
- నేడు పాలమూరులో పీసీసీ కార్యవర్గ సభ్యుల పర్యటన
- హాజరుకానున్న ఎమ్మెల్యేలు, మాజీలు, ఇతర లీడర్లు
- మండల, బ్లాక్ కాంగ్రెస్, డీసీసీ అధ్యక్షుల ఎంపికకు పేర్ల పరిశీలన
- రానున్న లోకడ్ బాడీస్ ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు
మహబూబ్‌నగర్, వెలుగు : కాంగ్రెస్ హైకమాండ్ సంస్థాగత పదవులను భర్తీ చేసేందుకు సిద్ధమైంది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన పార్టీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోగా.. జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. మండల, బ్లాక్ కాంగ్రెస్, డీసీసీ అధ్యక్షులను నియమించేందుకు చర్యలు తీసుకుంటోంది. ప్రతి జిల్లాకు ఇద్దరు అబ్జర్వర్లను నియమించగా.. పాలమూరు జిల్లాకు పీసీసీ కార్యవర్గ సభ్యులుగా ఉన్న సాంబయ్య, భాస్కర్ యాదవ్‌ను నియమించారు. వీరు మంగళవారం జిల్లా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ లీడర్లు, ఆయా మండలాల అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులతో సమావేశం కానున్నారు. సమావేశంలో కొత్త అధ్యక్షులపై చర్చించనున్నారు.
మండల స్థాయి నుంచి సమావేశాలు..
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్ష పోస్టులు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నాయి. దాదాపు నాలుగైదు ఏండ్లుగా కొందరే కొనసాగుతున్నారు. మరికొందరు గత ప్రభుత్వ హయాంలో పార్టీలు మారగా.. వారి స్థానాలు ఖాళీగా ఉన్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కొన్ని మండలాల్లో ఎమ్మెల్యేలతో మండలాధ్యక్షులకు మధ్య విభేదాలు రావడంతో వారు పార్టీని వీడారు. గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం కావాలంటే ఈ పదవులను భర్తీ చేయాలి. ఇందులో భాగంగా మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయి సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం జిల్లా స్థాయి సమావేశం నిర్వహించనుంది. మే 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నియోజకవర్గ స్థాయి, 13వ తేదీ నుంచి 20 తేదీ వరకు మండల స్థాయి సమావేశాలు జరగనున్నాయి.
స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే మండల, బ్లాక్, జిల్లా స్థాయి పదవులను నింపేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ మేరకు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ లీడర్ల నుంచి ఈ పదవులకు పోటీ పడుతున్న వారి పేర్లను తీసుకోనుంది. ఇందులో నుంచి అధ్యక్షుడి పదవికి ఐదుగురి పేర్లు, బ్లాక్ కాంగ్రెస్ పదవులకు నలుగురు పేర్లను, డీసీసీ పదవికి ముగ్గురు పేర్లను పీసీసీకి పంపుతారు. వారు ఫైనల్పేర్లను లిస్ట్ అవుట్ చేసి ఏఐసీసీ ఆమోదానికి పంపించనున్నారు. ఇందులో డీసీసీ పదవులను ఈ వారంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.
డీసీసీ పోస్టుకు భారీ డిమాండ్
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటంతో డీసీసీ పోస్టు హాట్ కేకులా మారింది. దీంతో పదవి కోసం లీడర్ల మధ్య పోటీ ఎక్కువైంది. ఈ పదవి సామాజిక సమీకరణల ఆధారంగా కేటాయిస్తారనే టాక్ నడుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు 2023లో జిల్లాల్లో హైకమాండ్ కొత్త డీసీసీలను నియమించింది. వీరిలో చాలా మంది డీసీసీలు గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. వీరికి వర్క్ బర్డన్ఎక్కువ కావడంతో గతేడాది వీరి స్థానంలో కొత్త వారిని నియమించడానికి ప్రయత్నాలు జరిగాయి. కానీ అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. రాష్ర్ట పార్టీ ఇన్చార్జిగా మీనాక్షి నటరాజన్ బాధ్యతలు తీసుకున్నాక.. ఈ పదవులను నియమించడాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఇందులో భాగంగా జిల్లాలకు అబ్జర్వర్లను ఏర్పాటు చేశారు. కాగా డీసీసీ పదవికి ఎక్కువ మంది ప్రయత్నాలు చేస్తున్నారు.
మూడు నియోజకవర్గాలకు చెందిన లీడర్లు తమ నియోజకవర్గానికి చెందిన సీనియర్ లీడర్‌కు ఈ పదవిని ఇవ్వాలని పట్టుబడుతున్నారు. కానీ జిల్లాలో ఓటర్లు బీసీలలోని ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వారు ఎక్కువగా ఉండటం.. ఈ సామాజిక వర్గానికి చెందిన వారిలో కాంగ్రెస్ సీనియర్ లీడర్లు కూడా ఉండటంతో.. వారికే ఇవ్వాలనే డిమాండ్లు తెరమీదకు వస్తున్నాయి. మైనార్టీ వర్గానికి చెందిన లీడర్లు కూడా ఈ పదవి కోసం పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఎన్పీ వెంకటేశ్, సంజీవ్ ముదిరాజ్, ఎస్.వినోద్ కుమార్, రాధా అమర్, జహీర్ అక్తార్, సిరాజ్ ఖాద్రి, రబ్బాని పేర్లు తెరమీదకు వస్తున్నాయి.
ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లడానికి..
రాష్ర్ట ప్రభుత్వం రైతులకు రూ.2 లక్షల రుణమాఫీతో పాటు ఇందిరమ్మ ఇండ్లు, అసైన్డ్ భూముల్లో సాగులో ఉన్న రైతులకు భూ హక్కు పట్టాలు, సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్, 200 యూనిట్లలోపు ఫ్రీ కరెంట్ తదితర స్కీములను ఇంప్లిమెంట్ చేస్తోంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఈ పదవులన్నింటినీ భర్తీ చేసి ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తోంది. ప్రతి గడపకు కాంగ్రెస్ పథకాలకు చేరే విధంగా చర్యలు తీసుకోవడంతో పాటు ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు సంస్థాగత పదవులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటోంది.