధిస్తాం” అని అన్నారు. డీసీసీ చీఫ్‌లను ఇక నుంచి సెలెక్ట్ అండ్ ఎలెక్ట్ పద్ధతిలో నియమించాలని నిర్ణయించినట్టు తెలిపారు.
మూడు గ్రూపులుగా నేతల విభజన..
కాంగ్రెస్‌లో పాత, కొత్త నేతల మధ్య సఖ్యత కుదిర్చేందుకు, బూత్‌ల వారీగా పార్టీని బలోపేతం చేసేందుకు నేతలను మూడు గ్రూపులుగా విభజించించారు. ఫస్ట్ గ్రూప్‌లో మొదటి నుంచి కాంగ్రెస్‌లో ఉన్నవారు, రెండో గ్రూప్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీలో చేరినవారు, మూడో గ్రూప్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేరినవారు ఉన్నారు. పార్టీ పదవులు, నామినేటెడ్ పదవులను భర్తీ చేయడంలో ఈ గ్రూప్‌లను పరిగణనలోకి తీసుకొని ప్రాధాన్యం ఇవ్వాలని మీనాక్షి నటరాజన్ నిర్ణయించారు.
జిల్లా బాధ్యతల నుంచి తప్పుకుంట: సీతక్క
ఆదిలాబాద్ లోక్‌సభ నియోజకవర్గ స్థాయి ముఖ్య నేతల సమావేశంలో మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రిగా ఉన్న ఆమె.. ఆదిలాబాద్ లోక్‌సభ పరిధిలోని కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌ల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వాళ్ల పనితీరు ఏమాత్రం బాగా లేదని చెప్పారు. కేబినెట్ విస్తరణ తర్వాత ఆదిలాబాద్ జిల్లా బాధ్యతల నుంచి తప్పుకుంటానని తెలిపారు. అయితే మంత్రి సీతక్కపై సిర్పూర్ ఇన్‌చార్జ్ శ్రీనివాస్ మీటింగ్‌లో మీనాక్షి నటరాజన్‌కు ఫిర్యాదు చేశారు. సీతక్క ఫోన్ ఎత్తడం లేదని ఆయన చేసిన ఫిర్యాదుపై మీనాక్షి సీరియస్ అయ్యారు.
చేసిందీ చెప్పుకోలేకపోతున్నం: ఎంపీ వంశీకృష్ణ
కాంగ్రెస్ సోషల్ మీడియా చాలా వీక్‌గా ఉందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. ‘‘మనం ఏడాదిన్నర కాలంలో ఎన్నో ప్రజోపయోగ పథకాలను ప్రవేశపెట్టాం. అయినా వీటికి జనం నుంచి అనుకున్న స్థాయిలో ఆదరణ లభించడం లేదు. మనం చేసింది చెప్పుకోలేకపోతున్నం. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా మన ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నది.
అదే స్థాయిలో మన సోషల్ మీడియా సరైన కౌంటర్ ఇవ్వలేకపోతున్నది” అని అన్నారు. సీనియర్ నేత దొమ్మాటి సాంబయ్యకు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని వరంగల్ జిల్లాకు చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలు మీనాక్షి నటరాజన్‌ను కోరారు. బుధవారం గాంధీభవన్‌కు వచ్చి ఆమెను కలిసి విజ్ఞప్తి చేశారు. వీరిలో ఎంపీ కడియం శ్రీహరి, పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు.
కాళేశ్వరం అవినీతిలో అరెస్టులు ఎందుకు లేవ్: వివేక్ వెంకటస్వామి
కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగినట్టు అన్ని ఆధారాలు ఉన్నా... ఇందులో దోషులైన కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులను అరెస్టు చేయడంలో ఎందుకు ఆలస్యం జరుగుతున్నదని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ప్రశ్నించారు. దీనిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ.. కమిషన్ వేశామని, నివేదిక వచ్చిన తర్వాత చర్యలు ఉంటాయని చెప్పారు.