
- హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మా వ్యూహం మాకుంది: పొన్నం
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ లోకల్‌బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ సభ్యులంతా పాల్గొంటామని.. పార్టీ హైకమాండ్ చెప్పిన వారికే ఓటు వేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఈ ఎన్నిక విషయంలో తమ వ్యూహం తమకు ఉందని తెలిపారు. ఎన్నికలను మతానికి ముడిపెట్టి రెచ్చగొడుతున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ పై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామన్నారు. మంగళవారం గాంధీ భవన్ లో మీడియాతో పొన్నం మాట్లాడారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్పొరేటర్ల ఇండ్ల ముందు బీజేపీ నేతలు ఫ్లెక్సీలు కట్టి ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ‘బీజేపీకి ఓటు వేయకపోతే హిందువు కాదా?’ అని బండి సంజయ్ ని పొన్నం ప్రశ్నించారు. ఇది కార్పొరేటర్లను బ్లాక్ మెయిల్ చేయడమేనని ఆయన ఫైర్ అయ్యారు. బీజేపీ, బీఆర్‌ఎస్ కలిసి పోటీ చేసేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రయత్నం చేశారని.. అది బెడిసి కొట్టడంతో హిందుత్వం పేరుతో రెచ్చగొట్టే చర్యలకు దిగారని ధ్వజమెత్తారు. బీజేపీ ఇంత రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నా.. ఎన్నికల కమిషన్ ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు.